Share News

Telangana Govt: జూరాల.. వరదాయిని

ABN , Publish Date - Sep 19 , 2025 | 06:24 AM

పోతిరెడ్డిపాడు, బనకచర్ల.. కృష్ణా జలాలను వాడుకోవడానికి శ్రీశైలం ప్రాజెక్టు కేంద్రంగా ఏపీ చేపట్టిన భారీ ప్రాజెక్టులు! ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు నీటిని తరలిస్తోంది!

Telangana Govt: జూరాల.. వరదాయిని

  • రిజర్వాయర్‌ కేంద్రంగా 16 ప్రాజెక్టులు

  • 247 టీఎంసీల తరలింపునకు సర్కారు పావులు

  • డీపీఆర్‌ తయారీకి ఇప్పటికే జీవో నంబరు 34 జారీ

  • ప్రతిని బ్రిజేష్‌ ట్రైబ్యునల్‌కు అందజేయాలని నిర్ణయం

  • డీపీఆర్‌ తయారీ బాధ్యత ఆయా ప్రాజెక్టుల సీఈలకు

  • కృష్ణా జలాల గరిష్ఠ వినియోగంపై ప్రభుత్వం దృష్టి

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): పోతిరెడ్డిపాడు, బనకచర్ల.. కృష్ణా జలాలను వాడుకోవడానికి శ్రీశైలం ప్రాజెక్టు కేంద్రంగా ఏపీ చేపట్టిన భారీ ప్రాజెక్టులు! ఇక్కడి నుంచే వివిధ ప్రాంతాలకు నీటిని తరలిస్తోంది! దీనికి కౌంటర్‌గా తెలంగాణలోనూ ప్రాజెక్టులు నిర్మించాలని రేవంత్‌ సర్కారు నిర్ణయించింది. కృష్ణా జలాలను సద్వినియోగం చేసుకోవాలని భావిస్తోంది. శ్రీశైలం కంటే ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టును ఇందుకు ప్రధాన కేంద్రంగా ఎంచుకుంది. జూరాల కేంద్రంగా 247 టీఎంసీలను వినియోగించుకునేందుకు వీలుగా ప్రాజెక్టులను నిర్మించడంపై ప్రభుత్వం దృష్టిసారించింది. ఈ మేరకు 16 ప్రాజెక్టుల డీపీఆర్‌లు సిద్ధం చేయడానికి వీలుగా జీవో నంబరు 34ను జారీ చేసింది. ప్రస్తుతానికి దీనిని ఈనెల 23వ తేదీ నుంచి జరగనున్న జస్టిస్‌బ్రిజేష్ కుమార్‌ ట్రైబ్యునల్‌ (కృష్ణా ట్రైబ్యునల్‌-2)కు అందిస్తుంది. ఇక, ఈ ప్రాజెక్టులన్నీ వనపర్తి, సూర్యాపేట్‌, నాగర్‌కర్నూలు, మహబూబ్‌నగర్‌, వరంగల్‌, ఖమ్మం, నల్లగొండ, హైదరాబాద్‌ చీఫ్‌ ఇంజనీర్ల పరిధిలో ఉన్నాయి. దాంతో, డీపీఆర్‌లను సిద్ధం చేసే బాధ్యతను వారికి అప్పగించనుంది. ప్రస్తుతం ట్రైబ్యునల్‌లో కృష్ణా జలాల పంపిణీపై విచారణ జరుగుతున్న విషయం తెలిసిందే. తెలుగు రాష్ట్రాలు వీటిపై తుది వాదనలు వినిపిస్తున్నాయి. ఉమ్మడి ఏపీకి బచావత్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన 811 టీఎంసీలతోపాటు పోలవరం ప్రాజెక్టు నుంచి కృష్ణా డెల్టాకు తరలించే 80 టీఎంసీల్లో ఎగువ రాష్ట్రాల వాటా 45 టీఎంసీలు, జస్టిస్‌ బ్రిజేష్ కుమార్‌ ట్రైబ్యునల్‌ కేటాయించిన జలాలన్నీ కలుపుకొని 1050 టీఎంసీలపై ప్రస్తుతం వాదనలు జరుగుతున్నాయి. అయితే, పాత ప్రాజెక్టులు, నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులు, భవిష్యత్‌లో కట్టే ప్రాజెక్టులు కలుపుకొని 904 టీఎంసీలపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. కృష్ణా జలాల్లో 904 టీఎంసీలను తెలంగాణకు కేటాయించేలా వాదనలు వినిపించాలని, ఆ మేరకు ప్రాజెక్టుల నిర్మాణాల కోసం అవసరమైన సమగ్ర ఇన్వెస్టిగేషన్లు, ప్రాజెక్టుల సామర్థ్యం పెంపు, డీపీఆర్‌ల తయారీపై దృష్టి సారించాలని సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఇప్పటికే అధికారులను ఆదేశించారు కూడా. ఇందులో భాగంగానే, జూరాల కేంద్రంగా 247 టీఎంసీల ప్రాజెక్టులను చేపట్టాలని ప్రభుత్వం తాజాగా నిర్ణయం తీసుకుంది.


ఆ వివరాలు ఇవే

  • 100 టీఎంసీలతో జూరాల వరద కాలువ పథకం. ప్రతిరోజూ 2 టీఎంసీల నీటిని ఈ పథకం కింద ఉమ్మడి మహబూబ్‌నగర్‌, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ జిల్లాలకు తరలిస్తారు. కాలువ వెంట గ్రామాల్లో రిజర్వాయర్లు, చెరువులు నింపుతూ 11.3 లక్షల ఎకరాలకు నీటిని అందించడం ఈ ప్రాజెక్టు ఉద్దేశం.

  • జూరాల జలాశయం బ్యాక్‌ వాటర్‌పై 123 టీఎంసీలతో కోయిల్‌కొండ-గండీడ్‌ ఎత్తిపోతల పథకం. వరద సమయంలో నీటిని తరలించడం, 45 టీఎంసీలతో కోయిల్‌కొండ రిజర్వాయర్‌ సామర్థ్యం పెంచడం, 35 టీఎంసీలతో గండీడ్‌ రిజర్వాయర్‌, 43 టీఎంసీలతో దౌలతాబాద్‌ రిజర్వాయర్ల సామర్థ్యం పెంపు కోసం డీపీఆర్‌ను సిద్ధం చేయడం.

  • కోయిల్‌సాగర్‌ ప్రాజె క్టు నుంచి 13,500 ఎకరాలకు సాగునీటితోపాటు తాగునీటి అవసరాలు తీర్చడానికి 3.30 టీఎంసీలతో కోయిల్‌సాగర్‌ ఎత్తిపోతల పథకం.

  • జవహర్‌ నెట్టెంపాడు ఎత్తిపోతల పథకంలో భాగంగా 4 టీఎంసీల సామర్థ్యంతో రేలంపాడు రిజర్వాయర్‌ను కట్టగా.. దాని సామర్థ్యాన్ని 10 టీఎంసీలకు పెంచనున్నారు.

  • గట్టు బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ సామర్థ్యం 1.32 టీఎంసీల నుంచి 5/10 టీఎంసీలకు పెంపు.

  • జవహర్‌ నెట్టెంపాడు రెండో దశలో భాగంగా 25 వేల ఎకరాలకు సాగునీటిని అందించడానికి వీలుగా జూరాల ప్రాజెక్టు నుంచి 4 టీఎంసీలను అదనంగా వినియోగించడం.

  • పులిచింతల రిజర్వాయర్‌ నుంచి నీటిని వాడుకునేలా సూర్యాపేట జిల్లా మఠంపల్లి మండలంలో 0.5 టీఎంసీల ఎత్తిపోతల పథకాల నిర్మాణం

  • శ్రీశైలం ప్రాజెక్టు నుంచి కల్వకుర్తి ఎత్తిపోతల పథకం రెండో దశను చేపట్టడం. దీనికింద 13 టీఎంసీలను తరలించి.. 93,531 ఎకరాలకు సాగు, 7.12 టీఎంసీలతో తాగునీటిని అందించేలా డీపీఆర్‌.

  • మహబూబాబాద్‌ జిల్లా నర్సింహులుపేట మండలం జయాపురంలోని ఆకేరు వాగు నుంచి 2 టీఎంసీలను మళ్లించి, 11,250 ఎకరాలకు సాగునీటిని అందించడానికి బ్యారేజీ నిర్మాణం.

  • మహబూబాబాద్‌ జిల్లా మరిపెడ మండలం విస్సంపల్లె గ్రామంలో ఆకేరు వాగుపై బ్యారేజీ కట్టి.. 1.2 టీఎంసీల నీటిని తరలించి, 11,799 ఎకరాలకు సాగునీరు అందించడం.


  • మహబూబాబాద్‌ జిల్లా గార్ల మండలం ములకనూరు గ్రామంలో మున్నేరు నదిపై బ్యారేజీ నిర్మాణం. 1.2 టీఎంసీల నీటిని తరలించి, 11,871 ఎకరాలకు సాగునీటిని అందించడం.

  • మహబూబాబాద్‌ జిల్లా డోర్నకల్‌ మండలం ములకపల్లిలో 25 నుంచి 35 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్‌ నిర్మాణం.

  • ఖమ్మం జిల్లా తిరుమలాయపాలెం మండలం ఏడూళ్ల చెరువు గ్రామం వద్ద ఆకేరు నదిపై బ్యారేజీ కట్టి... 1.3 టీఎంసీల జలాలను తరలించి, 13,129 ఎకరాలకు సాగునీటిని అందించడం.

  • శ్రీశైలం లెఫ్ట్‌ బ్యాంక్‌ కెనాల్‌ (ఎస్‌ఎల్‌బీసీ) ప్రాజెక్టులో భాగంగా నాగర్‌కర్నూలు జిల్లా కొల్లాపూర్‌ మండలం సోమశిల గ్రామం వద్ద శ్రీశైలం బ్యాక్‌ వాటర్‌ నుంచి రోజుకు 1 టీఎంసీ చొప్పున 35 రోజుల్లో 35 టీఎంసీలు తరలించి, ఉమ్మడి నల్గొండ జిల్లాలో 3.99 లక్షల ఎకరాలకు సాగు, తాగునీటిని అందించేలా ప్రాజెక్టు నిర్మాణం.

  • హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతంతోపాటు రీజినల్‌ రింగు రోడ్డు లోపలి గ్రామాలకు తాగునీటిని అందించడానికి వీలుగా 10 టీఎంసీల చొప్పున దేవులమ్మ నాగారం, దండు మైలారంలో, ఆరుట్లలో 5-10 టీఎంసీలతో జలాశయాల నిర్మాణం కోసం ఇన్వెస్టిగేషన్‌. డీపీఆర్‌ తయారీ.

Updated Date - Sep 19 , 2025 | 06:26 AM