Share News

Uttam Kumar Reddy: కృష్ణా జలాల్లో 70 శాతం వాటా ఇవ్వాల్సిందే!

ABN , Publish Date - Sep 24 , 2025 | 04:03 AM

కృష్ణా జలాల్లో తెలంగాణకు 70 శాతం వాటా దక్కాల్సిందేనని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కృష్ణా-గోదావరి జలాల్లో హక్కులపై...

Uttam Kumar Reddy: కృష్ణా జలాల్లో 70 శాతం వాటా ఇవ్వాల్సిందే!

  • నదీ జలాల్లో తెలంగాణ హక్కుల కోసం రాజీలేని పోరాటం చేస్తాం

  • పక్క రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా.. చుక్క నీటిని వదులుకోం

  • ఆల్మట్టి ఎత్తు పెంపు సరికాదు.. సుప్రీంలో గట్టి వాదనలు వినిపిస్తాం

  • మీడియాతో మంత్రి ఉత్తమ్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 23 (ఆంధ్రజ్యోతి): కృష్ణా జలాల్లో తెలంగాణకు 70 శాతం వాటా దక్కాల్సిందేనని రాష్ట్ర నీటి పారుదలశాఖ మంత్రి ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తెలిపారు. కృష్ణా-గోదావరి జలాల్లో హక్కులపై పోరాటంలో రాజీ పడే ప్రసక్తే లేదని తేల్చిచెప్పారు. మంగళవారం ఢిల్లీలో కృష్ణా ట్రైబ్యునల్‌ విచారణలో భాగంగా తెలంగాణ తరఫున వాదనలు వినిపించారు. అనంతరం ఉత్తమ్‌ మీడియాతో మాట్లాడారు. విచారణ తుది దశకు చేరుకుందని, ఫిబ్రవరి నుంచి తెలంగాణ వాదనలు వినిపిస్తోందని చెప్పారు. సెక్షన్‌-3 రిఫరెన్స్‌ కింద విచారణ జరుగుతోందని, తెలంగాణ తరఫున సీనియర్‌ న్యాయవాది ఎస్‌.వైద్యనాథన్‌ వాదనలు వినిపిస్తున్నారని తెలిపారు. వరసగా మంగళ, బుధ, గురువారాల్లో వాదనలు వినిపిచేందుకు ట్రైబ్యునల్‌ అవకాశం కల్పించిందని చెప్పారు. కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు న్యాయమైన వాటా రావాలని కృష్ణా జలాల వివాదాల ట్రైబ్యునల్‌-2 (కేడబ్ల్యూడీటీ-2) ముందు తెలంగాణ బలమైన వాదనలు వినిపిస్తోందన్నారు. మొత్తం 1050 టీఎంసీల్లో దాదాపు 70 శాతం అంటే 763 టీఎంసీలను తెలంగాణకు కేటాయించాలని చెప్పారు. కృష్ణా ట్రైబ్యునల్‌ ముందు స్వయంగా నీటి పారుదల శాఖ మంత్రి హాజరుకావడం దేశంలో ఇదే మొదటిసారన్నారు. తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరిదిద్దేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తోందని ఉత్తమ్‌ తెలిపారు. సగటు ప్రవాహాలపై మిగిలిన మొత్తం నీటిని వినియోగించుకునే హక్కు తెలంగాణకే ఉందన్నారు. ఇది కేవలం డిమాండ్‌ మాత్రమే కాదని, దశాబ్దాలుగా తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని సరి చేసే చర్య అని చెప్పారు. కేడబ్ల్యూడీటీ-2 అప్పట్లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు 1005 టీఎంసీలు కేటాయించిందని గుర్తుచేశారు. సగటు ప్రవాహాల కంటే ఎక్కువగా వచ్చే నీటిని కూడా వినియోగించుకునే స్వేచ్ఛను ఇచ్చారన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కొత్తగా బేసిన్‌ పారామీటర్ల ఆధారంగా వాటాను కోరుతున్నామని తెలిపారు. క్యాచ్‌మెంట్‌ ఏరియా, జనాభా, కరవు ప్రాంత విస్తీర్ణం, సాగు భూములు వంటి అంశాల ఆధారంగా లెక్కలు వేశామని.. మొత్తం 763 టీఎంసీలు రావాల్సి ఉందని చెప్పారు. అలాగే, ఆంధ్రప్రదేశ్‌ తనకు కేటాయించిన 811 టీఎంసీల్లో పెద్ద మొత్తాన్ని బేసిన్‌ వెలుపలికి మళ్లించిందని ఆరోపించారు.


బీఆర్‌ఎస్‌ తీరుతో పదేళ్లుగా తీరని నష్టం..

గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం కేవలం 299 టీఎంసీలను తెలంగాణకు కేటాయించి, 512 టీఎంసీలను ఆంధ్రప్రదేశ్‌కు ఇచ్చిన ఒప్పందానికి అంగీకరించడం ద్వారా రైతులు, కరవు ప్రాంత ప్రజలను మోసగించిందని ఉత్తమ్‌ మండిపడ్డారు. దాదాపుగా పదేళ్లు ఆ ఒప్పందానికి బీఆర్‌ఎస్‌ అంగీకరించిందని తెలిపారు. అందుకే, ఇప్పుడు ఆ ఫైలును మళ్లీ తెరిచి మొదటి నుంచి వాదనలు వినిపిస్తున్నామని స్పష్టం చేశారు.

పొరుగు రాష్ట్రాల్లో ఎవరున్నా రాజీ పడేది లేదు

పొరుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ అధికారంలో ఉన్నా రాజీ పడే ప్రసక్తే లేదని ఉత్తమ్‌ స్పష్టం చేశారు. తెలంగాణ ప్రయోజనాలే తమకు ముఖ్యమన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్‌ ఉన్నా, ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ఉన్నా, మహారాష్ట్రలో బీజేపీ ఉన్నా, తెలంగాణ తన హక్కుల కోసం పోరాడుతుందని తేల్చి చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లోనూ చుక్క నీటిని కూడా వదులుకునే ప్రసక్తే లేదన్నారు. ఆల్మట్టి ఆనకట్ట ఎత్తు పెంచే కర్ణాటక యోచనను తీవ్రంగా వ్యతిరేకించారు. అలాంటి నిర్ణయం తెలంగాణకు నేరుగా నష్టం చేస్తుందన్నారు. దీన్ని అడ్డుకోవడానికి సుప్రీంకోర్టులో బలమైన వాదనలు వినిపిస్తామని తెలిపారు. ఈ అంశాన్ని సీఎం రేవంత్‌రెడ్డి స్వయంగా సమీక్షించారని, పూర్తి స్థాయి వాదనలు వినిపించాలని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారని చెప్పారు. బ్రిజేష్‌ కుమార్‌ నేతృత్వంలోని విచారణలో తెలంగాణకు న్యాయం జరుగుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు.

Updated Date - Sep 24 , 2025 | 04:03 AM