National Rural Employment Guarantee Scheme: ఏటా రూ.1733 కోట్ల భారం!
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:25 AM
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పుల వల్ల రాష్ట్రంపై పెను భారం పడనుంది. ఈ పథకం కింద పని చేసే కూలీల వేతనాలకు 40 శాతం....
2024-25 ఉపాధి హామీ ఖర్చుల ప్రకారం చూస్తేతెలంగాణపై పడే ఆర్థిక భారమిది..
40 శాతం వాటా రాష్ట్రానికి శరాఘాతమే
కూలీల వేతనాలను సర్దుబాటు చేయడం కష్టమే
హైదరాబాద్, డిసెంబరు 16 (ఆంధ్రజ్యోతి): జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో కేంద్ర ప్రభుత్వం చేసిన మార్పుల వల్ల రాష్ట్రంపై పెను భారం పడనుంది. ఈ పథకం కింద పని చేసే కూలీల వేతనాలకు 40 శాతం, మెటీరియల్ కాంపొనెంట్ కింద మరో 15 శాతం నిధులు రాష్ట్ర ప్రభుత్వమే భరించాల్సిన పరిస్థితి ఏర్పడింది. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వెచ్చించిన నిధుల ప్రకారం చూస్తే ఉపాధి హామీ పథకం అమలుకు రాష్ట్ర ప్రభుత్వం రూ.1733.90 కోట్లు భరించాల్సి ఉంటుంది. ఉపాధి పథకంలో భాగంగా ప్రస్తుతం కూలీలకు ఇచ్చే వేతనాలను కేంద్రమే 100 శాతం చెల్లిస్తోంది. అలాగే పనులకు మెటీరియల్ కాంపొనెంట్ కింద కేంద్రం 75 శాతం ఇస్తే, రాష్ట్రం 25 శాతం నిధులు భరిస్తోంది. దేశవ్యాప్తంగా ప్రస్తుతం అమల్లో ఉన్న మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని వీబీ-జీరామ్‌జీగా మారుస్తూ కేంద్రం పార్లమెంటులో బిల్లు పెట్టింది. ఇందులో చేసిన మార్పుల ప్రకారం.. ఇకపై కేంద్రం 60 శాతం ఇస్తే, మిగిలిన 40 శాతం నిధులను రాష్ట్రాలు భరించాల్సి ఉంటుంది. 40 శాతం వాటా నిధులను భరించడం ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వానికి శరాఘాతంగా మారనుందని, ఉపాధి కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించే అవకాశం ఉండదని నిపుణులు పేర్కొంటున్నారు. రాష్ట్రంలో 2024-25లో ఉపాధి హామీ పథకం అమలు కోసం రూ.4344.51 కోట్లు ఖర్చు చేశారు. ఇందులో కూలీల వేతనాలకు రూ.2614.31 కోట్లు; పరిపాలనా, నిర్వహణ ఖర్చులకు రూ.229.24 కోట్లను వంద శాతం కేంద్ర ప్రభుత్వమే భరించింది. ఈ మొత్తంలో ప్రస్తుత నిబంధన ప్రకారం చూస్తే రాష్ట్రం తన వాటా 40 శాతం కింద రూ.1,137.52 కోట్లు భరించాల్సి ఉంటుంది. ఇక రూ.4344.51 కోట్లకు సంబంధించిన మెటీరియల్ కాంపొనెంట్ నిధుల ఖర్చు రూ.1500.96 కోట్లలో రాష్ట్రం తన వాటా (25ు)గా రూ.375.24 కోట్లు భరించింది. కొత్త బిల్లు ప్రకారం మెటీరియల్ కాంపొనెంట్‌లో రాష్ట్రం అదనంగా 15ు నిధులు (రూ.225.14 కోట్లు) భరించాల్సి ఉంటుంది. అంటే మొత్తం రూ.600.38 కోట్లు భరించాలి. ఈ లెక్కన రూ.4344.51 కోట్లలో రాష్ట్ర ప్రభుత్వం తన వాటా (40ు) కింద రూ.1733.90 కోట్లు భరించాల్సి ఉంటుంది.