Share News

Power Sector Reforms: విద్యుత్తుపై ఫోకస్‌

ABN , Publish Date - Nov 20 , 2025 | 06:01 AM

విద్యుత్తు రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ మేరకు కొత్తగా తీసుకురానున్న సంస్కరణల మీద చర్చించేందుకు ఈనెల 24న ప్రత్యేకంగా క్యాబినెట్‌ భేటీ కానుంది. ఈ సందర్భంగా కొత్త డిస్కమ్‌ ఏర్పాటు, భారీ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్తు...

Power Sector Reforms: విద్యుత్తుపై ఫోకస్‌

  • 24న ప్రత్యేకంగా భేటీ కానున్న క్యాబినెట్‌

  • కొత్త డిస్కమ్‌ ఏర్పాటు, విద్యుత్తు డిమాండ్‌, థర్మల్‌ ప్లాంట్లు, రాజధానిలో భూగర్భ కేబుల్‌ లైన్లపై చర్చించనున్న మంత్రివర్గం

  • కొత్త సంస్కరణలపై మంత్రులకు సమావేశంలో వివరణ

  • రూ.59,671 కోట్ల మేర నష్టాల్లో రెండు డిస్కమ్‌లు

  • వాటి పరపతి పెంచడానికి కొత్త డిస్కమ్‌ ఏర్పాటు

  • గ్రిడ్‌ రక్షణ కోసం కొత్త థర్మల్‌ ప్లాంట్ల నిర్మాణం

హైదరాబాద్‌, నవంబరు 19 (ఆంధ్రజ్యోతి): విద్యుత్తు రంగంపై రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఈ మేరకు కొత్తగా తీసుకురానున్న సంస్కరణల మీద చర్చించేందుకు ఈనెల 24న ప్రత్యేకంగా క్యాబినెట్‌ భేటీ కానుంది. ఈ సందర్భంగా కొత్త డిస్కమ్‌ ఏర్పాటు, భారీ డిమాండ్‌కు అనుగుణంగా విద్యుత్తు సరఫరా కోసం తీసుకోనున్న చర్యలు, థర్మల్‌ ప్లాంట్లు, గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో భూగర్భ కేబుల్‌ వ్యవస్థ ఏర్పాటు వంటి అంశాలను మంత్రివర్గంలోని సభ్యులందరికీ వివరించనున్నారు. విద్యుత్తు రంగం పరంగా ప్రధానంగా నాలుగు అంశాలపై ఈ సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కొత్తగా పరిశ్రమలు ఏర్పడటం, పట్టణీకరణ పెరగడం, వ్యవసాయ రంగం వృద్ధి చెందడం, గృహజ్యోతి పథకం కారణంగా రాష్ట్రంలో విద్యుత్తుకు డిమాండ్‌ పెరిగింది. ప్రత్యేక రాష్ట్రంగా తెలంగాణ ఏర్పడ్డాక.. 2015 మార్చి 8న రాష్ట్రంలో విద్యుత్తు గరిష్ఠ డిమాండ్‌ 6,755 మెగావాట్లుగా ఉంది. ఈ ఏడాది మార్చి 20 నాటికి అది 17,165 మెగావాట్లకు చేరుకుంది. జాతీయ తలసరి విద్యుత్తు వినియోగం 1,395 యూనిట్లు ఉండగా... తెలంగాణ తలసరి విద్యుత్తు వినియోగం 2480 యూనిట్లుగా ఉంది. 2034-35 కల్లా ఇది 31,809 మెగావాట్లుగా ఉంటుందని అంచనా వేస్తున్నారు. ఇదే జరిగితే అప్పటికి 47,119 మిలియన్‌ యూనిట్ల మేర లోటు ఉంటుందని తేల్చారు. 2034-35 కల్లా రెన్యూవబుల్‌ పవర్‌ అబ్లిగేషన్‌ (సంప్రదాయ విద్యుత్తును వాడుతుంటే విధిగా సంప్రదాయేతర విద్యుత్తు వాటా) 50 శాతంగా ఉండనుందని, దీనికోసం మరో 2034-35 కల్లా సౌరవిద్యుత్తు వాటా 33,644 మెగావాట్లుగా ఉండాలని గుర్తించింది. డిమాండ్‌ను తీర్చే క్రమంలో 2023-35 కల్లా బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వాటా 20,874 మెగావాట్లు, థర్మల్‌ వాటా 18,248 మెగావాట్లు, పవన విద్యుత్తు వాటా 3,628 మెగావాట్లుగా ఉంటేనే డిమాండ్‌ను తీర్చగలమని, దీనికోసం ఎనర్జీ పాలసీ కింద కొత్త ప్లాంట్లు పెట్టడానికి వీలుగా చర్యలు తీసుకోవాల్సి ఉంటుందని గుర్తించారు. 8వేల మెగావాట్ల బ్యాటరీ ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థను ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగ స్వామ్యంతో పెట్టాల్సి ఉంటుందని, మరో 5 వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ జలవిద్యుత్తు కేంద్రాలు కూడా పెట్టాల్సి ఉంటుందని గుర్తించారు. 2034-25 కల్లా జెన్‌కో థర్మల్‌ సామర్థ్యం 7,980 మెగావాట్లుగా చేరనుందని, సింగరేణి థర్మల్‌ సామర్థ్యం 2వేల మెగావాట్లకు పేర్కొంది. పూర్తిగా సంప్రదాయేతర ఇంధన విద్యుత్తుపై ఆధారపడితే గ్రిడ్‌ కుప్పకూలే ప్రమాదం ఉన్నందున... గ్రిడ్‌ రక్షణ కోసం విధిగా థర్మల్‌ ప్లాంట్‌లు పెట్టాల్సి ఉంటుంది. రామగుండంలో 800 మెగావాట్లు, న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌పెట్టే దిశగా అడుగులు వేయాలని, కేటీపీఎ్‌సలో 1600 మెగావాట్ల ప్లాంట్‌ నిర్మాణంపై కూడా నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని జెన్‌కో ప్రతిపాదించింది. 20234-35 కల్లా 4400 మెగావాట్ల పవన విద్యుత్తు ప్లాంట్లు పెట్టడానికికూడా అవకాశం ఉంటుందని గుర్తు చేసింది.


కుప్పకూలిన విద్యుత్తు సంస్థలు

అత్యధిక ధరకు విద్యుత్తు కొనుగోళ్లు, అప్పులు, వివిధ ప్రభుత్వ శాఖల చెల్లింపులు ఆలస్యం కావడంతో విద్యుత్తుసంస్థలు కుప్పకూలాయని, 2014-15 నుంచి 2019-20 మధ్యకాలంలో డిస్కమ్‌లకు రూ.3553.84 కోట్ల టారిఫ్‌ సబ్సిడీ చెల్లించాల్సి ఉన్నా చెల్లించలేదని జెన్‌కో గుర్తు చేసింది. వివిధ ప్రభుత్వ శాఖలు వినియోగచార్జీల కింద రూ.31,763.1 కోట్లు, సర్‌చార్జి కింద రూ.16,242.2 కోట్లు కలిపి రూ.48,005.4 కోట్ల బిల్లులు డిస్కమ్‌లకు చెల్లించాల్సి ఉందని గుర్తించింది. బొగ్గును అత్యధిక ధరతో కొనుగోలు చేయడంతో ఆ భారం కరెంట్‌ చార్జీలపై పడుతోందని, దేశంలో మహానది కోల్‌ టన్ను బొగ్గును రూ.1120 లకు, వెస్ట్రన్‌ కోల్‌ ఫీల్డ్‌ రూ.1340లకు, సౌత్‌-ఈస్ట్రన్‌ కోల్‌ రూ.1120లకు అమ్ముతుండగా.. సింగరేణి నుంచి రవాణా చార్జీలు కలిపి టన్ను బొగ్గు రూ.5670లకు పడుతుందని గుర్తించింది. ఇక మహానది బొగ్గు రవాణాతో కలిపి రూ.4449, వెస్ట్రన్‌ రూ.3789, సౌత్‌ ఈస్ట్రన్‌ టన్ను రూ.4431 లకు రానుందని తెలిపింది. నాలుగు సంస్థలు వర్కింగ్‌ క్యాపిటల్‌ రూపంలో రూ.53,900 కోట్లు, కేపెక్స్‌ రుణాల కింద రూ.44,904 కోట్లు కలిపి రూ.98,804 కోట్ల అప్పుల్లో ఉన్నాయని గుర్తించింది. సింగరేణికి కరెంట్‌, బొగ్గు కొనుగోళ్ల కింద రూ.23,311 కోట్లను చెల్లించాల్సి ఉందని తెలిపింది.

హైదరాబాద్‌లో భూగర్భ కేబుల్‌ వ్యవస్థ

జీహెచ్‌ఎంసీ పరిధిలో విద్యుత్తు అంతరాయాలను తగ్గించి...నాణ్యమైన విద్యుత్తు సరఫరా కోసం 43,384 కిలోమీటర్ల మేర వివిధ సామర్థ్యాల మేరకు భూగర్భ లైన్లు వేయాల్సి ఉంటుందని, దీని వ్యయం 14,725 కోట్లుగా ఉంటుందని అంచనా వేశారు. అదే బెంగుళూరులో 14,199 కిలోమీటర్ల మేర లైన్లు వేసేందుకు 5,281 కోట్ల మేర వెచ్చించారని జెన్‌కో గుర్తు చేసింది.

పాత డిస్కమ్‌ల పరపతి కోసం కొత్త డిస్కమ్‌

2025 మార్చి 31 నాటికి ఎస్పీడీసీఎల్‌, ఎన్పీడీసీఎల్‌ రూ.59,671 కోట్ల మేర నష్టాల్లో ఉన్నాయని, వీటి పరపతి పెంచడానికి కొత్త డిస్కమ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. వ్యవసాయ పంపుసెట్లు (28,89,921), ఎత్తిపోతల పథకాలు(429), మిషన్‌భగీరథ/గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ (276), హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ వాటర్‌బోర్డు(60) ఇలా మొత్తంగా 28,90,686 కనెక్షన్లతో ప్రత్యేకంగా డిస్కమ్‌ ఏర్పాటు చేయనున్నట్లు గుర్తించింది. దీనికోసం ఆయా కనెక్షన్లకు కరెంట్‌ అందించే అన్ని రకాల డీటీఆర్‌లను బదిలీ చేయనున్నారు. అన్నిరకాల పీపీఏలను మూడు డిస్కమ్‌లు(ఇదివరకే ఉన్న రెండు కలిపి) పంచుకుంటాయని గుర్తు చేయనుంది. కొత్త డిస్కమ్‌ కోసం సీఎండీ, బోర్డ్‌ ఆఫ్‌ డైరెక్టర్లతో పాటు 2 వేల మంది ఉద్యోగులు అవసరమని లెక్కగట్టింది. వివిధ జెన్‌కోలకు చెల్లించాల్సిన 26,950 కోట్లతో పాటు రూ.9032 కోట్ల అప్పులను కొత్త డిస్కమ్‌ బదిలీ చేయనున్నారు.

Updated Date - Nov 20 , 2025 | 06:01 AM