Share News

Telangana Electricity Regulatory Commission: కిలోవాట్‌కు 1000 చొప్పున కడితే వ్యవసాయ కనెక్షన్‌

ABN , Publish Date - Nov 26 , 2025 | 04:29 AM

విద్యుత్తు కనెక్షన్ల పరంగా అన్నదాతలు, కొత్తగా ఇళ్లు కట్టుకున్న వారికి, వాణిజ్య సముదాయాల నిర్వాహకులకు ఊరట లభించనుంది. డిస్కమ్‌ ఉద్యోగుల వసూళ్ల దందాకు బ్రేక్‌ పడనుంది....

Telangana Electricity Regulatory Commission: కిలోవాట్‌కు 1000 చొప్పున కడితే వ్యవసాయ కనెక్షన్‌

  • అపార్ట్‌మెంట్‌, ఇళ్లు, వాణిజ్య భవనాలకు ఎస్టిమేట్ల దందా నుంచి విముక్తి

  • లైన్‌చార్జీలపై ఈఆర్‌సీ ముసాయిదా

  • డిసెంబరు 9దాకా అభిప్రాయ సేకరణ

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు కనెక్షన్ల పరంగా అన్నదాతలు, కొత్తగా ఇళ్లు కట్టుకున్న వారికి, వాణిజ్య సముదాయాల నిర్వాహకులకు ఊరట లభించనుంది. డిస్కమ్‌ ఉద్యోగుల వసూళ్ల దందాకు బ్రేక్‌ పడనుంది. ఈ మేరకు కొత్తగా వ్యవసాయ విద్యుత్తు కనెక్షన్‌ కోసం రైతులు కిలోవాట్‌కు రూ.1000లు చొప్పున చెల్లిస్తేచాలు. ఇలా ఎన్ని కిలోవాట్ల సామర్థ్యం కలిగిన కనెక్షన్‌ తీసుకోవాలంటే ఆ మేరకు చార్జీలు చెల్లిస్తే ఇతర చార్జీలతో సంబంధం లేకుండా విద్యుత్తు కనెక్షన్‌ ఇవ్వాల్సిందే! ప్రస్తుతం వ్యవసాయ కనెక్షన్‌కు దరఖాస్తు చేసుకుంటే వ్యవసాయ పంపుసెట్టు మూడు స్తంభాలలోపు ఉంటే కనెక్షన్‌ ఇస్తున్నారు. మూడు స్తంభాలను దాటి ఉంటే ఔట్‌రైట్‌ కంట్రిబ్యూషన్‌(ఓఆర్‌సీ) కింద రూ.45 వేలపైన కట్టాల్సి వస్తోంది. ఈ చార్జీలకు ముగింపు పలుకుతూ రెగ్యులేషన్‌ ముసాయిదాను ఈఆర్‌సీ విడుదల చేసింది. దీనిపై డిసెంబరు 9వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు అభిప్రాయాలు/అభ్యంతరాలు స్వీకరిస్తారు. అనంతరం ఈఆర్‌సీ ఉత్తర్వులు ఇవ్వనుంది. అదే జరిగితే డిస్కమ్‌లలో విద్యుత్తు ఉద్యోగులు/అధికారులు చేసే ఎస్టిమేషన్‌ల దందాకు ముగింపు పడనుందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. వాస్తవానికి 2024 అక్టోబరులో ఈ రెగ్యులేషన్‌ ముసాయిదాను తెచ్చారు. దీనిపై అభ్యంతరాలు రాగా... భారీ మార్పులు చేశారు. ఇక కొత్తగా అపార్ట్‌మెంట్‌లు, వాణిజ్య సముదాయాలు, బహుళ అంతస్థుల భవనాలు కట్టుకొని కనెక్షన్‌ కోసం దరఖాస్తు చేసుకుంటే... ఎస్టిమేషన్స్‌ పేరిట డిస్కమ్‌ల ఉద్యోగులు దందాలు చేసే వారు. ఇక ముందు లైన్‌ చార్జీలు సామర్థ్యం ఆధారంగా చెల్లిస్తే కనెక్షన్లు ఇవ్వాల్సిందే. 20 కిలోవాట్ల లోడు దాటితే ప్రతి కిలోవాట్‌కు రూ.10 వేలచొప్పున కడితే... 25 కిలోవాట్లకు రూ.2.50 లక్షలు క డితే... ఆ నిర్మాణానికి అవసర మైన లైన్లు వేయడం, చివరికి ట్రాన్స్‌ఫార్మర్‌ కూడా బిగించడం డిస్కమ్‌దే బాధ్యత కానుంది. 2020 డిసెంబరు 31వ తేదీన ఎలక్ట్రిసిటీ (రైట్స్‌ ఆఫ్‌ కన్స్జూమర్‌) రూల్స్‌ ప్రకారం వినియోగదారులకు విద్యుత్తును అందించడానికి వీలుగా 150 కిలోవాట్లలోపు లేదా ఆ పైన లోడు కోసం కొత్తగా సరఫరా వ్యవస్థకు వెచ్చించిన వ్యయాన్ని తిరిగి రాబట్టుకోవాలని కేంద్ర విద్యుత్తు మంత్రిత్వశాఖ డిస్కమ్‌లకు ఆదేశాలు ఇచ్చిన విషయం విదితమే. దాంతో కేంద్రప్రభుత్వ వెసులుబాటుతో రెగ్యులేషన్‌ను సవరించాలని డిస్కమ్‌లు ఏడాది కిందట ఈఆర్‌సీని కోరాయి. దాంతో ఈ ముసాయిదా రెగ్యులేషన్‌ సవరణపై అభిప్రాయాలు/అభ్యంతరాలు స్వీకరించి మళ్లీ సవరించారు. ప్రతిపాదించినచార్జీలు వసూలు చేసిన తర్వాత పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లను విధిగా డిస్కమ్‌లు సమకూర్చాల్సి ఉంటుంది. దీనికి ఎట్టి పరిస్థితుల్లోనూ అదనంగా చార్జీలు వసూలు చేయడానికి వీల్లేదు. ఇక ఈ రెగ్యులేషన్స్‌ అమల్లోకి వస్తే... ఎస్టిమేషన్స్‌ పేరిట డిస్కమ్‌లలో జరుగుతున్న అవినీతి సగానికి పైగా తగ్గుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

Updated Date - Nov 26 , 2025 | 04:29 AM