Ministers Pay Tributes to Komaram Bheem: ఆదివాసీల అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
ABN , Publish Date - Oct 08 , 2025 | 04:15 AM
ఆదివాసీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు.....
రాష్ట్ర గిరిజన సంక్షేమ మంత్రి అడ్లూరి
నేటికి కొనసాగుతున్న కుమరం భీం నినాదం: మంత్రి జూపల్లి
భీం స్ఫూర్తితోనే గిరిజన హక్కులు: సీతక్క
ఆసిఫాబాద్/కెరమెరి/కవాడీగూడ, అక్టోబరు 7 (ఆంధ్రజ్యోతి): ఆదివాసీల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్ అన్నారు. కుమరంభీం-ఆసిఫాబాద్ జిల్లా కెరమెరి మండలం జోడేఘాట్‌లో జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి గిరిజన సంక్షేమశాఖ మంగళవారం నిర్వహించిన కుమరం భీం వర్ధంతికి హాజరయ్యారు. కుమరం భీం విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమైన కుమరం భీం పోరాటాన్ని గుర్తించిన రాష్ట్ర ప్రభుత్వం.. ఆయన వర్ధంతిని రాష్ట్ర పండుగగా ప్రకటించిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల కోడ్ నేపథ్యంలో వేడుకలు సాధారణంగా నిర్వహించామన్నారు. ఆశ్రమ పాఠశాలల సమస్యలను సీఎం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు కృషి చేస్తామని లక్ష్మణ్ కుమార్ చెప్పారు. జిల్లా ఇన్‌చార్జి మంత్రి జూపల్లి కృష్ణారావు మాట్లాడుతూ నిజాం నవాబుకు వ్యతిరేకంగా జల్, జంగల్, జమీన్ కోసం పోరాడిన కుమరం భీం నినాదం నేటికి కొనసాగుతుందన్నారు. ఆదిలాబాద్ ఎంపీ నగేష్, ఎమ్మెల్సీ దండె విఠల్, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, వెడ్మ బొజ్జు, పాల్వాయి హరీ్‌షబాబు తదితరులు కుమరం భీం విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అంతకు ముందు కుమరం భీం వర్ధంతి కార్యక్రమాలను గిరిజన సంప్రదాయ రీతిలో జిల్లా కలెక్టర్ వెంకటేష్ దోత్రే, ఐటీడీఏ పీవో ఖుష్బూగుప్తా, ఎస్పీ కాంతిలాల్ పాటిల్, అదనపు కలెక్టర్ దీపక్ తివారి ప్రారంభించారు. కుమరం భీం మనమడు సోనేరావు కుటుంబ సభ్యులకు సంప్రదాయబద్ధంగా నూతన వస్త్రాలను అందజేశారు. మరోవైపు, హైదరాబాద్‌లోని ట్యాంక్ బండ్‌పై గల కుమరం భీం విగ్రహానికి రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధిశాఖ మంత్రి సీతక్క పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుమరం భీం పోరాటం ఆత్మగౌరవ పోరాటమన్నారు. జల్, జంగల్, జమీన్ నినాదాలతో తమ గిరిజన గూడాల్లో తమ రాజ్యం రావాలన్న ఆయన చేసిన పోరాట స్ఫూర్తితోనే గిరిజనులకు ప్రత్యేక హక్కులు, చట్టాలు వచ్చాయన్నారు.