Share News

Minister Siddharth Babu: కార్పొరేట్‌కు దీటుగా విద్యారంగ అభివృద్ధి

ABN , Publish Date - Dec 22 , 2025 | 05:16 AM

కార్పొరేట్‌ రంగానికి దీటుగా ప్రభుత్వ బడులు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల అభివృద్దే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల .....

Minister Siddharth Babu: కార్పొరేట్‌కు దీటుగా విద్యారంగ అభివృద్ధి

  • 317 జీవో బాధితుల సమస్యలు పరిష్కరిస్తాం

  • టీఆర్టీఎఫ్‌ సదస్సులో శ్రీధర్‌బాబు, పొన్నం, అడ్లూరి

హైదరాబాద్‌, డిసెంబర్‌ 21 (ఆంధ్రజ్యోతి): కార్పొరేట్‌ రంగానికి దీటుగా ప్రభుత్వ బడులు, కళాశాలలు, ఉన్నత విద్యాసంస్థలు, విశ్వవిద్యాలయాల అభివృద్దే తమ ప్రభుత్వ లక్ష్యమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. విద్యారంగాన్ని అత్యంత ప్రాధాన్య రంగంగా భావిస్తున్నందునే సీఎం స్వయంగా విద్యాశాఖ నిర్వహిస్తున్నారన్నారు. తెలంగాణ రాష్ట్ర టీచర్స్‌ ఫెడరేషన్‌ (టీఆర్టీఎఫ్‌) ఏర్పాటై 80 ఏళ్లు పూర్తయిన నేపథ్యంలో ఆదివారం జరిగిన ‘80 వసంతాల అభ్యుదయోత్సవం-విద్యా సదస్సు’లో శ్రీధర్‌ బాబు ముఖ్య అతిథిగా మాట్లాడుతూ.. రాష్ట్ర సాధనలో ఉపాధ్యాయుల పాత్ర ఎనలేనిదని, అదే ఉద్యమ స్ఫూర్తితో ప్రభుత్వ పాఠశాలల్లో బడుగు, బలహీనవర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యనందించాలని టీచర్లను కోరారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ పాలనలో విద్యావ్యవస్థను నాశనం చేసి వెళ్లారని ఆరోపించారు. 11 వేల టీచర్‌ పోస్టుల భర్తీ కోసం డీఎస్సీ నిర్వహించి రికార్డు స్థాయిలో 4 నెలల్లోనే నియామకాలు పూర్తి చేశామన్నారు. విద్యారంగంలో సమూల సంస్కరణల కోసం విద్యా కమిషన్‌ ఏర్పాటు చేశామన్న శ్రీధర్‌బాబు.. దాని నివేదికను సంపూర్ణంగా అమలు చేస్తామన్నారు. పెండింగ్‌లో ఉన్న ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల ఆర్ధిక సమస్యలను సైతం సత్వరం పరిష్కరిస్తామని పేర్కొన్నారు. రాష్ట్ర రవాణా, బీసీ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ.. ఒక్కొక్కటిగా ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరిస్తున్నామన్నారు. 317 జీవో బాధితులకు న్యాయం చేయడానికి తమ సర్కారు కట్టుబడి ఉందని చెప్పారు. రాష్ట్ర సాంఘిక సంక్షేమశాఖ మంత్రి అడ్లూరు లక్ష్మణ్‌ కుమార్‌ మాట్లాడుతూ బడుగు, బలహీన వర్గాల పిల్లలకు నాణ్యమైన విద్యనందించేందుకు సర్వ హంగులతో రాష్ట్రంలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేడెడ్‌ స్కూళ్లతో విద్యావ్యవస్థలో పెనుమార్పు వస్తుందన్నారు. ఉపాధ్యాయులతో మంత్రి అడ్లూరి తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. సదస్సులో ముఖ్య వక్తగా ఉస్మానియా విశ్వవిద్యాలయ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ ప్రొఫెసర్‌ కాసిం మాట్లాడుతూ ఉపాధ్యాయులు తమ వృత్తి నిబద్దతను కాపాడుకోవడంతోపాటు సామాజిక బాధ్యతను పెంపొందించుకోవాలని కోరారు. సంక్షోభంలో ఉన్న విద్యను కాపాడే బాధ్యత కూడా ఉపాధ్యాయులదేనన్నారు. రాష్ట్ర బడ్జెట్లో విద్యకు 20ు బడ్జెట్‌ కేటాయించాలని డిమాండ్‌ చేశారు. ఈ సదస్సులో సంఘం అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కటకం రమేశ్‌, మారెడ్డి అంజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Updated Date - Dec 22 , 2025 | 05:16 AM