Congress leader Mahesh Goud: 42శాతం రిజర్వేషన్లు..ధర్మబద్ధమైన కోరిక
ABN , Publish Date - Oct 15 , 2025 | 04:35 AM
తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అనేది ధర్మబద్ధమైన కోరిక అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఈ విషయంలో...
బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక ఎన్నికలకెళ్తాం
మీడియాతో టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
న్యూఢిల్లీ, అక్టోబరు 14 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో బీసీలకు 42శాతం రిజర్వేషన్లు అనేది ధర్మబద్ధమైన కోరిక అని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్ అన్నారు. ఈ విషయంలో సుప్రీంకోర్టులో తప్పక న్యాయం జరుగుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. బీసీల రిజర్వేషన్లపై రాజీపడేప్రసక్తే లేదన్నారు. 42% బీసీ రిజర్వేషన్లతోనే స్థానిక సంస్థల ఎన్నికలకు వెళతామని తేల్చిచెప్పారు. మంగళవారం ఆయన సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీని సుప్రీంకోర్టుకు వెళ్లి కలిశారు. ఆయనతో సుమారు గంటకుపైగా భేటీ అయ్యారు. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించే జీవో 9పై ప్రభుత్వం తరఫున బలంగా వాదనలు వినిపించాలని సింఘ్వీని కోరారు. అనంతరం మహేశ్‌గౌడ్ మీడియాతో మాట్లాడారు. బీసీ రిజర్వేషన్లకు రాజకీయాలతో సంబంధం లేదని, ఇది యావత్ తెలంగాణలోని బీసీల సమస్య అని తెలిపారు. బీసీల బతుకుల్లో వెలుగులు నింపాలనే చిత్తశుద్ధితో కాంగ్రెస్ పనిచేస్తోందని, అడ్డుకునే ప్రయత్నంలో బీజేపీ, బీఆర్‌ఎస్ ఉన్నాయని మండిపడ్డారు. అసెంబ్లీలో బీసీ బిల్లుకు మద్దతిచ్చిన పార్టీలు కేంద్రంలో, న్యాయస్థానాల్లో ఎందుకు సహకరించడం లేదని ప్రశ్నించారు. బీసీలకు 42% రిజర్వేషన్లను అడ్డుకోవడమే బీజేపీ, బీఆర్‌ఎస్ ఉమ్మడి అజెండా అని ఆరోపించారు. ఎవరెన్ని కుట్రలు చేసినా వెనక్కి తగ్గే ప్రసక్తే లేదన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి నేతృత్వంలో బీసీ రిజర్వేషన్లు అమలు చేసి తీరతామని చెప్పారు. పాత రిజర్వేషన్ల ప్రకారమే స్థానిక ఎన్నికలకు వెళ్లాలని హైకోర్టు చెప్పడం ఎంతో బాధ కలిగించిందన్నారు. తమ వాదనలను పరిగణనలోకి తీసుకోకుండానే హైకోర్టు స్టే విధించిందని తెలిపారు. హైకోర్టు తీర్పు ను సవాలు చేస్తూ వేసిన పిటిషన్ సుప్రీంకోర్టులో గురువారం విచారణకు వచ్చే అవకాశం ఉందన్నారు.