Sarpanch elections: ష్.. గప్‌చుప్!
ABN , Publish Date - Dec 10 , 2025 | 03:26 AM
తెలంగాణ పంచాయతీ పోరులో తొలివిడత సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాల ఎన్నికలకు సంబంధించిన ప్రచారపర్వం మంగళవారం సాయంత్రానికి ముగిసింది.....
ముగిసిన తొలివిడత పంచాయతీ ఎన్నికల ప్రచారం
రేపే పోలింగ్.. మధ్యాహ్నం తర్వాత కౌంటింగ్, ఫలితాలు
ముగిసిన మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ
హైదరాబాద్, డిసెంబరు 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ పంచాయతీ పోరులో తొలివిడత సర్పంచ్, వార్డుసభ్యుల స్థానాల ఎన్నికలకు సంబంధించిన ప్రచారపర్వం మంగళవారం సాయంత్రానికి ముగిసింది. తొలివిడతలో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా 189 మండలాల్లోని గ్రామాల్లో గురువారం ఉదయం ఏడు గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పోలింగ్ నిర్వహిస్తారు. ఆ వెంటనే ఓట్ల లెక్కింపు నిర్వహించి ఫలితాలు ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో సర్పంచ్ స్థానాలకు సగటున నలుగురు చొప్పున అభ్యర్థులు పోటీ పడుతుండగా. వార్డులకు సగటున 2.3 చొప్పున అభ్యర్థులు తలపడనున్నారు. ఈసీ వివరాల ప్రకారం 4,236 సర్పంచ్ స్థానాలకుగాను 395 స్థానాలు ఏకగ్రీవం అయ్యాయి. ఐదు గ్రామాల్లో ఒక్క నామినేషన్ కూడా పడలేదు. ఫలితంగా ప్రస్తుతం 3,836 సర్పంచ్ స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అదేవిధంగా 37,440 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగాల్సి ఉండగా.. అందులో 9,331 వార్డుస్థానాలు ఏకగీవ్రం అయ్యాయి. 149 స్థానాల్లో నామినేషన్లు దాఖలు కాలేదు. ప్రస్తుతం 27,960 వార్డుసభ్యుల స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. కాగా మంగళవారం సాయంత్రంతో మూడో విడత నామినేషన్ల ఉపసంహరణ ప్రక్రియ ముగిసింది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో మొత్తంగా 1,678 గ్రామ పంచాయతీలకు గాను 124 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. ఉమ్మడి మెదక్ జిల్లాలో 242, ఉమ్మడి నల్లగొండ జిల్లాలో 173, ఉమ్మడి వరంగల్ జిల్లాలో 131, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 84, ఖమ్మం జిల్లాలో 63 పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి. మహబూబాబాద్ రూరల్ నడివాడ గ్రామంలో సర్పంచ్ అభ్యర్థి రాయపాటి బుచ్చయ్య (70) మంగళవారం గుండెపోటుతో మృతిచెందాడు. సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం మస్త్యాల గ్రామంలో 9వ వార్డు నుంచి నిల్చున్న అభ్యర్థి బొలుగం పద్మ కూతరు శ్రావణి (18) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది.