Telangana Government: గిరిజనుల సొమ్ము స్వాహాపై ప్రభుత్వం సీరియస్
ABN , Publish Date - Nov 26 , 2025 | 04:27 AM
రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్(జీసీసీ)లో అక్రమాలు, అవినీతిపై ప్రభుత్వం సీరియస్ అయింది. గిరిజనుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా నిర్వహిస్తున్న....
విచారణకు ఆదేశం... ‘ఆంధ్రజ్యోతి’ కథనానికి స్పందన
హైదరాబాద్, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్(జీసీసీ)లో అక్రమాలు, అవినీతిపై ప్రభుత్వం సీరియస్ అయింది. గిరిజనుల ఆర్థిక స్వావలంబనే లక్ష్యంగా నిర్వహిస్తున్న పెట్రోల్ బంకుల్లో నిధుల దుర్వినియోగంపై.. ‘గిరిజనుల సొమ్ము స్వాహా’ శీర్షికన ‘ఆంధ్రజ్యోతి’లో మంగళవారం ప్రచురితమైన కథనానికి ప్రభుత్వం స్పందించింది. జీసీసీల్లో అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని విచారణకు ఆదేశించింది. ఈ మేరకు గిరిజన సంక్షేమశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సవ్యసాచిఘోష్ మంగళవారం విచారణ చేశారు. జీసీసీ జీఎం సీతారాం నాయక్‌ను పిలిపించుకుని వివరాలు సేకరించారు. కాగా, సిబ్బందికి అవగాహన లేకపోవడం వల్ల కొన్ని చోట్ల నిధులు దుర్వినియోగం అయ్యాయని, ఇందుకు సంబందించి కొందరిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నామని జీఎం సీతారాం నాయక్ మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. దుర్వినియోగమైన సొమ్మును చాలా వరకు రికవరీ చేశామని, బంకులు మూతపడకుండా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు.