Share News

Tax Revenue: అక్టోబరులో పన్నుల రాబడి రూ.16,372 కోట్లు

ABN , Publish Date - Nov 21 , 2025 | 05:06 AM

రాష్ట్ర ఖజానాకు అక్టోబరులో భారీగా పన్నుల ఆదాయం సమకూరింది. ఈ నెలలో అన్ని రకాల పన్నుల కింద రూ.16,372.44 కోట్ల రాబడి వచ్చింది...

Tax Revenue: అక్టోబరులో పన్నుల రాబడి రూ.16,372 కోట్లు

  • ఎక్సైజ్‌ ఆదాయమే రూ.3,675 కోట్లు

  • కాగ్‌ అక్టోబరు నివేదికలో వెల్లడి

హైదరాబాద్‌, నవంబరు 20 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ఖజానాకు అక్టోబరులో భారీగా పన్నుల ఆదాయం సమకూరింది. ఈ నెలలో అన్ని రకాల పన్నుల కింద రూ.16,372.44 కోట్ల రాబడి వచ్చింది. ప్రధానంగా ఎక్సైజ్‌ పన్నులే ఖజానాకు ఊతమిచ్చాయి. సాధారణంగా ప్రతి నెలా పన్నుల కింద రూ.13,000-14,000 కోట్ల రాబడి సమకూరుతుంది. అక్టోబరులో మాత్రం రూ.16వేల కోట్ల మార్కు దాటడం గమనార్హం. అక్టోబరులో ప్రభుత్వం కొత్త మద్యం పాలసీ కింద వైన్‌ షాపులను కేటాయించడంతో భారీ మొత్తంలో రాబడి సమకూరింది. అక్టోబరులో ఎక్సైజ్‌ సుంకాల ద్వారానే రూ.3,675 కోట్లు వచ్చాయి. కంపో్ట్రలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) గురువారం విడుదల చేసిన రాష్ట్ర ఆదాయ, వ్యయాల అక్టోబరు నివేదికలో ఈమేరకు వివరాలు వెల్లడయ్యాయి. రాష్ట్ర ఎక్సైజ్‌ సుంకాల కింద ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.27,623.36 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా.. ఇందులో అక్టోబరు నాటికి రూ.13,296.75 కోట్లు (48.14ు) వచ్చాయి. ప్రతి నెలా దాదాపు రూ.2,000 కోట్ల పైచిలుకు ఎక్సైజ్‌ రాబడి సమకూరుతుంది. జీఎ్‌సటీ, స్టాంపులు-రిజిస్ట్రేషన్లు, అమ్మకం పన్ను, ఎక్సైజ్‌ సుంకాలు, ఇతర పన్నులు, సుంకాలు, కేంద్ర పన్నుల్లో వాటా వంటి అన్ని రకాల పన్ను రాబడి కింద అక్టోబరులో రూ.16,372.44 కోట్లు వచ్చాయి. ఈ పన్నుల కింద సెప్టెంబరు నాటికి రూ.71,836.66 కోట్లు రాగా అక్టోబరుకల్లా రూ.88,209.10 కోట్లకు పెరిగాయి. ఈ ఆర్థిక సంవత్సరం పన్నుల కింద మొత్తం రూ.1,75,319.35 కోట్లు వస్తాయని ప్రభుత్వం అంచనా వేయగా.. అక్టోబరునాటికి (ఏడు నెలల్లో) రూ.88,209.10 కోట్లు (50.31ు) వచ్చాయి. ఎక్సైజ్‌ రాబడి ఇందుకు ప్రధానంగా దోహదపడింది. మార్కెట్‌ నుంచి రూ.54,009.74 కోట్ల అప్పులు తీసుకోనున్నట్టు ప్రభుత్వం ప్రకటించగా... రూ.50,541.22 కోట్ల (93.58ు) రుణాలను సేకరించింది.


  • ఈసారి రెవెన్యూ, మూలధన రాబడులన్నింటి కింద రూ.2,84,837.29 కోట్లు సమకూరుతాయని బడ్జెట్‌లో ప్రకటించగా... ఏడు నెలల్లో రూ.1,45,124.52 కోట్లు సమకూరాయి.

  • అక్టోబరు నాటికి మొత్తంగా ప్రభుత్వం రూ.1,33,920.93 కోట్లు ఖర్చు చేసింది. అంచనా వ్యయం రూ.2,63,486కోట్లలో ఇది 50.83 శాతం. ఇందులో పథకాలకు రూ.40,175.66 కోట్లు, వడ్డీ చెల్లింపులకు రూ.16,529.88 కోట్లు, ఉద్యోగుల జీతాలకు రూ.27,663కోట్ల్లు వ్యయం చేసింది.

అక్టోబరు నాటికి వచ్చిన రాబడి..

  • జీఎ్‌సటీ కింద రూ.30,569.02 కోట్లు

  • స్టాంపులు-రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.8,606.43 కోట్లు

  • సేల్స్‌ టాక్స్‌ ద్వారా రూ.19,057.06 కోట్లు

  • కేంద్రపన్నుల్లో వాటా కింద రూ.11,954.94 కోట్లు

  • పన్నులు, సుంకాల కింద రూ.4,724.46 కోట్లు

  • పన్నేతర రాబడి కింద రూ.3,401.40 కోట్లు

Updated Date - Nov 21 , 2025 | 05:06 AM