Share News

Farmers Face Devastation: కన్నీటి ధారలు

ABN , Publish Date - Oct 31 , 2025 | 03:08 AM

ఎక్కడెక్కడ ఎన్నెన్ని అప్పులు చేసిందో.. ఎంత పెట్టుబడి పెట్టిందో పాపం.. ఆ మహిళా రైతు ఆరుగాలం పడిన కష్టమంతా వరదపాలైంది. కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యమంతా వర్షపు నీటి వరదలో కొట్టుకుపోయి డ్రైనేజీ పాలైంది. దిక్కుతోచని స్థితిలో తానే ఆ మోరీలోకి దిగి బిగ్గరగా రోదిస్తూ నీళ్లలో....

Farmers Face Devastation: కన్నీటి ధారలు

  • డ్రైనేజీ పాలైన ఓ మహిళా రైతు 150 క్వింటాళ్ల వడ్లు

  • లోపలికి దిగి గంపతో వడ్లు ఎత్తిపోసిన రైతు తారవ్వ

  • సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌ మార్కెట్‌ యార్డులో ఘటన

  • తనను ఆదుకోవాలని కలెక్టర్‌ కాళ్లమీద పడి విజ్ఞప్తి

  • రాష్ట్రవ్యాప్తంగా రైతులది తారవ్వలాంటి పరిస్థితే

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌)

ఎక్కడెక్కడ ఎన్నెన్ని అప్పులు చేసిందో.. ఎంత పెట్టుబడి పెట్టిందో పాపం.. ఆ మహిళా రైతు ఆరుగాలం పడిన కష్టమంతా వరదపాలైంది. కొనుగోలు కేంద్రంలో ఆరబోసిన ధాన్యమంతా వర్షపు నీటి వరదలో కొట్టుకుపోయి డ్రైనేజీ పాలైంది. దిక్కుతోచని స్థితిలో తానే ఆ మోరీలోకి దిగి బిగ్గరగా రోదిస్తూ నీళ్లలో ముంచి గంపలతో ధాన్యాన్ని పైకెత్తి పోసింది! అర క్వింటానా.. క్వింటానా? కొట్టుకుపోయింది దాదాపు 150 క్వింటాళ్ల ధాన్యం! తాను ఆ మోరీలోంచి ఎంత ధాన్యమని ఎత్తిపోయగలదు? అయినా.. ఆగని తన కన్నీటి ధార తరహాలోనే మోరీ నీళ్లలోకి గంప ముంచడం.. వడ్లను ఆమె ఎత్తిపోయడం ఆగడం లేదు!! సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లోని వ్యవసాయ మార్కెట్‌లో కేడిన తారవ్వ అనే రైతును ఇలా చూసిన వారి గుండెలు ద్రవించాయి. రెక్కలు ముక్కలు చేసుకొని పండించిన వడ్లన్నీ నీటిపాలయ్యాయంటూ నష్ట పరిశీలనకు వచ్చిన సిద్దిపేట కలెక్టర్‌ హైమావతి కాళ్లపై పడి తారవ్వ బోరున విలపించింది. 150 క్వింటాళ్ల ధాన్యం మొత్తం కొట్టుకుపోయిందని.. రూ. 2.50 లక్షల పెట్టుబడి మట్టిపాలైందని రోదించింది.. 15 రోజుల క్రితం అల్లుడు చనిపోయాడని, ఇప్పుడు పండించిన పంట కూడా వరదపాలైందని.. తనను సర్కారు ఆదుకోవాలంటూ ఆమె వేడకుంది. మార్కెట్‌యార్డుకు వచ్చిన మంత్రి పొన్నం ప్రభాకర్‌, తారవ్వను ఓదార్చారు. తక్షణసాయం కింద ఆమెకు రూ.10వేలు అందజేశారు. జిల్లెలగడ్డకు చెందిన లావుడ్య నీలా అనే మహిళా రైతు.. తాను ఆరు ఎకరాల్లో పండించిన పంటంతా వరదలో కొట్టుకపోయిందని కన్నీరుమున్నీరైంది. కొందరు రైతులు డ్రైనేజీలో కొట్టుకపోయిన ధాన్యాన్ని జేసీబీతో ఎత్తుకున్నారు. మార్కెట్‌ యార్డులో ఏ రైతును కదిలించినా ఇలా హృదయవిదారక దృశ్యాలే కనిపించాయి. రాష్ట్రవ్యాప్తంగా రైతుల పరిస్థితి దాదాపు తారవ్వ మాదిరిగానే ఉంది. కొనుగోలు కేంద్రాల్లో, రోడ్లపైన ఆరబెట్టిన ధాన్యం వరదపాలవ్వడంతో అన్నదాతలు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా అమ్రాబాద్‌ మండలం శ్రీశైలం డ్యాం వెనుక వైపున మత్స్యకారుల కాలనీ దారిపై కొండచరియలు విరిగిపడ్డాయి. శ్రీశైలం-హైదరాబాద్‌ హైవేలో నాగర్‌కర్నూల్‌ జిల్లా డిండి ప్రాజెక్టు వద్ద బ్రిడ్జి 500 అడుగుల మేర కోతకు గురైంది.


ముంపులో వరంగల్‌, హనుమకొండ

ఉమ్మడి వరంగల్‌ జిల్లాను మరోసారి వరద ఉక్కిరిబిక్కిరిచేసింది. ప్రధానంగా వరంగల్‌, హనుమకొండ, కాజీపేటలో ఇళ్లు ఇంకా వరద ముంపులోనే ఉన్నాయి. హనుమకొండ ఇందిరాగనర్‌లోని 500 ఇళ్లను చుట్టుముట్టిన వరద అలాగే ఉంది. కొందరు పునరావాస కేంద్రాలకు తరలి వెళ్లగా.. ఇంకొందరు ఇంటి డాబాలమీదే ఉండిపోయారు. తిండి, తాగడానికి కనీసం మంచినీళ్లయినా దొరక్క ఇబ్బంది పడ్డారు. వరంగల్‌ ఎస్‌ఆర్‌ నగర్‌, సాయినగర్‌, మధురానగర్‌, వీవర్స్‌ కాలనీ, ఎంహెచ్‌నగర్‌ తదితర కాలనీల్లో వరద నీరు తగ్గలేదు. ఖమ్మం జిల్లా మున్నేరు వాగు పరీవాహక ప్రాంతంలోని గ్రామాలు, కాలనీల్లోకి వరద నీరు చేరడంతో అక్కడి ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. మున్నేరు ఉధృతికి ఆటోనగర్‌ పరిధిలోని 200 వాహనాల రిపేరు షాపుల్లోంని కార్లు నీట మునిగాయి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్‌లో భారీ వర్షానికి రోడ్లు వాగులను తలపించాయి. ప్రధాన రహదారికి రెండువైపుల ఉన్న దుకాణాల్లోకి వరద నీరు చేరింది. కిరాణాషాపుల్లోని సరుకులు అక్కరకు రాకుండాపోయాయి. వస్త్రదుకాణాల్లోని బట్టలు పాడయ్యాయి. ఓరుగంటి వెంకటరెడ్డి అనే ఎరువుల వ్యాపారికి చెందిన 400 యూరియా బస్తాలు వరదనీటితో తడిసిపోయాయి. పట్టణంలోని రోడ్లు కోతకు గురై ఇసుకమేటలు పెట్టాయి. నెహ్రు రోడ్డు పక్క కాలనీల్లో ఇళ్ళలోకి నీరు చేరింది. సెల్లార్లలో నీటిని మోటార్లతో ఎత్తిపోశారు.

విషాదాలు

సిద్దిపేట జిల్లాలోని అక్కన్నపేట మండలం మోత్కులపల్లె వాగు దాటుతూ బైక్‌పై వెళుతున్న భార్యాభర్తలు ప్రవాహంలో కొట్టుకుపోయారు. దంపతులను ఇసంపల్లి ప్రణయ్‌, కల్పనగా గుర్తించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. వరంగల్‌ ఎస్‌ఆర్‌ నగర్‌లో ఇంట్లోకి వరద నీరు చేరడంతో అనారోగ్యంతో కదల్లేని స్థితిలో ఉన్న ఆడెపు కృష్ణమూర్తి (75) అనే వృద్ధుడు పడుకున్న మంచం నీళ్లలో మునిగింది. ఆ నీటిలోనే మునిగి కృష్ణమూర్తి మృతిచెందారు. ఇంట్లో ఆయన ఒక్కరే ఉంటున్నారు. మహబూబాబాద్‌ జిల్లా కంబాలపల్లి సమీపంలోని మెట్లతండా వద్ద జంపన్నవాగులో రెడ్యాలకు చెందిన పులిగుజ్జు సంపత్‌ (30) అనే వ్యక్తి గల్లంతై మృతిచెందాడు. జనగామ జిల్లా జఫర్‌గఢ్‌ మండలం కోనాయిచలం వద్ద బోళ్ల మత్తడి వాగు ఉధృతికి బైక్‌పై వెళుతున్న బక్క శ్రావ్య (18), శివకుమార్‌ అనే ప్రేమజంట కొట్టుకుపోయింది. శ్రావ్య గల్లంతైంది. శివకుమార్‌ ఈదుకుంటూ బయటకొచ్చాడు. వరంగల్‌ జిల్లా గీసుకొండ సమీపంలోని ఓ మోరీలో అనిల్‌ కుమార్‌ (30) అనే వ్యక్తి మృతదేహం లభ్యమైంది. వరంగల్‌ జిల్లా గూడూరు మండలం గాజులగుట్టలో గోడ కూలి కోల రామక్క (65) అనే మహిళ మృతిచెందింది. రంగారెడ్డి జిల్లా బాటసింగారం వద్ద వాగులో బైక్‌పై వెళుతూ కృష్ణవేణి (44) అనే అంగన్‌వాడీ టీచర్‌ కొట్టుకుపోయి మృతిచెందింది. వరంగల్‌ జిల్లా ధర్మాసాగర్‌ మండలం ముప్పారంలో రెండు ఆవులు, ఒక గేదె మృతిచెందాయి. జనగామ జిల్లా వెల్దెండలో మేతకు వెళ్లిన 110 గొర్రెలు వరదలో కొట్టుకుపోయాయి. జిల్లాలోని రఘునాథపాలెంలో ఓ ఎద్దు మృతిచెందింది. మహబూబాద్‌ జిల్లా గూడురులో 58 గొర్రెలు మృతిచెందాయి.

2.jpg

Updated Date - Oct 31 , 2025 | 03:08 AM