Cable Removal: కేబుళ్ల తొలగింపుతో 100 కోట్ల నష్టం
ABN , Publish Date - Sep 14 , 2025 | 04:42 AM
విద్యుత్ స్తంభాలకున్న కేబుల్, ఇంటర్నెట్ ఆప్టికల్ కేబుళ్లను విద్యుత్ శాఖ తొలగిస్తుండటంతో హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది..
కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్ల అసోసియేషన్ వర్గాల వెల్లడి
ఇంటర్నెట్, టీవీ, ఫోన్ సిగ్నళ్లకు అంతరాయాలు
హైదరాబాద్/కవాడిగూడ/హైదరాబాద్ సిటీ : సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): విద్యుత్ స్తంభాలకున్న కేబుల్, ఇంటర్నెట్ ఆప్టికల్ కేబుళ్లను విద్యుత్ శాఖ తొలగిస్తుండటంతో హైదరాబాద్‌తోపాటు ఇతర ప్రాంతాల్లో కేబుల్ టీవీ, ఇంటర్నెట్ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. దీంతో వినియోగదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సమస్య పరిష్కారానికి ఎన్ని రోజులు పడుతుందనేదానిపై స్పష్టత రావడంలేదు. కేబుళ్ల తొలగింపుతో దాదాపు రూ.100 కోట్ల నష్టం వాటిల్లిందని తెలంగాణ కేబుల్, నెట్ ఆపరేటర్ల అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. అయితే ఇప్పటిదాకా కేబుళ్ల తొలగింపుతో ఇంటర్నెట్, కేబుల్ టీవీ ప్రసారాలకే ఇబ్బందులు రాగా.. తాజాగా రెండు రోజుల నుంచి ఫోన్ సిగ్నళ్ల సమస్య మొదలైంది. కేబుల్ వైర్ల తొలగింపుతో వినియోగదారులతోపాటు ఆస్పత్రులు, రెవెన్యూ కార్యాలయాలు, ఇతర ప్రభుత్వ ఆఫీసుల్లోనూ ఇంటర్నెట్ సేవలకు అంతరాయం కలుగుతోంది. రాష్ట్ర సచివాలయంలోనూ ఈ సేవలకు తీవ్ర అంతరాయం ఏర్పడటంతో పలు సెక్షన్లలో పనులు నిలిచిపోయాయని ఉద్యోగులు చెబుతున్నారు.
సర్వీస్ ప్రొవైడర్ల గగ్గోలు..
రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్‌నెట్ సర్వీస్ ప్రొవైడర్లు (ఐఎ్‌సపీ) 30 మంది ఉండగా.. కేబుల్ టీవీ ప్రసారాలకు సంబంధించి ఎంఎ్‌సవోలతోపాటు వీరి కింద లోకల్ కేబుల్ ఆపరేటర్లు (ఎల్‌సీవో) ఉంటారు. ప్రస్తుతానికి హైదరాబాద్ పరిధిలో దాదాపు 30-40 లక్షల కేబుల్, ఇంటర్నెట్ కనెక్షన్లు ఉన్నట్టు తెలుస్తోంది. ఒక్కసారిగా ఆప్టికల్ వైర్లను తొలగిస్తుండడంతో ఇంటర్నెట్ సేవలు అందక వినియోగదారులు తమపై ఒత్తిడి చేస్తున్నారని ప్రొవైడర్లు వాపోతున్నారు. ఉప్పల్-అల్వాల్-ఏఎ్‌సరావు నగర్ పరిధిలో ఉన్న ఓ సర్వీస్ ప్రొవైడర్‌కు దాదాపు 60-70 కిలోమీటర్ల మేర ఆప్టికల్ లైన్ ఉంది. ఇప్పుడు దాన్ని కట్ చేశారని, వాటి మరమ్మతులు, కొత్త వైర్ల కోసం దాదాపు రూ.20 లక్షల వరకు ఖర్చవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక కొన్ని టెలికాం టవర్లకు వెళ్లే వైర్లు కూడా కట్ కావడంతో ఫోన్లకు సిగ్నల్ సమస్య తలె త్తుతోంది. దీని పరిష్కారానికి కొన్ని రోజులు పడుతుందని సంబంధితవర్గాలు చెబుతున్నాయి. హైదరాబాద్‌లో ఒక్కసారిగా ఆప్టికల్ కేబుళ్లను తొలగిస్తుండడంతో సమస్య మరింత తీవ్రమవుతోందని కేబుల్ ఆపరేటర్ల అసోసియేషన్ ప్రతినిధి ఒకరు చెప్పారు. తొలగిస్తున్న కేబుళ్ల పునరుద్ధరణకు వర్షాలు ఆటంకంగా మారుతున్నాయన్నారు. కేబుళ్ల తొలగింపు విషయంపై చర్చలు జరుగుతున్నాయని, కానీ అవి కొలిక్కి రావడంలేదని అసోసియేషన్ చెబుతోంది.
ఇంటర్నెట్ సేవల్లో తీవ్ర అంతరాయం
హైదరాబాద్‌లో విద్యుత్ స్తంభాలపై కేబుళ్ల తొలగింపుతో ఇంటర్నెట్, కేబుల్ సేవల్లో తీవ్ర అంతరాయాలు నెలకొంటున్నాయి. గచ్చిబౌలి, కొండాపూర్, రాయదుర్గం, పుప్పాలగూడ, నానక్‌రాం గూడ, డీఎల్‌ఎఫ్, హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో రెండు రోజులుగా ఇష్టానుసారంగా కేబుళ్లు తొలగించడంతో ఇంటర్నెట్, కేబుళ్ల సేవలపై తీవ్ర ప్రభావంపడుతోంది. మూడు వారాలుగా గ్రేటర్‌వ్యాప్తంగా తరచూ ఈ సేవల్లో అంతరాయాలు నెలకొంటున్నాయని వినియోగదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇంటర్‌నెట్ సేవల్లో గంటల కొద్దీ అంతరాయాలతో వర్క్‌ఫ్రం హోం ఉద్యోగులు ఇబ్బందులు పడుతున్నారు. కేబుళ్ల తొలగింపుతో ఇంటర్‌నెట్ సేవలతో పాటు టీవీలు సరిగా రావడం లేదని, తరచూ సిగ్నల్ సమస్యలు తలెత్తుతున్నాయని వినియోగదారులు అంటున్నారు.
కేబుళ్ల తొలగింపును ఆపాలి కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్ల డిమాండ్
చీరాష్ట్రవ్యాప్తంగా ఉన్న సుమారు ఐదు లక్షల మంది కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన సమస్యలను వెంటనే పరిష్కరించాలని, లేనిపక్షంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని కేబుల్, ఇంటర్నెట్ ఆపరేటర్లు రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు, విద్యుత్ శాఖ అధికారుల చర్యల వల్ల కేబుల్ ఆపరేటర్లు రోడ్డున పడుతున్నారని, వెంటనే కేబుల్ వైర్ల కోతలను నిలిపివేయాలని డిమాండ్ చేశారు. శనివారం ఇందిరాపార్కు ధర్నా చౌక్ వద్ద ఫెడరేషన్ ఆఫ్ ఏరియల్ కేబుల్ ఆపరేటర్స్ (ఫాకో) రాష్ట్ర కమిటీ ఆఽధ్వర్యంలో కేబుల్ ఆపరేటర్ల న్యాయమైన సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మహాధర్నా చేపట్టారు. ఈ ధర్నాలో రాష్ట్రవ్యాప్తంగా ఉన్న కేబుల్ ఆపరేటర్లు పెద్ద సంఖ్యలో హాజరై నిరసన వ్యక్తం చేశారు. ఈ మహాధర్నాకు బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ కుమార్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ ఉపాధ్యక్షుడు భూర నర్సయ్యగౌడ్, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేముల అశోక్ హాజరై మద్దతు ప్రకటించారు. దాసోజు శ్రవణ్ మాట్లాడుతూ.. కార్పొరేట్ సంస్థల ప్రయోజనాలకు ప్రభుత్వం ప్రాధాన్యమిస్తూ కేబుల్ ఆపరేటర్ల ఉపాధిని దెబ్బతీస్తోందని ఆరోపించారు. ప్రభుత్వం వెంటనే ప్రత్యేక పాలసీ ప్రకటించి కేబుల్ ఆపరేటర్ల జీవనోపాధిని పరిరక్షించాలని డిమాండ్ చేశారు. బూర నర్సయ్యగౌడ్ మాట్లాడుతూ... ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్లతో చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేశారు. కేబుల్ ఆపరేటర్ల సంఘం అధ్యక్షుడు డి.సతీ్‌షబాబు, గౌరవ అధ్యక్షుడు వి.కరుణాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. కేబుళ్ల కోతలను వెంటనే నిలిపివేసి కేబుల్ వ్యవస్థ క్రమబద్ధీకరణకు ఆదేశాలు జారీ చేయాలన్నారు. కేబుల్ ఆపరేటర్లు ప్రభుత్వంతో చర్చలకు సిద్ధంగా ఉన్నారన్నారు. ప్రభుత్వం కేబుల్ ఆపరేటర్ల ఉపాధికి నష్టం జరగకుండా ప్రత్యామ్నాయ మార్గాన్ని చూపి ఆదుకోవాలని వారు కోరారు. లేనిపక్షంలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కేబుల్ ఆపరేటర్లు తగిన బుద్ధి చెబుతారని హెచ్చరించారు.