Share News

Organ Donation: 4000 కిడ్నీలు కావాలి!

ABN , Publish Date - Dec 20 , 2025 | 05:04 AM

అవయవ మార్పిడికి రాష్ట్రంలో డిమాండ్‌ పెరిగిపోతోంది. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతుండడం, అవయవ దాతలు దొరక్కపోవడంతో ‘ప్రధాన అవయవాల..

Organ Donation: 4000 కిడ్నీలు కావాలి!

  • 3000 కాలేయాలు, 200 హృదయాలు,

  • ఊపిరితిత్తులు, 50 దాకా క్లోమాలు అవసరం

  • ‘తెలంగాణ జీవన్‌దాన్‌’లో వెయిటింగ్‌ లిస్ట్‌ ఇది

  • అవయవాల కోసం ఎదురుచూస్తున్న రోగులు

  • అవయవాలు అందక ఐదేళ్లలో 113 మంది మృతి

  • మృతుల సంఖ్యలో ఏడో స్థానంలో తెలంగాణ

హైదరాబాద్‌, డిసెంబరు 19 (ఆంధ్రజ్యోతి): అవయవ మార్పిడికి రాష్ట్రంలో డిమాండ్‌ పెరిగిపోతోంది. రోజురోజుకూ బాధితుల సంఖ్య పెరుగుతుండడం, అవయవ దాతలు దొరక్కపోవడంతో ‘ప్రధాన అవయవాల’ సమస్య జఠిలమవుతోంది. చాలామంది రోగులు.. మార్పిడికి అవసరమైన అవయవం కోసం దీర్ఘకాలం ఎదురుచూపూలు చూసి.. చివరికి నిస్సహాయస్థితిలో మృత్యువాత పడుతున్నారు. 3.77 కోట్ల జనాభా ఉన్న తెలంగాణలో ఇప్పటికిప్పుడు బాధితుల కోసం దాదాపు 4000 మూత్రపిండాలు కావాలి. 3000 దాకా కాలేయాల(లివర్‌) ఆవశ్యకత ఉంది. ఇది ‘తెలంగాణ జీవన్‌దాన్‌’ గణాంకాలు చెబుతున్న కఠోర వాస్తవం. అవయవాలు లభించక 2020 నుంచి 2024 నడుమ జీవన్‌దాన్‌ వెయిటింగ్‌ లిస్టులోని 113 మంది చనిపోయారు. ఇలా జీవన్‌దాన్‌ వెయిటింగ్‌ లిస్టులో ఉండి, చనిపోయినవారి సంఖ్య విషయంలో తెలంగాణ దేశంలోనే ఏడో స్థానంలో నిలిచింది. అలాగని.. జీవన్‌దాన్‌ స్కీమ్‌లో మన రాష్ట్రమేమైనా వెనుకబడి ఉందా అంటే.. అవయవ మార్పిడిలో దేశంలోనే ‘బెస్ట్‌ పెర్‌ఫార్మర్‌’గా అవార్డులు స్వీకరించింది. దాతల కొరతే ప్రస్తుతం పెద్ద సమస్యగా మారింది. వివిధ రకాల అనారోగ్యాలతో బాధపడుతూ అవయవాల మార్పిడి కోసం ఎదురుచూస్తున్నవారికి.. కిడ్నీలు, గుండె, కాలేయం, ఊపిరితిత్తులు, హృదయ కవాటాలు, కార్నియాలు, క్లోమాలు వంటి ప్రధాన అవయవాలను దాతల నుంచి సమకూర్చడం కోసం జీవన్‌దాన్‌ ఏర్పాటైంది. 12 ఏళ్ల కాలంలో జీవన్‌దాన్‌ ద్వారా 6,503 అవయవాలను బాధితులకు ట్రాన్స్‌ప్లాంట్‌ చేశారు. బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తుల నుంచి సేకరించిన అవయవాలను బాధితులకు అమరుస్తారు. తమ అవయవాలను దానం చేయాలని ఎవరైనా అనుకుంటే.. వారు పూర్తి ఆరోగ్యంతో ఉన్నప్పుడు అవయవదానానికి సంబంధించి హామీ పత్రాన్ని రాసి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ, దీనిపై ప్రజల్లో సరైన అవగాహన లేకపోవడం, బ్రెయిన్‌ డెడ్‌ అయిన వ్యక్తుల నుంచి అవయవాలను తీయడానికి కుటుంబసభ్యులు ఒప్పుకోకపోవడం వంటి కారణాల వల్ల కొరత ఏర్పడుతోంది. అదే సమయంలో.. అవయవాలు అవసరమైనవారి సంఖ్య నానాటికీ గణనీయంగా పెరిగిపోతోంది.


కిడ్నీలు భారీగా కావలెను..

జీవన్‌దాన్‌ వెయిటింగ్‌ లిస్టు ప్రకారం.. రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ప్రధాన అవయవాలు అవసరమైనవారి సంఖ్య దాదాపు 7 వేలకు పైగానే ఉంది. వీరిలోనూ.. ప్రధానంగా కిడ్నీలు అవసరమైనవారే ఎక్కువగా ఉండడం గమనార్హం. మధుమేహం కారణంగా చాలా మందికి మూత్రపిండాల సమస్య ఏర్పడుతోంది. మద్యపానం చేసేవారు పెరిగిపోతుండడంతో కాలేయ సమస్యలు పెరుగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో కాలేయమార్పిడి అవసరమైనవారి సంఖ్య 3 వేలకు పైగానే ఉంది. కానీ, కాలేయాలు అందుబాటులో లేవు. మరో 150-200 మందికి గుండె, ఊపిరితిత్తుల ట్రాన్స్‌ప్లాంటేషన్‌ ఆవశ్యకత ఉంది. ఇంకో 50 మందికి క్లోమ(ప్యాంక్రియాస్‌) మార్పిడిచేయాల్సి ఉంది. అవయవ మార్పిడికి సంబంధించి.. నిమ్స్‌లో రాష్ట్ర ప్రభుత్వ జీవన్‌దాన్‌ విభాగం ప్రత్యేకంగా ఉంది. నాలుగు ప్రభుత్వ ఆస్పత్రులు, మరో 37 ప్రైవేటు ఆస్పత్రులు జీవన్‌దాన్‌ కింద రిజిస్టర్‌ అయి ఉన్నాయి. వీటిలోనే అవయవ మార్పిడి జరుగుతుంటుంది. వీటిలో ఏడాదికి 7000 నుంచి 8000 వరకు అవయవ మార్పిడి చికిత్సలు చేసే సామర్థ్యం ఉంది. కానీ... దాతలు లేక అవి లక్ష్యాన్ని సాధించలేకపోతున్నాయి.

ప్రజల్లో అవగాహన లేకపోవడమే సమస్య

అవయవ దానంపై ప్రజల్లో సరైన అవగాహన లేదు. జీవన్‌దాన్‌ తరపున రాష్ట్రంలోని చాలా ప్రాంతాల్లో అవగాహన శిబిరాలను నిర్వహించాం. ముఖ్యంగా బ్రెయిన్‌ డెడ్‌ కేసులు వచ్చినప్పుడు.. వారి అవయవాలను స్వీకరించే సమయంలో వారి కుటుంబసభ్యుల నుంచి ఆటంకాలు ఎదురవుతున్నాయి. సెంటిమెంట్లు, ఎమోషనల్‌ బాండింగ్‌ వల్ల అవయవాలను దానం చేయడానికి వారు ఒప్పుకోవడం లేదు. అవయవాలను స్వీకరించిన కుటుంబాల నుంచి కూడా సరైన స్పందన ఉండడం లేదు. అవయవ దానం వల్ల తమకు ఎంత మేలు జరిగిందీ తెలిసినా.. స్వీకర్తల కుటుంబసభ్యుల్లో ఎవరూ అవయవదానానికి ముందుకు రావట్లేదు. అవయవదానంపై ప్రజల్లో అవగాహన ఏర్పడితేనే ఈ స్కీమ్‌ మరింత విజయవంతమవుతుంది.

- డా.శ్రీభూషణ్‌ రాజు,

తెలంగాణ జీవన్‌దాన్‌ నోడల్‌ ఆఫీసర్‌ (నిమ్స్‌)

Updated Date - Dec 20 , 2025 | 05:04 AM