Cyber Security Bureau: సైబర్ నేరాలపై సమరం
ABN , Publish Date - Nov 10 , 2025 | 03:05 AM
సైబర్ నేరగాళ్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎ్‌సబీ) ఉక్కుపాదం మోపుతోంది. సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు దేశంలోనే తొలిసారిగా...
5 రాష్ట్రాల్లో తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆపరేషన్
25 రోజుల్లో 81 మంది సైబర్ నేరగాళ్ల అరెస్ట్
రూ.95 కోట్ల మోసపూరిత ఆర్థిక లావాదేవీల గుర్తింపు
నేరస్థుల్లో బ్యాంకు ఉద్యోగులు, విద్యావంతులు
నేర ముఠాల మౌలిక వసతులను ధ్వంసం చేయడమే లక్ష్యం
సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి: టీజీసీఎ్‌సబీ
హైదరాబాద్, నవంబరు 9 (ఆంధ్రజ్యోతి): సైబర్ నేరగాళ్లపై తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో (టీజీసీఎ్‌సబీ) ఉక్కుపాదం మోపుతోంది. సైబర్ నేరగాళ్లను పట్టుకునేందుకు దేశంలోనే తొలిసారిగా పలు రాష్ట్రాల్లో ఏకకాలంలో భారీ ఆపరేషన్ నిర్వహించింది. అక్టోబరులో 25 రోజులపాటు నిర్వహించిన ఈ సమన్వయదాడిలో మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్‌లో కలిపి మొత్తం 81 మందిని అరెస్ట్ చేసినట్లు టీజీసీఎ్‌సబీ తెలిపింది. కేరళలో 28 మంది, మహారాష్ట్రలో 23 మంది, ఆంధ్రప్రదేశ్‌లో 10 మంది, తమిళనాడులో ఏడుగురు, కర్ణాటకలో 13 మందిని అరెస్ట్ చేసినట్లు వెల్లడించింది. వారిలో పురుషులు 74, మహిళలు ఏడుగురు ఉన్నారు. వీరిలో బ్యాంకింగ్, కార్పొరేట్ రంగాల ఉద్యోగులు, విద్యావంతులు కూడా ఉండటం గమనార్హం. ఈ దాడుల్లో భాగంగా అధికారులు సుమారు రూ.95 కోట్ల మోసపూరిత ఆర్థిక లావాదేవీలను గుర్తించారు. అరెస్టయిన వారిలో 17 మంది ఏజెంట్లు, 11 మంది నేరుగా ఆర్థిఽక లావాదేవీల్లో పాల్గొన్నవారు (రూ.34.70 లక్షలు), 53 మంది ‘మ్యూల్ అకౌంట్’ హోల్డర్లు ఉన్నారు. వీరి వద్ద నుంచి 84 మొబైల్ ఫోన్లు, 101 సిమ్ కార్డులు, 89 బ్యాంకు పాస్ బుక్‌లు, చెక్‌బుక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు టీజీసీఎ్‌సబీ అధికారులు వెల్లడించారు.
బ్యాంకు ఉద్యోగుల కక్కుర్తి
కమీషన్లకు కక్కుర్తి పడి బ్యాంకుల వంటి ఆర్థిక కార్యకలాపాల్లో పనిచేసే పై స్థాయి ఉద్యోగులు సైతం ఈ నేరగాళ్లకు సహకరించడం విస్మయం కలిగిస్తోంది. అరెస్టయిన నిందితుల్లో ఐడీఎ్‌ఫసీ బ్యాంకు సేల్స్ ఎగ్జిక్యూటివ్ (106 కేసులతో లింక్), ఫెడరల్ బ్యాంకుఉద్యోగి, బంధన్ బ్యాంకుబ్రాంచ్ మేనేజర్, కంప్యూటర్ ఆపరేషన్స్ డిప్లొమా హోల్డర్ (96 కేసులు), చెన్నై కిల్‌పోక్ ఆడిట్ ఆఫీసులో అకౌంటెంట్ (31 కేసులు), బీబీఏ గ్రాడ్యుయేట్ (45 కేసులు), ఒక మల్టీనేషనల్ కంపెనీ ఉద్యోగి ఉన్నారు. కొంతమందికి విదేశాల్లోని నేర నెట్‌వర్క్‌లతో కూడా సంబంధముందని తేలింది. వారిని ఇక్కడికి తీసుకొచ్చేందుకు లుక్ ఔట్ సర్క్యులర్ జారీచేసే ప్రక్రియను ప్రారంభించింది. ఈ ఆపరేషన్‌లో అరెస్టయినవారు టీజీసీఎ్‌సబీకి చెందిన 7 సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో నమోదైన 41 కేసులతో సంబంధం ఉన్నవారని అధికారులు తెలిపారు. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 754 క్రైమ్ లింకులను గుర్తించగా, అందులో తెలంగాణలోనే 128 లింకులు బయటపడ్డాయి. ఈ ఆపరేషన్ ద్వారా సైబర్ నేరగాళ్లకు మద్దతిచ్చే సరఫరా గొలుసును పూర్తిగా విచ్ఛిన్నం చేయటమే లక్ష్యమని టీజీసీఎ్‌సబీ అధికారులు తెలిపారు. భారీ ఆపరేషన్‌ను విజయవంతం చేసిన అధికారులను టీజీసీఎ్‌సబీ డైరెక్టర్ శిఖా గోయల్ అభినందించారు. సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ప్రజలకు టీజీసీఎ్‌సబీ సూచించింది. ముఖ్యంగా ఆన్‌లైన్ ఇన్వె్‌స్టమెంట్, ట్రేడింగ్ ఉచ్చుల్లో పడొద్దని కోరింది. అధిక రాబడి ఇస్తామని చెప్పే ఆన్‌లైన్ స్టాక్, ఫారెక్స్, క్రిప్టో ట్రేడింగ్ యాప్స్, టాస్క్ బేస్డ్ ఇన్‌కమ్ ఆఫర్లను నమ్మవద్దని సూచించింది. అధికారికంగా ధృవీకరించిన వెబ్‌సైట్లు /యాప్‌లను మాత్రమే ఆర్థిక లావాదేవీలకు ఉపయోగించాలని, సైబర్ నేరం జరిగితే వెంటనే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్ చేసి లేదా అధికారిక వెబ్‌సైట్‌లో ఫిర్యాదు చేయాలని సూచించింది.