Share News

First Phase Panchayat Polling Records: తొలివిడతలో పోలింగ్‌ 84.28శాతం

ABN , Publish Date - Dec 12 , 2025 | 04:35 AM

రాష్ట్రంలో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. 3,834 పంచాయతీల్లోని సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు గురువారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ ప్రారంభమైంది......

First Phase Panchayat Polling Records: తొలివిడతలో పోలింగ్‌ 84.28శాతం

  • అత్యధికంగా వరంగల్‌, అత్యల్పంగా భద్రాద్రి జిల్లాలో..

  • ఓటేసిన 45,15,141 మంది

హైదరాబాద్‌, డిసెంబరు 11 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో తొలివిడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ముగిశాయి. 3,834 పంచాయతీల్లోని సర్పంచ్‌, వార్డు సభ్యుల స్థానాలకు గురువారం ఉదయం 7 గంటల నుంచే పోలింగ్‌ ప్రారంభమైంది. మొదటి రెండు గంటలు ఓటింగ్‌ మందకొడిగా సాగగా.. తర్వాత ఓటర్లు బారులు తీరారు. రాష్ట్ర ఎన్నికల సంఘం(ఎ్‌సఈసీ) అందించిన సమచారం మేరకు మధ్యాహ్నం ఒంటి గంటకు 79.17 శాతం పోలింగ్‌ నమోదైంది. అయితే అప్పటికే క్యూలో ఉన్న వారికి మాత్రం ఓటు వేసేందుకు అవకాశం కల్పించారు. ఒంటి గంటలోపు పోలింగ్‌ కేంద్రంలో ఉన్నవారికి టోకెన్లు జారీచేసి ఓటు హక్కు వినియోగించుకునే వెసులుబాటు కల్పించారు. దీంతో మొత్తం 84.28ు పోలింగ్‌ నమోదైంది. మొత్తం 56,19,430 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా.. 45,15,141 మంది ఓటేశారు. వరంగల్‌ జిల్లాలో అత్యధికంగా 92.88ు పోలింగ్‌ నమోదవగా.. అత్యల్పంగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 71.79ు నమోదైంది. ఎస్‌ఈసీ షెడ్యూల్‌ ప్రకారం 189 మండలాల పరిధిలో 4,236 గ్రామ పంచాయతీలకుగాను.. 396 ఏకగ్రీవంకాగా, 5 చోట్ల ఒక్క నామినేషన్‌ రాలేదు. దీంతోపాటు ఓ గ్రామపంచాయతీకి కోర్టు స్టే ఉండటంతో ఎన్నికలు జరపలేదు.

సాయంత్రానికి ఫలితాల వెల్లడి

చాలా పంచాయతీల్లో సాయంత్రానికల్లా అధికారులు ఎన్నికల ఫలితాలను ప్రకటించారు. ఎక్కువ మంది ఓటర్లు క్యూలైన్లలో ఉన్నచోట మాత్రం కొంత ఆలస్యం జరిగింది. ఓటింగ్‌ ముగిసిన తర్వాత తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించారు. తర్వాత సర్పంచ్‌, వార్డు సభ్యుల బ్యాలెట్‌ పత్రాలను వేరు చేసి, లెక్కింపు ప్రారంభించారు. సర్పంచ్‌, వార్డు సభ్యులుగా గెలిచిన వారి పేర్లను ఆర్‌వోలు ప్రకటించారు. ఎస్‌ఈసీ అందించిన సమాచారం ప్రకారం గురువారం రాత్రి 8 గంటల్లోపు 1930 సర్పంచ్‌, 14985 వార్డు సభ్యుల ఫలితాలను వెల్లడించారు. అదే సమయంలో ఉప సర్పంచుల ఎన్నిక ప్రక్రియనూ పూర్తిచేసినట్లు సంబంధిత విభాగాలు తెలిపాయి.

పోలింగ్‌ సరళిని పరిశీలించిన ఎస్‌ఈసీ, డీజీపీ

తొలివిడత పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రక్రియను వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎస్‌ఈసీ కమిషనర్‌ రాణి కుముదిని పోలింగ్‌ సరళిని పరిశీలించారు. సిబ్బంది పనిచేసే విఽధానం, ఆయా పోలింగ్‌ కేంద్రాల్లో ఏవైనా సమస్యలున్నాయా? ప్రజలకు ఎటువంటి సౌకర్యాలు కల్పించారు? అన్న విషయాలను హైదరాబాద్‌లోని ఎస్‌ఈసీ కార్యాలయం నుంచే ఆమె పరిశీలించారు. ఓట్ల లెక్కింపు, ఫలితాల వెల్లడి ప్రక్రియను కూడా పర్యవేక్షించారు. తొలివిడత పంచాయతీ ఎన్నికలు ఒకటి, రెండు చోట్ల తప్ప అంతా ప్రశాంత వాతావరణంలో ముగిసినట్లు కమిషనర్‌ తెలిపారు. కాగా, పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ సరళిని డీజీపీ శివధర్‌రెడ్డి వెబ్‌కాస్టింగ్‌ ద్వారా పరిశీలించారు. సమస్యాత్మక గ్రామాల్లో జరుగుతున్న పోలింగ్‌ తీరును ఆయన పర్యవేక్షించారు.

Updated Date - Dec 12 , 2025 | 04:35 AM