Party Discussion: 2 గంటల్లోనే అన్నింటిపై..!
ABN , Publish Date - Dec 14 , 2025 | 06:46 AM
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు.
మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణ, నామినేటెడ్ పదవులపై చర్చ
రైజింగ్ తెలంగాణ సక్సెస్, పంచాయతీల్లో పైచేయిపై కూడా
రాహుల్ గాంధీతో ఢిల్లీ ప్రయాణంలో సీఎం, పీసీసీ చీఫ్ చర్చ
హైదరాబాద్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ప్రభుత్వ వ్యవహారాలపై ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీతో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ చర్చించారు. ఆదివారం ఢిల్లీలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఓట్ చోరీపై నిర్వహించనున్న బహిరంగసభలో పాల్గొనేందుకు సీఎం, పీసీసీ అధ్యక్షుడు శనివారం రాత్రి రాహుల్ గాంధీతో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. రెండు గంటల ప్రయాణ సమయంలో రాష్ట్రానికి సంబంధించిన కీలక విషయాలపై చర్చించినట్టు తెలిసింది. మంత్రివర్గ పునర్వ్యవవస్థీకరణ, నామినేటెడ్ పదవులపై ప్రధానంగా చర్చ జరిగినట్టు సమాచారం. ఇటీవలే రాష్ట్ర ప్రభుత్వం విజయవంతంగా నిర్వహించిన తెలంగాణ రైజింగ్ సమ్మిట్ గురించి రాహుల్‌కు సీఎం వివరించారు. రెండు రోజుల సదస్సులో రూ.5.75 లక్షల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగాయని, అనుకున్నదానికంటే ఎక్కువగా సదస్సు విజయవంతం అయిందని తెలిపారు. మొదటి విడత పంచాయతీ ఎన్నికల్లో పార్టీ అనుకూల అభ్యర్థులు 60శాతానికి పైగా స్థానాలను సాధించారన్నారు. తెలంగాణ రైజింగ్ సదస్సు, పంచాయతీ ఎన్నికల్లో విజయంపై రాహుల్ ప్రశంసించారు.