Uttam Kumar Reddy: కృష్ణా జలాల్లో 71 శాతం ఇవ్వాల్సిందే
ABN , Publish Date - Sep 14 , 2025 | 05:28 AM
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించారని, అందులో 65 శాతం డిపెండబులిటీతో 71 శాతం వాటాను తెలంగాణకు కేటాయించేలా..
కృష్ణా ప్రాజెక్టులనుబీఆర్‌ఎస్ పూర్తి చేయలేదు
నీళ్లను సంపూర్ణంగా వాడుకోలేకపోవడానికి కారణం ఇదేనీటిపారుదల మంత్రి ఉత్తమ్‌కుమార్
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 811 టీఎంసీల కృష్ణా జలాలను కేటాయించారని, అందులో 65 శాతం డిపెండబులిటీతో 71 శాతం వాటాను తెలంగాణకు కేటాయించేలా ట్రైబ్యునల్‌లో పట్టుబడతామని నీటి పారుదల శాఖ మంత్రి ఎన్.ఉత్తమ్ కుమార్ రెడ్డి స్పష్టం చేశారు. కృష్ణా ట్రైబ్యునల్‌లో తెలంగాణ వాదనలపై శనివారం ఆయన జలసౌధలో సుప్రీం కోర్టు సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్, న్యాయ నిపుణులు, నీటిపారుదల రంగ నిపుణులతో సమావేశమయ్యారు. కృష్ణా జలాల్లో తెలంగాణకు రావాల్సిన న్యాయమైన వాటాను కాపాడుకునేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. ఇదే అంశంపై ఒత్తిడి తెచ్చేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్ని కార్యక్రమాలను రద్దు చేసుకుని ఢిల్లీకి చేరుకుని సమీక్షిస్తారని వెల్లడించారు. పెరుగుతున్న అవసరాలకు తగ్గట్లుగా నీటి కేటాయింపులు ఉండాలని, అందుకనుగుణంగా తాజా సమాచారాన్ని ట్రైబ్యునల్‌కు సమర్పించామని, ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ అవకాశాన్ని జారవిడుచుకోబోమని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు, జాతీయ హరిత ట్రైబ్యునల్, నదీ యాజమాన్యాల బోర్డుల ఎదుట తెలంగాణ ప్రాజెక్టులకు ఏపీ అడ్డుపడుతుండడంతో నిర్మాణాల్లో కొంత ఆలస్యం జరుగుతోందని, నిర్మాణాలపై తెలంగాణకు ఉన్న హక్కులను కూడా ట్రైబ్యునల్ ఎదుట జరిగే వాదనల్లో వినిపిస్తామని వివరించారు. తెలంగాణ ప్రాంతంలో ఇప్పటి వరకు ప్రాజెక్టులు పూర్తి చేయలేదని, దాంతో, కృష్ణా నీటిని సంపూర్ణంగా వినియోగించుకోలేకపోయిందని, దీనికి ప్రధాన కారణం బీఆర్‌ఎస్ పాలకులేనని ఆక్షేపించారు. గత పాలకుల ఉదాసీనత వల్లే ఏపీ ప్రభుత్వం అక్రమంగా నీటిని తరలించుకునిపోయి.. ప్రయోజనం పొందిందని ఆరోపించారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారం చేపట్టిన మరుక్షణం నుంచే న్యాయంగా తెలంగాణకు రావాల్సిన నీటి వాటాపై గట్టిపట్టు పడుతున్నామన్నారు.