Share News

Cooperative Election: సహకార ఎన్నికలకు సై!

ABN , Publish Date - Dec 20 , 2025 | 04:50 AM

గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం ముగిసిన రెండ్రోజుల్లోనే.. సహకార ఎన్నికలకు మార్గం సుగమం చేసేలా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది...

Cooperative Election: సహకార ఎన్నికలకు సై!

  • పంచాయతీ ఎన్నికలు ముగిసినవేళ సర్కారు కీలక నిర్ణయం

హైదరాబాద్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): గ్రామ పంచాయతీ ఎన్నికల సమరం ముగిసిన రెండ్రోజుల్లోనే.. సహకార ఎన్నికలకు మార్గం సుగమం చేసేలా ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు (పీఏసీఎస్‌), డీసీసీబీ (జిల్లా కేంద్ర సహకార బ్యాంకు), టెస్కాబ్‌ పాలకవర్గాలను రద్దుచేస్తూ ఉత్తర్వులు జారీచేసింది. ఈ నేపథ్యంలో.. పీఏసీఎ్‌సలకు పర్సన్‌ ఇన్‌చార్జులను నియమించాలని రాష్ట్ర వ్యవసాయశాఖ కార్యదర్శి సురేంద్ర మోహన్‌ శుక్రవారం ఆదేశాలు జారీ చేశారు. తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకూ ఇన్‌చార్జులే కొనసాగనున్నారు. త్వరలో కొత్త మండలాల ప్రకారం ప్రభుత్వం వీటిని పునర్వ్యవస్థీకరించనుంది. రాష్ట్రంలోని తొమ్మిది ఉమ్మడి జిల్లాల సహకార కేంద్ర బ్యాంకులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు 2020 ఫిబ్రవరి 13న ఎన్నికలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది ఫిబ్రవరి నాటికి వాటి పదవీ కాలం ముగిసింది. అయితే రాష్ట్ర ప్రభుత్వం ఆయా పాలకవర్గాల పదవీకాలాన్ని ఆరు నెలలు పొడిగించింది. ఆ పదవీ కాలం కూడా 2025 ఆగస్టు 14 తేదీ తో ముగిసిపోయింది. ఆ తర్వాత మరోసారి పాలకవర్గ పదవీకాలాన్ని మరో ఆర్నెల్లపాటు.. అంటే 2026 ఫిబ్రవరి 14 వరకూ పొడిగించింది. అది ముగియడానికి దాదాపు రెండు నెలల ముందే.. శుక్రవారం పాలకవర్గాలను రద్దుచేస్తూ కీలక నిర్ణయం తీసుకోవడం చర్చనీయాంశం అయింది. కాగా, నామినేటెడ్‌ పద్ధతిలో పాలకవర్గాలను ఏర్పాటు చేయాలనే ఆలోచనలో కూడా ప్రభుత్వం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.

Updated Date - Dec 20 , 2025 | 04:50 AM