Supreme Court: సుప్రీంలో బీసీ పిటిషన్
ABN , Publish Date - Oct 14 , 2025 | 03:08 AM
బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బీసీలకు 42 శాతం..
సోమవారం అర్ధరాత్రి దాఖలు
బీసీ రిజర్వేషన్లపై హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ వేసిన రాష్ట్ర సర్కారు
ఈ వారంలోనే విచారణకు వచ్చే చాన్స్
42ు రిజర్వేషన్లపై పట్టు వీడని రేవంత్
ఒకటికి రెండు సార్లు అంశాల పరిశీలన
ఢిల్లీలో ఉండి పర్యవేక్షించిన మహేశ్‌గౌడ్
న్యూఢిల్లీ, అక్టోబరు 13 (ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్ల పెంపుపై హైకోర్టు ఇచ్చిన స్టేను సవాలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలని సీఎం రేవంత్‌రెడ్డి భావిస్తున్నందున.. ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలించారు. బీసీ రిజర్వేషన్లను పెంచుతూ ప్రభుత్వం ఇచ్చిన జీవో 9ను నిలిపివేస్తూ హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వులపై నాలుగైదు రోజులుగా ప్రత్యేకంగా దృష్టి సారించారు. సీనియర్ న్యాయవాదులు అభిషేక్ మను సింఘ్వీతోపాటు రవి వర్మలతో వరసగా చర్చలు జరిపారు. సీఎం రేవంత్‌రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి, పీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్, మంత్రి పొన్నం ప్రభాకర్ తదితరులు జూమ్ ద్వారా వారితో మాట్లాడారు. సుప్రీంకోర్టులో ఏయే అంశాలను లేవనెత్తాలి? ఏ ప్రాతిపదికన ముందుకెళితే సానుకూలంగా తీర్పు వచ్చే అవకాశముంది? హైకోర్టు ఏ వాదనలను దృష్టిలో పెట్టుకుని జీవో 9పై స్టే విధించింది?.. వంటి అంశాలపై సుదీర్ఘంగా కసరత్తు చేశారు. సీనియర్ న్యాయవాది రవి వర్మ తుది పరిశీలన తర్వాత సోమవారం అర్ధరాత్రి సుప్రీంకోర్టులో పిటిషన్ వేశారు. గురు లేదా శుక్రవారాల్లోనే ఈ పిటిషన్‌పై విచారణ జరిగే అవకాశం ఉంది.
పూర్తిగా వాదనలు వినకుండానే స్టే..!
బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు సాధించుకోవాల్సిందేనన్న పట్టుదలతో ఉన్న రాష్ట్ర ప్రభుత్వం.. ప్రధానంగా హైకోర్టు తమ వాదనలు పూర్తిగా వినకుండానే స్టే విధించిందనే అంశంతోనే పిటిషన్ వేసినట్లు తెలిసింది. ‘స్థానికంగా ఓబీసీల సమగ్ర వివరాలను సేకరించాం. అందుకు ప్రత్యేకంగా కమిషన్‌ను ఏర్పాటు చేశాం. కమిషన్ అధ్యయనం తర్వాత రిజర్వేషన్ల శాతాన్ని నిర్ణయించాం. కుల గణన సర్వే ప్రకారం రాష్ట్రంలో 56 శాతానికి పైగా బీసీలు ఉన్నారని తేలింది. జనాభా నిష్పత్తి ప్రకారమే వారికి 42 శాతం కేటాయించాలని నిర్ణయించాం. కానీ, హైకోర్టు స్టే ఇవ్వడం అత్యంత బాధాకరం. సుప్రీంకోర్టులో సానుకూలంగా తీర్పు వస్తుందని ఆశిస్తున్నాం. సుదీర్ఘ చర్చలు, పరిశీలనల తర్వాత సుప్రీంకోర్టులో పిటిషన్ వేశాం’ అని మహేశ్ గౌడ్ తెలిపారు.