Share News

Congress MPs: తెలంగాణకు యూరియా ఇవ్వండి

ABN , Publish Date - Aug 19 , 2025 | 03:59 AM

తెలంగాణకు 3లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా ఇచ్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలు కోరారు. సోమవారం ఢిల్లీలో ...

Congress MPs: తెలంగాణకు యూరియా ఇవ్వండి

  • 3లక్షల టన్నులు విడుదల చేయండి

  • నడ్డాకు రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీల విజ్ఞప్తి

న్యూఢిల్లీ, ఆగస్టు 18 (ఆంధ్రజ్యోతి): తెలంగాణకు 3లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా ఇచ్చి రైతులను ఆదుకోవాలని కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ మంత్రి జేపీ నడ్డాను రాష్ట్ర కాంగ్రెస్‌ ఎంపీలు కోరారు. సోమవారం ఢిల్లీలో నడ్డాను ఎంపీలు రేణుకా చౌదరి, మల్లు రవి, చామల కిరణ్‌ కుమార్‌రెడ్డి, అనిల్‌కుమార్‌ యాదవ్‌, గడ్డం వంశీకృష్ణ కలిసి వినతిపత్రం అందజేశారు. అంతకుముందు పార్లమెంట్‌ సమావేశాలు ప్రారంభం కాగానే మకర్‌ ద్వారం వద్ద తెలంగాణ కాంగ్రెస్‌ ఎంపీలు ఆందోళన నిర్వహించారు. వాయిదా తీర్మానం, జీరో అవర్‌లో నోట్‌ ఇచ్చారు. తెలంగాణ భవన్‌లో మీడియా సమావేశం నిర్వహించి ఆ వివరాలు వెల్లడించారు. రాష్ట్రానికి వెంటనే 3లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా ఇవ్వాల్సిందిగా కేంద్ర మంత్రిని కోరామని, దశల వారీగానైనా అందించాల్సిందిగా విజ్ఞప్తి చేశామని తెలిపారు. అసదుద్దీన్‌ ఒవైసీ సహా ఇండియా కూటమిలోని 30 మంది ఇతర రాష్ట్రాల ఎంపీలు కూడా తెలంగాణకు మద్దతుగా యూరియా ఇవ్వాలని సంతకాలు చేశారని వెల్లడించారు. ఈ వానాకాలం సీజన్‌కు 9.80 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా అవసరమని, జూలై వరకు 6.60 లక్షల మెట్రిక్‌ టన్నుల యూరియా ఇవ్వాల్సి ఉందని, కానీ.. ఇప్పటివరకు కేంద్రం కేవలం 4.36 లక్షల మెట్రిక్‌ టన్నులు మాత్రమే ఇచ్చిందని వివరించారు. సకాలంలో యూరియా ఇవ్వాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతోపాటు తాము కూడా కేంద్ర మంత్రి నడ్డాకు వినతిపత్రాలు ఇచ్చామని, అయినా కేంద్రం స్పందించలేదని అన్నారు. తెలంగాణ ప్రజలు బీజేపీకి ఎనిమిది మంది ఎంపీలను ఇచ్చారని, రైతుల కోసం వారు కేంద్రాన్ని ఎందుకు ప్రశ్నించడం లేదని, ఇద్దరు కేంద్ర మంత్రులు ఏం చేస్తున్నారని నిలదీశారు. మం గళవారం మరోసారి నడ్డా సమయం ఇచ్చారని, తెలంగాణ బీజేపీ ఎంపీలు సైతం కలిసి రావాలని కోరారు. తాను ఎరువులు, రసాయనాల స్టాండింగ్‌ కమిటీలో సభ్యుడిగా ఉన్నానని, ప్రతిసారీ తెలంగాణకు యూరియా ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నా కేంద్రం పట్టించుకోవడం లేదని ఎంపీ బలరాం నాయక్‌ తెలిపారు.

Updated Date - Aug 19 , 2025 | 03:59 AM