Share News

Government Employee Fraud: విద్యుత్‌ ఏడీఈ అక్రమాస్తులు 100 కోట్లు

ABN , Publish Date - Sep 17 , 2025 | 06:21 AM

ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్‌ శాఖ ఏడీఈని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తెలంగాణ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలోని ఆపరేషన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌(ఏడీఈ)గా పనిచేస్తున్న ఏరుగు అంబేడ్కర్‌ ...

Government Employee Fraud: విద్యుత్‌ ఏడీఈ అక్రమాస్తులు 100 కోట్లు

  • సొంతంగా పదెకరాల్లో రసాయన పరిశ్రమ

  • బినామీ ఇంట్లో రూ.2.18 కోట్లు స్వాధీనం

  • అక్రమ సంపాదనతో రియల్‌ ఎస్టేట్‌ దందా

  • ఏసీబీకి చిక్కిన ఇబ్రహీంబాగ్‌ ఏడీఈ

  • హైదరాబాద్‌ శివార్లలో విద్యుత్‌ అధికారుల

  • అక్రమాలు.. బినామీ పేర్లతో కాంట్రాక్టులు

  • అంచనాలు పెంచి అక్రమాలు.. లంచాలు

హైదరాబాద్‌/హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 16 (ఆంధ్రజ్యోతి): ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో విద్యుత్‌ శాఖ ఏడీఈని ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. తెలంగాణ సదరన్‌ పవర్‌ డిస్ట్రిబ్యూషన్‌ కంపెనీలోని ఆపరేషన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ డివిజనల్‌ ఇంజనీర్‌(ఏడీఈ)గా పనిచేస్తున్న ఏరుగు అంబేడ్కర్‌ భారీగా అక్రమ ఆస్తులు కూడబెట్టారని ఏసీబీ అధికారులకు ఫిర్యాదులు అందాయి. దీంతో ఇబ్రహీంబాగ్‌లోని ఏడీఈ కార్యాలయం, మణికొండలోని అంబేద్కర్‌ ఇల్లు, బంధువులు, సన్నిహితులు, బినామీల ఇళ్లలో మొత్తం 11 చోట్ల ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నుంచి సోదాలు చేశారు. ఈ తనిఖీల్లో అంబేద్కర్‌ బినామీగా అనుమానిస్తున్న సతీశ్‌ ఇంట్లో రూ.2.18 కోట్లను స్వాధీనం చేసుకున్నారు. శేరిలింగంపల్లిలో ఒక ఫ్లాట్‌, గచ్చిబౌలిలో ఐదు అంతస్తుల భవనం, సూర్యాపేటలోని పెన్‌పహాడ్‌లో పది ఎకరాల్లో రసాయన పరిశ్రమ, ఖరీదైన ప్రాంతాల్లో ఆరు ఇళ్ల స్థలాలు, వెయ్యి గజాల మామిడి తోట, రెండు కార్లు, పెద్ద ఎత్తున బంగారు ఆభరణాలు, బ్యాంక్‌ డిపాజిట్లను ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ ఆస్తుల మార్కెట్‌ విలువ రూ.100 కోట్లకు పైగా ఉండవచ్చని అంతర్గత సంభాషణల్లో ఏసీబీ అధికారులు పేర్కొంటున్నారు. భార్య సునందతో కలిసి అంబేద్కర్‌ 2023 ఏప్రిల్‌ 23న అంతర్‌ కెమికల్స్‌ కంపెనీని రూ.3కోట్ల పెట్టుబడితో టీఎన్‌జీవో కాలనీలోని తన ఇంట్లో ప్రారంభించారు. ఆయన విద్యుత్‌ శాఖలో పనిచేస్తున్నప్పటికీ అంతర్‌ కెమికల్స్‌లో డైరెక్టర్‌గా ఆర్‌వోసీకి ఇచ్చిన సమాచారంలో పేర్కొన్నారు. కంపెనీ నిర్వహణ బాధ్యతలను గుర్రం రామకృష్ణకు అప్పగించినట్లు తెలుస్తోంది. అంబేద్కర్‌ తన అక్రమ ఆదాయంలో చాలా వరకు రియల్‌ ఎస్టేట్‌లో పెట్టుబడి పెట్టినట్లు ఏసీబీ అధికారులు అనుమానిస్తున్నారు. పదేళ్లుగా కీలకమైన ప్రాంతాల్లో (పటాన్‌ చెరు, గచ్చిబౌలి, కేపీహెచ్‌బీ, ఇబ్రహీంబాగ్‌) ఏడీఈగా పనిచేస్తున్న అంబేద్కర్‌ పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారనే ఆరోపణలున్నాయి. మంగళవారం రాత్రి ఆయనను మెజిస్ట్రేట్‌ ఎదుట హాజరుపరిచిన తర్వాత కస్టడీ పిటిషన్‌ దాఖలు చేయనున్నామని ఏసీబీ అధికారులు తెలిపారు.

రూ.78లక్షల బ్యాంకు బ్యాలన్స్‌..

ఏడీఈ అంబేద్కర్‌ బ్యాంకు ఖాతాల్లో రూ.78 లక్షల బ్యాలన్స్‌, షేర్లలో రూ.36లక్షల పెట్టుబడుల వివరాలను గుర్తించామని ఏసీబీ డీఎస్పీ ఆనంద్‌ తెలిపారు. అంబేద్కర్‌ కారులో రూ.5.50 లక్షల నగదు దొరికిందని, బ్యాంకు లాకర్లు తెరవాల్సి ఉందని చెప్పారు. బంగారు ఆభరణాలు ఇతరత్రా ఆస్తులకు సంబంధించి త్వరలో వివరాలు వెల్లడిస్తామని, సోదాలు కొనసాగుతున్నాయని పేర్కొన్నారు.


హైదరాబాద్‌ శివారు ప్రాంతాల్లో అక్రమాలు

హైదరాబాద్‌తో పాటు శివారు ప్రాంతాల్లో కొంతమంది విద్యుత్‌ శాఖ అధికారులు భారీగా అక్రమాలకు పాల్పడుతూ రూ.కోట్లు కొల్లగొడుతున్నారు. శివారు ప్రాంతాల్లో పెద్ద సంఖ్యలో కొత్త అపార్ట్‌మెంట్లు, భారీగా కమర్షియల్‌ భవనాలు వెలుస్తుండటం వారికి ఆదాయ మార్గంగా మారుతోంది. దక్షిణ డిస్కమ్‌లో 90 శాతం పనులను ప్రైవేటు కాంట్రాక్టర్లు చేస్తున్నారు. దీంతో బినామీ పేర్లతో కాంట్రాక్టు పనులు చేపడుతున్న అధికారులు దండిగా వెనకేసుకుంటున్నారు. కుటుంబ సభ్యులు, ఆర్టిజన్లు పేర్లతో కాంట్రాక్ట్‌ లైసెన్సులు తీసుకొని పనులు చేస్తున్నారు. అభివృద్ధి పనుల్లో అంచనాలను పెంచడంతో పాటు తమకు సంబంధించిన కాంట్రాక్టర్లకే ఆ పనులు అప్పగించి అందినకాడికి దండుకుంటున్నారు. దక్షిణ డిస్కమ్‌లో 20 మందికి పైగా అధికారులు బినామీ పేర్లతో ప్రైవేట్‌ కాంట్రాక్టు పనులు చేస్తూ భారీగా అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి. కొంత మంది అధికారులు రాజకీయ నేతలకు రూ.30-50 లక్షలు ఇచ్చి కోరుకున్న ప్రాంతాల్లో పోస్టింగులు తెచ్చుకుంటున్నారనే ఆరోపణలున్నాయి. ఆ సొమ్మును వసూలు చేసుకునేందుకు అక్రమాలకు పాల్పడుతున్నారనే విమర్శలున్నాయి. ప్రధానంగా శివారు ప్రాంతాల్లో పోస్టింగుల కోసం పైరవీలు జోరుగా నడుస్తాయనే చర్చ జరుగుతోంది.

ఆర్టిజన్‌, లైన్‌మెన్ల అక్రమాలు..

శివారు ప్రాంతాల్లో కొంత మంది లైన్‌మెన్లు, లైన్‌ ఇన్‌స్పెక్టర్లు, ఆర్టిజన్లు స్థానిక అధికారుల అండతో యథేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతున్నారు. జీడిమెట్ల, గాజులరామారంలో ఎస్టిమేషన్లు లేకుండా ప్యానెల్‌ బోర్డులు ఇవ్వడంతో పాటు ఇంటి నంబర్లకు బై నంబర్లు జతచేస్తూ అక్రమంగా 10-12 విద్యుత్‌ మీటర్లు జారీచేస్తున్నారు. జీడిమెట్ల, పటాన్‌చెరు, సంగారెడ్డి, కొండాపూర్‌, కూకట్‌పల్లి, గాజులరామారం, కుత్బుల్లాపూర్‌, కీసర ప్రాంతాల్లో కొంత మంది విద్యుత్‌ సిబ్బంది.. స్థానిక అధికారుల అండతో అక్రమాలకు పాల్పడుతున్నారనే ఫిర్యాదులున్నాయి. అనేక ప్రాంతాల్లో అనుమతులు లేకుండా నిర్మిస్తున్న భవనాలకు విద్యుత్‌ మీటర్ల జారీకి రూ.లక్షల్లో వసూలు చేస్తున్నారు. గాజులరామారం, డీపీపల్లిలో ఒక్కో మీటర్‌ ఇచ్చేందుకు రూ.30-40వేలు వసూలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. అనేక డివిజన్లలో కొంత మంది ఆర్టిజన్లు, లైన్‌మెన్లు స్థానిక అధికారుల సహకారంతో ప్రైవేట్‌ కాంట్రాక్టు పనులు చేపడుతున్నారు. జీడిమెట్ల పరిధిలో కొంత మంది ప్యానెల్‌ బోర్డు లేకుండా ఎక్కువ మీటర్లు తీసుకునేందుకు ఇంటి నంబర్లకు బై నంబర్లు, యజమాని పేరులో చిన్నమార్పులు చేస్తూ అదనపు కనెక్షన్లు ఇస్తున్నారు. ఒక్క సీటీ మీటర్‌ విడుదల చేయాలంటే క్షేత్రస్థాయి సిబ్బందికి రూ.4-5 వేల వరకు ఇస్తే తప్ప ఫైళ్లు ముందుకు కదలని పరిస్థితులున్నాయనే ఫిర్యాదులున్నాయి.

Updated Date - Sep 17 , 2025 | 06:21 AM