Share News

Healthcare Education: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో కొత్తగా 511 పీజీ సీట్లు

ABN , Publish Date - Dec 14 , 2025 | 06:37 AM

తెలంగాణలో వైద్యవిద్య బలోపేతానికి గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది.

Healthcare Education: ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో కొత్తగా 511 పీజీ సీట్లు

  • సీఎస్‌ఎస్‌ కింద రూ.327 కోట్లు కేటాయింపు

  • రూ.106 కోట్లు విడుదల

  • రాజ్యసభలో ఎంపీ అనిల్‌ ప్రశ్నకు కేంద్రం సమాధానం

హైదరాబాద్‌, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో వైద్యవిద్య బలోపేతానికి గట్టి చర్యలు తీసుకుంటున్నట్లు కేంద్రం వెల్లడించింది. రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్‌ కాలేజీల్లో కొత్తగా 511 పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ సీట్లను పెంచడంతో పాటు భారీగా నిధులను కేటాయించినట్లు తెలిపింది. ఈ మేరకు రాజ్యసభలో ఎంపీ అనిల్‌కుమార్‌ యాదవ్‌ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి అనుప్రియా పటేల్‌ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. రాష్ట్రంలోని ప్రభుత్వ వైద్య కళాశాలలను అప్‌గ్రేడ్‌ చేయడంతో పాటు పీజీ సీట్లను పెంచేందుకు కేంద్ర ప్రాయోజిత పథకం (సీఎస్ఎస్‌) కింద రూ.327.55 కోట్లు కేటాయించినట్లు తెలిపారు. వాటిలో కేంద్రం వాటా 60 శాతం కాగా రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులను సమకూర్చాల్సి ఉంటుంది. మొదటి విడతలో భాగంగా కేంద్రం ఇప్పటివరకు రూ.106.49 కోట్లు విడుదల చేసింది. ఆ నిధుల వినియోగానికి సంబంధించి తెలంగాణ రాష్ట్ర వైద్య సేవలు, మౌలిక సదుపాయాలభివృద్ధి సంస్థ (టీజీఎంఎస్ఐడీసీ) యూటిలైజేషన్‌ సర్టిఫికెట్‌ పంపించాల్సి ఉంటుంది. యూసీ పంపితే రెండో విడత నిధులు మరో రూ.96 కోట్లు విడుదల అవుతాయని వైద్య వర్గాలు వెల్లడించాయి.

మెజార్టీ సీట్లు, నిధులు ఉస్మానియా, సిద్దిపేటకే..

2024లో ప్రారంభమైన రెండో విడత సీసీఎస్‌లో భాగంగా రాష్ట్రానికి పీజీ సీట్లు, నిధులు మంజూరయ్యాయి. కేంద్రం విడుదల చేసిన గణాంకాల ప్రకారం.. హైదరాబాద్‌లోని ఉస్మానియా, సిద్దిపేటలోని ప్రభుత్వ వైద్య కళాశాలలకు అత్యధిక నిధులు, సీట్లు మంజూరయ్యాయి. ఉస్మానియా వైద్య కళాశాలలకు రెండు విడతలకు కలపి 145 పీజీ సీట్లు మంజూరు కాగా, సిద్దిపేటకు 80 సీట్లు దక్కాయి. వరంగల్‌ కాకతీయ మెడికల్‌ కాలేజీకి 89 సీట్లు దక్కినా... నిధుల పరంగా కేవలం రూ.10 కోట్లే మంజూరు అయ్యాయి. సూర్యాపేట, నల్గొండ జిల్లాల కాలేజీలకు కూడా తగిన ప్రాధాన్యం దక్కింది.

Updated Date - Dec 14 , 2025 | 06:38 AM