Share News

Health Department: నిర్లక్ష్యంగా ఉంటే ఇంటికే!

ABN , Publish Date - Oct 27 , 2025 | 02:15 AM

ప్రజలకు వైద్య సేవలందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆస్పత్రుల సూపరింటెండెంట్లపై సర్కారు సీరియ్‌సగా ఉంది...

Health Department: నిర్లక్ష్యంగా ఉంటే ఇంటికే!

  • మొన్న రామగుండం, నిన్న ఎంజీఎం సూపరింటెండెంట్లపై చర్యలు

  • అలసత్వం ప్రదర్శిస్తున్న వారిపై వేటు

  • ఇటీవలి కాలంలో ఏడుగురు సూపరింటెండెంట్లపై చర్యలు

  • ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమంటూ సంకేతాలు

  • వణుకుతున్న సూపరింటెండెంట్లు

  • ఏళ్లుగా పాతుకుపోయిన ఉద్యోగులపైనా వైద్యశాఖ దృష్టి

హైదరాబాద్‌, అక్టోబరు 26 (ఆంధ్రజ్యోతి): ప్రజలకు వైద్య సేవలందించే విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించే ఆస్పత్రుల సూపరింటెండెంట్లపై సర్కారు సీరియ్‌సగా ఉంది. ఇలాంటి వారిపై చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇటీవలి కాలంలోనే ఏకంగా ఏడుగురు బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లకు వైద్య ఆరోగ్యశాఖ షాక్‌ ఇచ్చింది. విధి నిర్వహణలో అలసత్వం, అవినీతి ఆరోపణలు, రోగుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ఆస్పత్రుల నిర్వహణలో తీవ్ర నిర్లక్ష్యం వంటి కారణాలలో వారిపై చర్యలు తీసుకుంది. కొందరిని సస్పెండ్‌ చేయగా.. మరికొందరికి ఎలాంటి పోస్టింగ్‌లు ఇవ్వకుండా పక్కనపెట్టింది. ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఉపేక్షించబోమంటూ సర్కారు సంకేతాలిచ్చింది. ఇష్టమొచ్చినట్లు వ్యవహరిస్తే ఇంటికి పంపుతామన్న గట్టి హెచ్చరిక చేసింది. రోగులు ఇబ్బందిపడే పరిస్థితి తెస్తే ఎంతటి వారి విషయంలోనైనా కఠినంగా ఉంటామని తేల్చి చెప్పింది. ఆస్పత్రుల సూపరింటెండెంట్లపై చాలా సీరియ్‌సగా ఉన్న వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ వారి పనితీరుపై ఎప్పటికప్పుడు నివేదికలు తెప్పించుకుంటున్నారు. బోధనాస్పత్రుల్లో పాలన వ్యవహారాలపై హెల్త్‌ సెక్రటరీ క్రిస్టినా, వైద్యవిద్య సంచాలకుడు డాక్టర్‌ నరేంద్ర్‌కుమార్‌తో వరుస సమీక్షలు నిర్వహిస్తున్నారు. పనితీరును మెరుగుపరుచుకోవాలని సూచించినా ఏమాత్రం మారని వారిపై కఠినంగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏడుగురు సూపరింటెండెంట్లపై చర్యలు తీసుకోవడం పరిస్థితికి నిదర్శనం. ఈ నెల 25న వరంగల్‌ ఎంజీఎం ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ కిషోర్‌పై సర్కారు వేటు వేసింది. ఆయన్ను ఆ పోస్టు నుంచి తప్పించింది. ఇటీవలికాలంలో ఎంజీఎంలో వరుసగా చోటుచేసుకుంటున్న ఘటనలు, వాటిని పరిష్కరించడంలో సూపరింటెండెంట్‌ నిర్లక్ష్యం స్పష్టంగా కనిపిస్తోందని సర్కారు భావించింది. మంత్రి దామోదర రాజనర్సింహ ఇక నుంచి ప్రతీవారం ఎంజీఎంపై సమీక్ష చేసి తనకు నివేదిక ఇవ్వాలని డీఎంఈను ఆదేశించారు. కొద్ది రోజుల క్రితమే హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాజకుమారిని ఆ పోస్టు నుంచి మంత్రి తప్పించారు. ఆస్పత్రి పాలనా వ్యవహారాల్లో తీవ్ర నిర్లక్ష్యం వహించడం, రోగులు ఇబ్బందిపడుతున్నా పట్టించుకోకపోవడం, వైద్యులు విధులకు రాకున్నా నిమ్మకు నీరెత్తినట్టుగా ఆమె వ్యవహరించడంతో వేటు వేశారు. ఆమె స్థానంలో ఇంచార్జి డీఎంఈగా పనిచేసిన డాక్టర్‌ ఎన్‌.వాణికి బాధ్యతలు అప్పగించారు. రెండు రోజుల క్రితం రామగుండం బోధనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ హిమబిందు సింగ్‌నూ విధుల నుంచి ప్రభుత్వం తప్పించింది. రామగుండం వైద్య కళాశాల ప్రిన్సిపల్‌గా ఆమె భర్త ఉన్నారు. వారానికి ఒకటి రెండుసార్లే విధులకు హాజరుకావడం, ఏకకాలంలో ప్రిన్సిపల్‌, సూపరింటెండెంట్‌గా వ్యవహరిస్తున్నారని ఆమెపై అక్కడి వైద్యులు సర్కారుకు ఫిర్యాదు చేశారు. విచారణ అనంతరం ఆమెను విధులను నుంచి తప్పించారు. కొద్ది రోజుల క్రితం నిజామాబాద్‌ బోధనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ ప్రతిమరాజ్‌ను సర్కారు తప్పించింది.


ఆస్పత్రిలో పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవడం, కొవిడ్‌ సమయంలో రెమ్‌డె్‌సవిర్‌ ఇంజక్షన్లు అమ్ముకున్నారని, దీర్ఘకాలంగా ఆ ఆస్పత్రి బాధ్యురాలుగా ఉండటంతో ఆస్పత్రిపై గుత్తాధిపత్యం చెలాయించారన్న ఆరోపణలున్నాయి. దాంతో ఆమెను తప్పించారు. హైదరాబాద్‌లోని ప్రముఖ పిల్లల ఆస్పత్రి నీలోఫర్‌ సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్‌ రవికుమార్‌ ఒంటెద్దు పోకడలు అవలంబించారు. సీఎ్‌సఆర్‌ నిధుల వినియోగంలో అవకతవకలు పాల్పడటంతో పాటు ఆస్పత్రి బ్లడ్‌ బ్యాంకులో రక్తాన్ని బయటకు అమ్ముకున్న ఉద్యోగులకు కొమ్ము కాశారనే ఆరోపణలు ఎదుర్కొన్నారు. ఆస్పత్రి ప్రాంగణంలో ఓ ప్రెవేటు సంస్థ నిర్మిస్తున్న మందుల షాపు భవనం కోసం అక్రమంగా అనుమతులిచ్చారన్న అభియోగాలున్నాయి. దీనిపై పెద్దయెత్తున విమర్శలు రావడంతో సర్కారు ఆయన్ను సస్పెండ్‌ చేసింది. పేట్ల బురుజు ఆస్పత్రి సూపరింటెండెంట్‌గా ఉన్న డాక్టర్‌ రజనీరెడ్డిపై తీవ్ర అవినీతి ఆరోపణలు వచ్చాయి. వైద్య కళాశాల తనిఖీల విషయంలో డబ్బులు తీసుకుని నివేదికలిచ్చారని సీబీఐ నమోదు చేసిన వైద్యుల జాబితాలో ఆమె పేరుంది. దీంతో ఆమెపై వేటు వేశారు. జగిత్యాల బోధనాస్పత్రి సూపరింటెండెంట్‌ డాక్టర్‌ రాములు విధుల నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతో ప్రభుత్వం ఆయన్ను పక్కనపెట్టింది.

ఇష్టారాజ్యంగా వ్యవహారం..

రాష్ట్రంలో 35 ప్రభుత్వ వైద్య కళాశాలలున్నాయి. వాటికి అనుబంధ ఆస్పత్రులున్నాయి. కళాశాలలకు ప్రిన్సిపల్స్‌, బోధనాస్పత్రులకు సూపరింటెండెంట్లుగా అదనపు వైద్యవిద్య సంచాలకుల హోదా (అడిషనల్‌ డీఎంఈ) ఉన్నవారినే నియమించారు. కొన్నిచోట్ల ఇంచార్జి సూపరింటెండెంట్లు ఉన్నారు. బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లు ఉన్నవారు ఇష్టారాజ్యంగా వ్యవ హరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొందరు హైదరాబాద్‌లోనే ఉంటూ రోజూ వెళ్లివస్తున్నారు. మరికొందరు చుట్టపుచూపుగా వచ్చిపోతున్నారు. మరికొందరు తీవ్ర అవినీతికి పాల్పడుతున్నట్లు ప్రభుత్వానికి ఫిర్యాదులు అందుతున్నాయి. ఔషధ కొనుగోళ్లు, డైట్‌, మ్యాన్‌ పవర్‌ ఏజెన్సీ కాంట్రాక్టర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. బోధనాస్పత్రుల్లో ఏళ్ల తరబడి పాతుకుపోయిన కొందరు ఉద్యోగులు సూపరింటెండెంట్లకు అమ్యామ్యాలు ఇవ్వడం, వారి బెదిరించడంలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. మెజార్టీ బోధనాస్పత్రుల్లో అధ్యాపకులు రాకున్నా చూసీచూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలోనే మెడికల్‌ కాలేజీలు, బోధనాస్పత్రులపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. విధి నిర్వహణలో బాధ్యతాయుతంగా లేనివారిని తప్పిస్తోంది. సర్కారు చర్యలతో రాష్ట్రంలోని బోధనాస్పత్రుల సూపరింటెండెంట్లు వణుకుతున్నారు.

Updated Date - Oct 27 , 2025 | 02:15 AM