Women Empowerment: మహిళా సాధికారతలో రోల్ మోడల్‌గా తెలంగాణ
ABN , Publish Date - Dec 09 , 2025 | 03:38 AM
మహిళా సాధికారతలో తెలంగాణ రోల్ మోడల్‌గా నిలుస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలు ఎదిగితేనే దేశం ఎదుగుతుందని...
స్టార్ట్‌పల నుంచి సౌర విద్యుత్ దాకా మహిళా సంఘాలు
2047 నాటికి మహిళా శ్రామిక భాగస్వామ్యం 90శాతం
చర్చలో భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించిన మంత్రి సీతక్క
హైదరాబాద్, డిసెంబరు 8 (ఆంధ్రజ్యోతి): మహిళా సాధికారతలో తెలంగాణ రోల్ మోడల్‌గా నిలుస్తోందని మంత్రి సీతక్క తెలిపారు. మహిళలు ఎదిగితేనే దేశం ఎదుగుతుందని, ఈ మార్పునకు తెలంగాణనే నాయకత్వం వహిస్తోందని పేర్కొన్నారు. సమ్మిట్‌లో సెర్ప్, మహిళా శిశు సంక్షేమశాఖ సంయుక్తంగా ఏర్పాటు చేసిన ఇందిరా మహిళా శక్తి స్టాల్‌ను సీతక్క ప్రారంభించారు. అనంతరం ప్యానల్ చర్చలో మాట్లాడారు. రాష్ట్రంలోని గ్రామీణ, పట్టణ ఆర్థిక వ్యవస్థల అభివృద్ధిలో 65 లక్షల మహిళా స్వయం సహాయక సంఘాలు కీలక పాత్ర పోషిస్తున్నాయని తెలిపారు. ఇందిరా మహిళా శక్తి పథకంతో పేద మహిళలు, వికలాంగులు, అట్టడుగు వర్గాల వారికి ప్రభుత్వం అండగా నిలుస్తోందన్నారు. తెలంగాణలో ఒక్క మహిళ కూడా వెనుకంజలో ఉండకూడదనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. దేశంలోనే తొలిసారిగా 64 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్లు మహిళల నేతృత్వంలో ఏర్పాటు కాబోతున్నాయని, బస్సులు కొని ఆర్టీసీకి అద్దెకు ఇవ్వడం ద్వారా మహిళా సంఘాలకు ప్రతి నెలా ఆదాయం సమకూరుతోందని తెలిపారు. మరెక్కడా లేని విధంగా మహిళలే పెట్రోల్ బంకులు నిర్వహిస్తున్నారని వెల్లడించారు. మహిళా శక్తి క్యాంటీన్లు, ధాన్యం కొనుగోలు కేంద్రాల నిర్వహణతో మహిళల ఆర్థిక స్వరూపం మారిపోయిందని పేర్కొన్నారు. మహాలక్ష్మి ఉచిత బస్సు ప్రయాణం ద్వారా రూ.7,600 కోట్లను మహిళలు ఆదా చేసుకున్నారని గుర్తు చేశారు. ‘రూ.500కే గ్యాస్ సిలిండర్’తో 45లక్షల కుటుంబాలకు లబ్ధి చేకూరిందని చెప్పారు. ప్రస్తుతం 52శాతంగా ఉన్న మహిళా శ్రామిక భాగస్వామ్యాన్ని 2047 నాటికి 90శాతానికి పెంచాలని సంకల్పించామన్నారు. మహిళా పారిశ్రామిక క్లస్టర్లతో ఉపాధి అవకాశాలు సృష్టించే స్థాయికి మహిళలు ఎదిగారని చెప్పారు.