Share News

Panchayat Elections: 60 శాతం సీట్లు బీసీలకే ఇద్దాం !

ABN , Publish Date - Nov 26 , 2025 | 04:47 AM

పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వెయ్యాలని, 60ు దాకా సీట్లను బీసీలకే కేటాయించాలనే సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించినట్టు తెలిసింది....

Panchayat Elections: 60 శాతం సీట్లు బీసీలకే ఇద్దాం !

  • పంచాయతీ ఎన్నికల్లో జనరల్‌ స్థానాల్లో ఆ వర్గాలకే ప్రాధాన్యం

  • హైకోర్టు తీర్పు వచ్చాకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు

  • రామగుండం, పాల్వంచ థర్మల్‌ ప్రాజెక్టులు ఎన్టీపీసీకి

  • మంత్రివర్గ సమావేశంలో చర్చ

హైదరాబాద్‌, నవంబరు 25(ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల్లో వెనుకబడిన వర్గాలకు పెద్దపీట వెయ్యాలని, 60ు దాకా సీట్లను బీసీలకే కేటాయించాలనే సీఎం రేవంత్‌ రెడ్డి నిర్ణయించినట్టు తెలిసింది. పంచాయతీ ఎన్నికలు పార్టీరహితంగా జరిగేవే అయినప్పటికీ.. ఎన్నికల్లో పోటీ చేయనున్న బీసీ వర్గాలకు చెందిన కాంగ్రెస్‌ కార్యకర్తలు, మద్దతుదారులకు ప్రాధాన్యం ఇవ్వాలని సహచర మంత్రులకు ఆయన సూచించినట్టు సమాచారం. ఈ మేరకు సచివాలయంలో మంగళవారం నిర్వహించిన మంత్రివర్గ భేటీలో బీసీ రిజర్వేషన్ల అంశంపై చర్చ జరిగినట్టు తెలిసింది. బీసీలకు 42ు రిజర్వేషన్లు అధికారికంగా ఇవ్వాలని అనుకున్నప్పటికీ ఆ విషయం న్యాయపరిధిలోనే ఉండిపోయిందని మంత్రులు పేర్కొన్నారు. అందువల్ల పార్టీ పరంగా బీసీలకు అత్యధిక స్థానాలు ఇవ్వాలని ఈ సమావేశంలో నిర్ణయించినట్టు తెలిసింది. ఎన్నికలకు మరికొన్ని రోజుల వ్యవధి ఉంటే బాగుండేదని ఒకరిద్దరు మంత్రులు ఈ సందర్భంగా అభిప్రాయపడినట్టు సమాచారం. అయితే, న్యాయపరమైన చిక్కులు, కేంద్రం నుంచి నిధుల కోత వంటి సమస్యల వల్ల ఎన్నికలు ఇప్పుడే నిర్వహించడం సరైనదని ఇతర మంత్రులు వారికి వివరించినట్టు తెలిసింది. మండల పరిషత్‌ ప్రాదేశిక సభ్యులు (ఎంపీటీసీ), జిల్లాపరిషత్‌ ప్రాదేశిక సభ్యుల (జడ్పీటీసీ) ఎన్నికలను మాత్రం హైకోర్టు తీర్పు వచ్చిన తర్వా తే నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు సమాచారం. ఇక, రామగుండం, పాల్వంచలోని జెన్‌కోకు చెందిన మూతబడిన ప్లాంట్‌ పునరుద్ధరణ బాధ్యతలను జెన్‌కో, ఎన్టీపీసీల్లో ఎవరికి అప్పగించాలన్న అంశంపైనా మంత్రివర్గంలో చర్చ జరిగినట్టు తెలిసింది. తక్కువ ఖర్చుతో ప్లాంట్‌ నిర్మించి, తక్కువ ధరకు విద్యుత్తు సరఫరా చేసే సంస్థకు బాధ్యతలు అప్పగించాలని సమావేశంలో నిర్ణయించారు. అయి తే, కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఎన్టీపీసీకి ప్రాధా న్యం ఇవ్వాలన్న అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. రామగుండంతోపాటు పాల్వంచలోని థర్మల్‌ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎన్టీపీసీకి ఇవ్వాలని మంత్రి తుమ్మల కోరారు. ఈ అంశాన్ని కూడా మంత్రివర్గం పరిగణనలోకి తీసుకున్నట్టు తెలిసింది.

Updated Date - Nov 26 , 2025 | 04:47 AM