K Ramakrishna Rao: 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధ్యమేనని ప్రపంచమంతా చెప్పింది
ABN , Publish Date - Dec 10 , 2025 | 04:18 AM
రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ రైజింగ్ 2047 లో నిర్దేశించుకున్న 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన సాధ్యమేనని ప్రపంచమంతా చెప్పిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి.....
రాష్ట్ర యువతను అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి
ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు
హైదరాబాద్, డిసెంబరు 9(ఆంధ్రజ్యోతి): రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ రైజింగ్-2047’లో నిర్దేశించుకున్న 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థ సాధన సాధ్యమేనని ప్రపంచమంతా చెప్పిందని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కే రామకృష్ణారావు తెలిపారు. సీఎం, మంత్రుల సూచనల మేరకు తాము పెద్ద లక్ష్యాన్ని నిర్దేశించుకున్నామని చెప్పారు. రాష్ట్రంలో 2034 నాటికి ఒక ట్రిలియన్ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు. ఇది ఎలా సాధ్యమని చాలా మంది ప్రశ్నించారని, కానీ ఈ రోజు సదస్సు ద్వారా ప్రపంచమంతా అది సాధ్యమేనని చెప్పిందన్నారు. అందులో భాగంగానే సదస్సు మొదటి రోజు దాదాపు రూ.3 లక్షల కోట్లు, రెండో రోజు మంగళవారం రూ.2 లక్షల కోట్లకు పైగా పెట్టుబడులకు ఎంవోయూలు కుదిరాయని వివరించారు. నిజానికి చాలా తక్కువ సమయంలో ఇంత భారీ మొత్తంలో ఏ రాష్ట్రంలోనూ ఎంవోయూలు కుదరలేదని చెప్పారు. ఇది అంకెలు మాత్రమే కాదని, లక్షల ఉద్యోగాలు సృష్టిస్తాయన్నారు. రాష్ట్ర యువత అవకాశాల కోసం వేచి చూడాల్సిన అవసరం ఉండదని, అవకాశాలు వారిని వెతుక్కుంటూ వస్తాయని తెలిపారు. తెలంగాణ దేశంలోని ఏ రాష్ట్రం, ఏ నగరంతో పోటీ పడాలనుకోవడం లేదని, ప్రపంచంతో పోటీ పడాలనుకుంటోందని చెప్పారు. ఇన్నోవేటివ్ ఫ్యాక్టరీగా మారాలనుకుంటోందన్నారు.