Promotes Horticulture with Subsidies: ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం
ABN , Publish Date - Sep 13 , 2025 | 04:51 AM
ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు వివిధ రాయితీలు అందిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను సమగ్ర..
ఉద్యాన శాఖ సంచాలకులు యాస్మిన్ బాషా
హైదరాబాద్, సెప్టెంబరు 12 (ఆంధ్రజ్యోతి): ఉద్యానవన పంటల సాగును ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రైతులకు వివిధ రాయితీలు అందిస్తోంది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను సమగ్ర ఉద్యాన అభివృద్ధి పథకం ద్వారా అందిస్తున్న రాయితీలు, నిధులను ఉద్యాన శాఖ సంచాలకులు యాస్మిన్ బాషా శుక్రవారం ప్రకటించారు. కొత్త తోటల విస్తీర్ణాన్ని పెంచేందుకు మామిడి, అరటి, జామ, బొప్పాయి, డ్రాగన్ ఫ్రూట్, అవకాడో, బత్తాయి వంటి పండ్ల తోటల సాగు కోసం 9,902 ఎకరాలకు రూ.18.48 కోట్లు కేటాయించారు. అలాగే, కూరగాయల సాగు కోసం 10 వేల ఎకరాల లక్ష్యాన్ని సాధించడానికి రూ.9.60 కోట్లు, 2,949 ఎకరాల్లో ఉల్లి సాగుకు రూ.2.35 కోట్లు, 2,549 ఎకరాల్లో పూల సాగుకు రూ.2.06 కోట్లు, 3,294 ఎకరాల్లో అల్లం, వెల్లుల్లి సాగుకు రూ.5.33 కోట్లు కేటాయించారు. ఈ అన్ని విభాగాల్లో రైతులకు 40 శాతం రాయితీని నేరుగా వారి ఖాతాల్లో జమ చేస్తారు. అదనంగా పుట్టగొడుగుల యూనిట్లకు రూ.1.08 కోట్లు, పాత తోటల పునరుద్ధరణకు రూ.2 కోట్లు, నీటి వనరుల సృష్టి కోసం రూ.2.73 కోట్లు, ప్లాస్టిక్ మల్చింగ్ కోసం రూ.14.24 కోట్లు కేటాయించారు. ఈ విభాగాలకు 40 నుంచి 50 శాతం వరకు రాయితీ లభిస్తుంది. అంతేకాకుండా, సేంద్రీయ సాగు, నర్సరీల ఏర్పాటు, విత్తన ప్రాసెసింగ్ యూనిట్లు, పాలీహౌజ్‌లు, కోల్డ్ స్టోరేజీలు, సౌర పంట, ఎండబెట్టే యంత్రాల వంటి యూనిట్ల ఏర్పాటుకు ప్రభుత్వం 30 నుంచి 50 శాతం వరకు రాయితీ ఇస్తున్నట్లు యాస్మిన్ బాషా తెలిపారు.