Mega Job Fair: కాంగ్రెస్ పాలనలో ఉద్యోగ అవకాశాలు
ABN , Publish Date - Oct 26 , 2025 | 04:19 AM
ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఉద్యమాలు చేశామని, ఇప్పుడు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి...
హుజూర్‌నగర్, అక్టోబరు 25 (ఆంధ్రజ్యోతి): ఉద్యోగాలు రావాలంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడాలని ఉద్యమాలు చేశామని, ఇప్పుడు నిరుద్యోగ సమస్య పరిష్కారానికి కాంగ్రెస్ ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి పాటుపడుతున్నామని చెప్పారు. శనివారం సూర్యాపేట జిల్లా హుజూర్‌నగర్‌లో తెలంగాణ పరిశ్రమలు, డీట్, సింగరేణి కాలరీస్ సంస్థ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన మెగా జాబ్‌మేళాను ఆయన ప్రారంభించి మాట్లాడారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన 20 నెలల్లో 75వేల ఉద్యోగాలు కల్పించామన్నారు. నిరుద్యోగులకు ప్రభుత్వ, ప్రైవేట్ రంగాల్లో ఉపాధి కల్పించేందుకు రాష్ట్రంతోపాటు దేశంలో పేరొందిన 275 కంపెనీలను జాబ్ మేళాకు ఆహ్వానించామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో చదువుకున్న యువతకు ఉద్యోగ అవకాశాలు తక్కువగా ఉన్నాయని గుర్తించి మెగా జాబ్‌మేళా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. ఆదివారం కూడా జాబ్ మేళా కొనసాగుతుందన్నారు. గ్రామీణ యువతకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్రంలోని ప్రముఖ కంపెనీలు ముందుకు రావడం అభినందనీయమన్నారు.