Share News

Minister Tummala Nageshwar Rao: రైతుల సౌలభ్యం కోసమే యూరియా యాప్‌

ABN , Publish Date - Dec 23 , 2025 | 04:21 AM

రైతుల సౌలభ్యం కోసమే యూరియా యాప్‌ను తీసుకొచ్చామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా సరఫరాలో పారదర్శకత ....

Minister Tummala Nageshwar Rao: రైతుల సౌలభ్యం కోసమే యూరియా యాప్‌

  • సరఫరాలో పారదర్శకత కోసమే తెచ్చాం

  • విపక్షాలవి అవగాహనలేని విమర్శలు: తుమ్మల

హైదరాబాద్‌, డిసెంబరు 22 (ఆంధ్రజ్యోతి): రైతుల సౌలభ్యం కోసమే యూరియా యాప్‌ను తీసుకొచ్చామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. యూరియా సరఫరాలో పారదర్శకత పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నామని పేర్కొన్నారు. విపక్ష నాయకులు అవగాహన లేకుండా విమర్శలు చేస్తున్నారని, పచ్చకామెర్లు ఉన్నోళ్లకు లోకమంతా పచ్చగా కనిపిస్తుందని ఎద్దేవా చేశారు. యూరియా యాప్‌పై బీఆర్‌ఎస్‌ నేతల విమర్శల నేపథ్యంలో మంత్రి తుమ్మల సోమవారం ఒక ప్రకటన విడుదల చేశారు. పదేళ్లు అధికారంలో ఉన్న వారికి యూరియా ఎక్కడి నుండి వస్తుంది? సరఫరా వ్యవస్థ ఎలా ఉంటుంది? అనేది తెలియదా అని ప్రశ్నించారు. గత సీజన్‌లో కేంద్రం నుంచి సకాలంలో ఎరువులు రాకపోవడం వల్లే ఇబ్బందులు తలెత్తాయని గుర్తు చేశారు. కొందరు ఉద్దేశపూర్వకంగా మాట్లాడి రైతులు మరింత భయపెట్టారని, ఒకే సారి ఎగబడేలా చేశారని దుయ్యబట్టారు. ఇదంతా రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యమేనంటూ రాజకీయ పబ్బం గడుపుకోవాలని చూశారని విమర్శించారు. ఈ సారి అలాంటి పొరపాట్లు జరగకుండా పారదర్శకంగా యూరియాను సరఫరా చేయాలన్న ఉద్దేశంతోనే కొత్త యాప్‌ను తీసుకొచ్చామని స్పష్టం చేశారు. సిద్దిపేట, గజ్వేల్‌లోనే కాదని, రాష్ట్రంలో ఏప్రాంతంలో ఉండే రైతులైనా దగ్గరలోని షాపుల్లో యూరియాకొనుక్కునే సదుపాయం ఉంటుందని తెలిపారు. పదేళ్లపాటు రైతులను మోసం చేసి, ప్రజల సంపదను దోచుకొన్న వారే.. ఇప్పుడు కపట ప్రేమను ఒలకబోస్తున్నారని దుయ్యబట్టారు. బీఆర్‌ఎస్‌ నేతలు ఎన్ని విమర్శలు చేసినా... రైతును రాజును చేయటమే తమ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు.

Updated Date - Dec 23 , 2025 | 04:21 AM