Telangana Gears Up for Local Body Polls: స్థానిక ఎన్నికలపై ముందుకే!
ABN , Publish Date - Sep 28 , 2025 | 02:06 AM
స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. బీసీ రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విషయంలో జీవోపై స్టే ఇవ్వకుండా చట్టప్రకారం ముందుకెళ్లాలని న్యాయస్థానం...
న్యాయ సలహాతో నేడో రేపో షెడ్యూల్
బీసీలకు 13 జిల్లా పరిషత్‌లు
ఎస్సీలకు 6, ఎస్టీలకు 4, జనరల్ 8
జడ్పీ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు
పండుగలతో పోలింగ్ తగ్గే ప్రమాదం
తేదీల ఖరారులో అధికారుల జాగ్రత్త
హైదరాబాద్, సెప్టెంబరు 27 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో ముందుకు వెళ్లాలని రాష్ట్ర ప్రభుత్వం యోచిస్తోంది. బీసీ రిజర్వేషన్లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్ విషయంలో జీవోపై స్టే ఇవ్వకుండా చట్టప్రకారం ముందుకెళ్లాలని న్యాయస్థానం పేర్కొన్న నేపథ్యంలో ఎన్నికల షెడ్యూల్ విడుదలకే రాష్ట్ర ప్రభుత్వం మొగ్గుచూపుతున్నట్లు తెలుస్తోంది. ఆదివారం న్యాయ నిపుణులతో చర్చించి ముందుకు వెళ్లాలని భావిస్తోంది. దాంతో నేడో, రేపో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. మరోవైపు రాష్ట్ర ఎన్నికల సంఘం స్థానిక సంస్థల ఎన్నికల కోసం కసరత్తును ముమ్మరం చేసింది. ప్రభుత్వం పచ్చజెండా ఊపగానే ఎన్నికల ఈసీ షెడ్యూల్ విడుదల చేస్తుంది. మరోవైపు రిజర్వేషన్ల ఖరారు ప్రక్రియ ఊపందుకుంది. తాజాగా జిల్లా పరిషత్ చైర్‌పర్సన్ల రిజర్వేషన్లు ఖరారు చేశారు. బీసీలకు 13 జిల్లా పరిషత్ ఛైర్‌పర్సన్ పోస్టులను కేటాయించారు. ఈ మేరకు శనివారం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. ఎస్టీలకు నాలుగు, ఎస్సీలకు 6 స్థానాలు కేటాయించారు. జనరల్‌కు 8 ఉన్నాయి. ఈ మేరకు తెలంగాణ పంచాయతీరాజ్ డైరెక్టర్, స్టేట్ ఎలక్షన్ అథారిటీ డాక్టర్ జి.సృజన ఉత్తర్వులు ఇచ్చారు. జయశంకర్ భూపాలపల్లి, కరీంనగర్, కుమురంభీం ఆసిఫాబాద్, నిర్మల్, సిద్దిపేట, సూర్యాపేట్, వికారాబాద్, జిల్లాలు బీసీ పురుషుడు/మహిళ కు కేటాయించగా మహబూబ్‌నగర్, మంచిర్యాల, నాగర్‌కర్నూలు, నిజామాబాద్, వనపర్తి, యాదాద్రి భువనగిరి బీసీ మహిళలకు కేటాయించారు. ఆదిలాబాద్, జగిత్యాల, నారాయణపేట, పెద్దపల్లి జిల్లాలను మహిళలకు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి, మహబూబాబాద్, మెదక్ జిల్లాలు అన్ రిజర్వ్‌డ్ పురుషులు లేదా స్త్రీలకు కేటాయించారు. ములుగు, నల్గొండ జిల్లాలు ఎస్టీ మహిళలకు, ఖమ్మం, వరంగల్‌లు ఎస్టీ పురుషుడు లేదా స్త్రీకి, హనుమకొండ, జనగామ, రంగారెడ్డిలు ఎస్సీ మహిళలకు, జోగులాంబ గద్వాల్, రాజన్నసిరిసిల్ల, సంగారెడ్డిలు ఎస్సీ పురుషుడు లేదా స్ట్రీలకు కేటాయించారు.
పండుగలు చూసి తేదీలు ఖరారు
దసరా, దీపావళి పండుగలు, వాటికి సంబంధించిన వరుస సెలవులను పరిగణనలోకి తీసుకుని పోలింగ్ తేదీలు ఖరారు చేయాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఓటింగ్ శాతంపై సెలవుల ప్రభావం ఎలా ఉంటుందనే అంశంపైన ఉన్నతాధికారులు లోతుగా చర్చించారు. అత్యధిక సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొనేలా ఎన్నికల తేదీలను ఖరారు చేయాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణపై రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) శనివారం కీలక సమావేశం నిర్వహించింది. ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి(సీఎస్) రామకృష్ణారావు, డీజీపీ జితేందర్, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, పంచాయతీరాజ్ శాఖ ముఖ్య కార్యదర్శి ఎన్.శ్రీధర్ హాజరయ్యారు.