Electricity Distribution: డిస్కమ్‌ల నష్టాలు 59 వేల కోట్లు
ABN , Publish Date - Dec 28 , 2025 | 07:15 AM
రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు భారీగా పెరిగిపోయాయి. ఇవి అక్షరాలా రూ.59,089 కోట్లకు చేరాయి.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడే నాటికి 12,186 కోట్లే.. 11 ఏళ్లలో భారీగా పెరిగిపోయిన నష్టాలు
ఉచిత విద్యుత్ ఇస్తున్న వ్యవసాయ పంపుసెట్లకు అనుగుణంగా ప్రభుత్వం సబ్బిడీ పెంచనందునే!
2024-25లో మాత్రం గణనీయంగా తగ్గిన నష్టాలు
హైదరాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలోని విద్యుత్ పంపిణీ సంస్థల నష్టాలు భారీగా పెరిగిపోయాయి. ఇవి అక్షరాలా రూ.59,089 కోట్లకు చేరాయి. అయితే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఏటేటా పెరుగుతూ పోయిన ఈ నష్టాలు 2024-25 ఆర్థిక సంవత్సరంలో మాత్రం కొంతమేర తగ్గాయి. రాష్ట్రం ఏర్పడే నాటికి తెలంగాణలో కార్యకలాపాలు జరుగుతున్న సంస్థల పరిధిలోని ప్రాంతాలను లెక్కలోకి తీసుకోగా.. నష్టాలు రూ.12186 కోట్లుగా తేలాయి. ఆ తర్వాత ఉదయ్ ఒప్పందంలో భాగంగా ఈ మొత్తంలో 75 శాతాన్ని ప్రభుత్వం తనమీదికి మార్చుకుంది. దీంతో 2014-15 ఆర్థిక సంవత్సరంలో (తెలంగాణ రాష్ట్రంలో తొలి ఏడాది) నష్టాలు రూ.2513 కోట్లు మిగిలాయి. ఆపై ఏటేటా ఇవి భారీగా పెరిగాయి. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం దిగిపోవడానికి ముందు ఏడాది 2022-23 ఆర్థిక సంవత్సరంలో డిస్కమ్‌లకు ఏకంగా రూ.11,103 కోట్ల నష్టాలు వచ్చాయి. బీఆర్‌ఎస్ అధికారం కోల్పోయిన సంవత్సరం (2023-24)లో రూ.6,351 కోట్లుగా రికార్డయ్యాయి. మొత్తంగా 11 ఏళ్ల కాలంలో వచ్చిన నష్టాల్లో దక్షిణ డిస్కమ్ (టీజీఎస్పీడీసీఎల్) వాటా రూ.41,105 కోట్లుగా ఉండగా, ఉత్తర డిస్కమ్ (టీజీఎన్పీడీసీఎల్) వాటా రూ.17,984 కోట్లుగా ఉంది. రాష్ట్రంలో బీఆర్‌ఎస్ తొమ్మిదిన్నరేళ్లపాటు అధికారంలో ఉండగా.. ఏ సంవత్సరంలోనూ డిస్కమ్‌లు లాభాల్లో లేవు. కేవలం 2021-22 ఆర్థిక సంవత్సరంలో మాత్రం కొంతమేర తక్కువ నష్టాలు (రూ.831 కోట్లు) రికార్డయ్యాయి.
2018 నుంచి నష్టాల పెరుగుదల..
రాష్ట్రంలో వ్యవసాయ రంగానికి 24 గంటల విద్యుత్ సరఫరా ప్రారంభమైన 2018 జనవరి 1 నుంచి డిస్కమ్‌ల నష్టాలు పెరుగుతూ వచ్చాయి. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో వ్యవసాయానికి 7 గంటలపాటు మాత్రమే విద్యుత్ సరఫరా జరిగేది. ఆ తర్వాత 2014 నవంబరు 20 నుంచి వ్యవసాయానికి 9 గంటలపాటు కరెంట్ సరఫరా చేయడం ప్రారంభించారు. అనంతరం 2017 జూలై నుంచి పూర్వ మెదక్, న ల్లగొండ, కరీంనగర్ జిల్లాల్లో 24 గంటలపాటు వ్యవసాయానికి విద్యుత్ సరఫరాను ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. 2017 నవంబరు 6 నుంచి 20 వరకు రాష్ట్రంలోని అన్ని వ్యవసాయ పంపుసెట్లకు ప్రయోగాత్మకంగా 24 గంటల కరెంట్ ఇచారు. ఆ తరువాత 2018 జనవరి 1 నుంచి పూర్తిస్థాయిలో 24 గంటలపాటు విద్యుత్‌ను సరఫరా చేశారు. మరోవైపు రాష్ట్రం వచ్చిన కొత్తలో 23 లక్షలుగా ఉన్న వ్యవసాయ పంపుసెట్లు ప్రస్తుతం 29 లక్షలకు చేరాయి. దీనికి అనుగుణంగా విద్యుత్ సంస్థలకు ప్రభుత్వం సబ్సిడీని పెంచకపోవడంతో డిస్కమ్‌లు క్రమంగా నష్టాల బాటలోకి చేరాయి. అయితే 2024-25 ఆర్థిక సంవత్సరంలో డిస్కమ్‌ల నష్టాలు గతంతో పోలిస్తే గణనీయంగా తగ్గాయి. మొత్తం నష్టాలు రూ.2462 కోట్లుగా నమోదయ్యాయి. జలవిద్యుత్ ఉత్పాదన మెరుగ్గా జరగడంతోపాటు వ్యవసాయ రంగానికి అవసరం మేరకు విద్యుత్‌ను అందిస్తుండటమే ఇందుకు కారణమని గుర్తించారు. రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2021-22 మినహా 2024-25లో మాత్రమే డిస్కమ్‌లకు తక్కువ నష్టాలు రావడం గమనార్హం.