Share News

Battery Energy Storage System: విద్యుత్‌ స్టోరేజీకి ప్లాంట్లు

ABN , Publish Date - Nov 26 , 2025 | 04:33 AM

ఇప్పటి వరకు థర్మల్‌, జల, పవన విద్యుత్‌ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తయ్యే కరంటును మాత్రమే మనం వాడుకున్నాం. ఇక నుంచి విద్యుత్‌ను స్టోరేజీ చేసుకుని అవసరమైనప్పుడు వినియోగించుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అదే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌.....

Battery Energy Storage System: విద్యుత్‌ స్టోరేజీకి ప్లాంట్లు

  • గ్లోబల్‌ టెండర్లు పిలిచిన జెన్‌కో.. ’బూ‘ విధానంలో బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌

  • 750 మెగావాట్ల సామర్థ్యంతో 2 ప్లాంట్ల ఏర్పాటుకు ప్రణాళిక

  • మహేశ్వరం, చౌటుప్పల్‌లలో కొలువు దీరనున్న ప్లాంట్లు

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): ఇప్పటి వరకు థర్మల్‌, జల, పవన విద్యుత్‌ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తయ్యే కరంటును మాత్రమే మనం వాడుకున్నాం. ఇక నుంచి విద్యుత్‌ను స్టోరేజీ చేసుకుని అవసరమైనప్పుడు వినియోగించుకునే సౌకర్యం అందుబాటులోకి వచ్చింది. అదే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ సిస్టమ్‌ (బీఈఎ్‌సఎస్‌). రాష్ట్రంలో 750 మెగావాట్ల సామర్థ్యం గల 2 బీఈఎ్‌సఎస్‌ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు గ్లోబల్‌ టెండర్లను పిలుస్తూ తెలంగాణ జెన్‌కో మంగళవారం నోటిఫికేషన్‌ జారీ చేసింది. టెండర్లు గెలుచుకున్న సంస్థలు సొంతంగా నిర్మించి, నిర్వహించే (బూ) పద్ధతిలో ఈ ప్రాజెక్టు ఏర్పాటు చేస్తాయి. ఆసక్తి గల కంపెనీలు బిడ్లు దాఖలు చేయడానికి డిసెంబరు 27వ తేదీ సాయంత్రం 5 గంటల వరకు గడువునిచ్చింది. 750 మెగావాట్ల (ప్రతి గంటకు 187.5 మెగావాట్ల చొప్పున 4 గంటల పాటు విద్యుత్‌ ఇచ్చే) సామర్థ్యం గల ప్లాంటును సదరు సంస్థలు నిర్మిస్తాయి. మహేశ్వరం, చౌటుప్పల్‌లలోని 440/220 కేవీ సామర్థ్యం గల తెలంగాణ ట్రాన్స్‌కో సబ్‌స్టేషన్ల వద్ద వీటిని నిర్మిస్తారు. ఇప్పటికే హైదరాబాద్‌ శివారులోని శంకర్‌పల్లిలో 440/220 కేవీ సామర్థ్యం గల ట్రాన్స్‌ సబ్‌స్టేషన్‌ వద్ద 250 మెగావాట్ల ఎనర్జీ స్టోరేజీ ప్లాంట్‌ ఏర్పాటు చేయడానికి టెండర్‌ ప్రక్రియ పూర్తయింది. వందల ఎకరాల ట్రాన్స్‌కో భూముల్లో ఈ ప్లాంట్‌ ఏర్పాటు చేస్తారు. డిమాండ్‌ లేని వేళ ఓపెన్‌ యాక్సెస్‌ నుంచి కొనుగోలు చేసిన విద్యుత్‌ను బ్యాటరీల్లో నిల్వ చేసుకోవడమే ‘బీఈఎ్‌సఎస్‌’ ప్రధానోద్దేశం. డిమాండ్‌ సమయంలో నిల్వ చేసుకున్న కరెంట్‌ను విక్రయించడం దీని ఉద్దేశం. ఈ ప్లాంట్‌ నుంచి యూనిట్‌ రూ.2.90లకే కరెంట్‌ లభించనున్నదని భావిస్తున్నారు. దీంతో అధిక డిమాండ్‌ ఉన్నప్పుడు ఎక్కువ ధరకు విద్యుత్‌ కొనుగోలు ఖర్చు భారం తగ్గించుకోవచ్చునని అధికారులు అంచనా వేస్తున్నారు.

వీజీఎఫ్‌ రూపంలో 40ు కేంద్రం సాయం

2026 కల్లా దేశంలో ‘బీఈఎ్‌సఎస్‌’ ద్వారా ప్రతి గంటకు 4,000 మెగావాట్ల విద్యుత్‌ అందించాలన్నది ప్రభుత్వ లక్ష్యం. ప్రైవేటు సంస్థలు ఏర్పాటు చేసే బీఈఎ్‌సఎస్‌ ప్లాంట్లకు కేంద్ర పునరుద్ధరణీయ ఇంధన వనరుల శాఖ 40ు వయబుల్టీ గ్యాప్‌ ఫండ్‌ (వీజీఎఫ్‌) సమకూరుస్తుంది. వీజీఎఫ్‌ కింద ప్రతి మెగావాట్‌కు రూ.18 లక్షల నిధులను కేంద్రం సమకూరుస్తుంది. టెండర్‌ గెలుచుకున్న ప్రైవేటు సంస్థకు రూ.270 కోట్ల మేరకు కేంద్రం సాయమందుతుంది. ఆయా ప్రైవేటు సంస్థలు విధిగా వీజీఎఫ్‌ నిధులను పరిగణనలోకి తీసుకునే టెండర్లు వేయాల్సి ఉంటుంది.

Updated Date - Nov 26 , 2025 | 04:33 AM