NTPC Ramagundam Plant: ఎన్టీపీసీ నుంచి 800 మెగావాట్ల కరెంట్ కొంటాం
ABN , Publish Date - Dec 19 , 2025 | 04:21 AM
రామగుండంలో ఎన్‌టీపీసీకి చెందిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్టీపీపీ)లోని 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్తు కొనుగోలుకు అనుమతి కోరుతూ తెలంగాణ విద్యుత్తు...
అనుమతి కోసం ఈఆర్సీలో డిస్కమ్‌ల పిటిషన్లు
హైదరాబాద్, డిసెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రామగుండంలో ఎన్‌టీపీసీకి చెందిన తెలంగాణ సూపర్ థర్మల్ పవర్ స్టేషన్ (ఎస్టీపీపీ)లోని 800 మెగావాట్ల థర్మల్ పవర్ ప్లాంట్ నుంచి విద్యుత్తు కొనుగోలుకు అనుమతి కోరుతూ తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(టీజీఈఆర్సీ)లో డిస్కమ్‌లు పిటిషన్‌లు వేశాయి. తెలంగాణ విద్యుత్తు అవసరాలు తీర్చడానికి వీలుగా రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ చట్టం-2014 ప్రకారం 4 వేల మెగావాట్ల పవర్ ప్లాంట్‌ను ఎన్‌టీపీసీ కట్టి.. విద్యుత్తు ఇవ్వాలి. దీన్ని రామగుండంలో కడుతున్నారు. అయితే ఇందులో తొలిదశలో 1,600 మెగావాట్లు (ఒక్కోటి 800 మెగావాట్ల) నుంచి ఇప్పటికే కరెంట్ కొనుగోలు చేస్తున్నారు. 2024 మార్చి 1వ తేదీ నుంచి 1,600 మెగావాట్లలో 85 శాతం విద్యుత్తును తెలంగాణ డిస్కమ్‌లు కొంటున్నాయి. రెండో దశలో 2,400 మెగావాట్ల ప్లాంట్‌కు సమ్మతి తెలపలేదు. అయితే రానున్న రోజుల్లో డిమాండ్ భారీగా పెరిగే అవకాశమున్నందున.. రెండో దశలోని 2,400 మెగావాట్లలో 800 మెగావాట్ల కరెంట్ కొనుగోలుకు తెలంగాణ డిస్కమ్‌లు సమ్మతి తెలిపాయి. దాంతో 25 ఏళ్ల కాలానికి విద్యుత్తును కొనుగోలు చేయనున్నాయి. ఈ నిర్ణయంపై 2026 జనవరి 1వ తేదీలోపు సూచనలు/సలహాలు అందించాలని ఈఆర్సీ కోరింది. దీనిపై జనవరి 8న బహిరంగ విచారణ జరపనుంది.