Share News

TG CM Revanth Reddy: పెట్టుబడుల కోసం ఢిల్లీకి

ABN , Publish Date - Sep 19 , 2025 | 06:06 AM

రాష్ట్రానికి పెట్టుబడుల కోసం పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో భేటీకానున్నారు. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు.

TG CM Revanth Reddy: పెట్టుబడుల కోసం ఢిల్లీకి

  • నేడు పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరం వార్షిక సదస్సులో పాల్గొననున్న ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి

  • కార్ల్స్‌బర్గ్‌, అమెజాన్‌, కార్లైల్‌, గోద్రెజ్‌, ఉబర్‌ ప్రతినిధులతో సమావేశాలు

  • న్యూజెర్సీ గవర్నర్‌ మర్ఫీ, డబ్ల్యూఈఎఫ్‌ అధ్యక్షుడు బ్రెండేతో సీఎం భేటీ

  • రాష్ట్రంలో భారీ పెట్టుబడులకు సిద్ధమవుతున్న కార్ల్స్‌బర్గ్‌

హైదరాబాద్‌, సెప్టెంబరు 18 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రానికి పెట్టుబడుల కోసం పలు ప్రముఖ సంస్థల ప్రతినిధులతో సీఎం రేవంత్‌రెడ్డి శుక్రవారం ఢిల్లీలో భేటీకానున్నారు. ఈ మేరకు ఆయన గురువారం సాయంత్రం ఢిల్లీకి వెళ్లారు. శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం దాకా బిజీబిజీగా గడపనున్నారు. వివిధ జాతీయ, అంతర్జాతీయ కంపెనీలు, మీడియా, న్యాయ, ఇతర రంగాల సంస్థలు సభ్యులుగా ఉన్న ‘పబ్లిక్‌ అఫైర్స్‌ ఫోరమ్‌ ఆఫ్‌ ఇండియా’ 12వ వార్షిక సదస్సులో సీఎం రేవంత్‌ పాల్గొని ప్రసంగిస్తారు. కార్ల్స్‌బర్గ్‌, అమెజాన్‌, కార్లైల్‌, గోద్రెజ్‌, ఉబర్‌ తదితర సంస్థల ప్రతినిధులతో విడివిడిగా భేటీ అయి.. రాష్ట్రంలో పెట్టుబడులు, ప్లాంట్ల విస్తరణపై చర్చిస్తారు. సదస్సుకు ముందు తాజ్‌ప్యాలెస్‌ హోటల్‌లో అమెరికాలోని న్యూజెర్సీ గవర్నర్‌ ఫిలిప్‌ డి.మర్ఫీతో, తర్వాత ప్రపంచ ఆర్థిక సంస్థ (డబ్ల్యూఈఎఫ్‌) అధ్యక్షుడు బోర్జ్‌ బ్రెండేతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈ ఏడాది జనవరిలో స్విట్జర్లాండ్‌లోని దవో్‌సలో జరిగిన డబ్ల్యూఈఎఫ్‌ సదస్సులో పాల్గొన్న సీఎం రేవంత్‌.. తెలంగాణకు భారీగా పెట్టుబడులు వచ్చేలా చూడాలని బోర్జ్‌ బ్రెండేను కోరారు. తాజాగా మళ్లీ ఆయనతో సీఎం భేటీకానుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్‌ ఖట్టర్‌ను సీఎం రేవంత్‌ కలవనున్నారు. రాష్ట్రంలో పట్టణాభివృద్ధి ప్రాజెక్టులకు కేంద్ర నిధులు, సహాయం కోరనున్నారు. కాగా, డెన్మార్క్‌కు చెందిన ప్రముఖ అంతర్జాతీయ మద్యం తయారీ సంస్థ కార్ల్స్‌బర్గ్‌ రాష్ట్రంలో పెట్టుబడులకు సిద్ధమైంది. సీఎంతో ఆ సంస్థ ప్రతినిధుల భేటీ అనంతరం దీనిపై ప్రకటన చేసే అవకాశం ఉంది.

Updated Date - Sep 19 , 2025 | 06:08 AM