Telangana Cabinet: స్థానిక ఎన్నికలకు ఎలా వెళదాం
ABN , Publish Date - Nov 16 , 2025 | 05:16 AM
రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం (17న) జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది.
రేపు క్యాబినెట్ భేటీ.. ఈ అంశంపై చర్చ
పార్టీ పరంగా బీసీలకు 42శాతం సీట్లిచ్చే యోచన
ప్రజా పాలన విజయోత్సవాల ప్రణాళిక ఖరారు
8, 9 తేదీల్లో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్’
హాజరు కానున్న సీఎం, 3వేల మంది ప్రతినిధులు
గిగ్ వర్కర్ల ముసాయిదాపైనా క్యాబినెట్‌లో చర్చ!
ఇదే స్ఫూర్తితో ముందుకెళ్లండి
స్థానిక సంస్థల్లోనూ విజయబావుటా ఎగరేయండి
జీహెచ్‌ఎంసీ, మున్సిపల్ ఎన్నికలపై శ్రద్ధ పెట్టండి
జూబ్లీహిల్స్‌లో ఘన విజయంపై రేవంత్, మహేశ్,
భట్టి, నవీన్‌లకు ఖర్గే, రాహుల్ అభినందనలు
జూబ్లీహిల్స్ తీర్పు మా పాలనకు రెఫరెండం
డిపాజిట్ రాని కిషన్‌రెడ్డి మాట్లాడ్డం హాస్యాస్పదం
నేను మంత్రివర్గంలోకి వెళుతున్నాననే
వార్తల్లో వాస్తవం లేదు: టీపీసీసీ చీఫ్ మహేశ్‌గౌడ్
సీఎం రేవంత్‌తో విన్ గ్రూప్ సీఈవో భేటీ
భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు ఆసక్తి
హైదరాబాద్, నవంబరు 15 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గ సమావేశం సోమవారం (17న) జరగనుంది. సచివాలయంలో సీఎం రేవంత్ అధ్యక్షతన మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభం కానుంది. ఈ భేటీలో చర్చించే ఎజెండాకు సంబంధించిన సమాచారాన్ని అందుబాటులో ఉంచాలని అన్ని శాఖల ముఖ్యకార్యదర్శులను సీఎస్ కె.రామకృష్ణారావు ఆదేశించారు. క్యాబినెట్‌లో ప్రధానంగా స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనున్నారు. స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవోపై హైకోర్టు స్టే ఇచ్చిన విషయం తెలిసిందే. దీంతో నవంబరులో జరగాల్సిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలను రాష్ట్ర ఎన్నికల కమిషన్ వాయిదా వేసింది. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలపై ఎలా ముందుకు వెళ్లాలన్నదానిపై మంత్రులతో సీఎం చర్చించనున్నారు. మంత్రుల అభిప్రాయాలు, న్యాయ నిపుణుల సలహాలు తీసుకుని, స్థానికసంస్థల ఎన్నికలపై నిర్ణయం ప్రకటిస్తామని శుక్రవారం సీఎం రేవంత్ వెల్లడించిన విషయం తెలిసిందే. అయితే.. రిజర్వేషన్ల పెంపు జోలికి వెళ్లకుండా పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లను కేటాయిస్తూ ముందుకెళ్లడమే ప్రస్తుతం పార్టీ ముందున్న మార్గమని నిపుణులు చెబుతున్నారు. కాంగ్రెస్ పెద్దలు, ప్రభుత్వాధినేతలు కూడా ఇదే దిశగా యోచిస్తున్నట్లు సమాచారం. అదే జరిగితే.. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను పెంచుతూ జారీ చేసిన జీవో (9)ను ప్రభుత్వం నిలుపుదల చేయక తప్పదని అంటున్నారు. దీంతో ప్రస్తుతం స్థానిక సంస్థల్లో బీసీలకు అమలవుతున్న రిజర్వేషన్ల కోటానే వర్తింపజేసే అవకాశాలున్నాయి. దీనిపై క్యాబినెట్ నుంచి ఏదైనా నిర్ణయం వెలువడుతుందని భావిస్తున్నారు.
ప్రజా పాలన విజయోత్సవాలు..
కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటై ఈ డిసెంబరు 7 నాటికి రెండేళ్లు పూర్తి కానుంది. దీంతో డిసెంబరు మొదటి వారంలో ప్రభుత్వం ప్రజా పాలన విజయోత్సవాలను నిర్వహించనుంది. అందుకే ఈ ఉత్సవాల తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూలు విడుదల చేయాల్సిందిగా రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను ప్రభుత్వం కోరనుందని చెబుతున్నారు. ఉత్సవాల సందర్భంలో షెడ్యూలు వెలువడితే ప్రజలు, పార్టీ గ్రామీణ క్యాడర్ మొత్తం ఎన్నికల్లో తలమునకలవుతారని ప్రభుత్వం భావిస్తోంది. ఈ దృష్ట్యా ఎన్నికల ప్రక్రియ డిసెంబరులో ప్రారంభమవుతుందని తెలుస్తోంది. మరోవైపు ప్రజాపాలన విజయోత్సవాల్లో భాగంగా ప్రభుత్వం డిసెంబరు 8, 9 తేదీల్లో ఫ్యూచర్ సిటీలో ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్-2025’ను నిర్వహించనుంది. దీనికి దేశ విదేశాల నుంచి 3వేల మంది ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు హాజరు కానున్నారు. సీఎం రేవంత్‌రెడ్డి పాల్గొంటారు. 9న ‘తెలంగాణ రైజింగ్ - 2047’ డాక్యుమెంట్‌ను ఆవిష్కరిస్తారు.
రాష్ట్ర భవిష్యత్తుకు రోడ్‌మ్యాప్..
డిసెంబరు 8న ప్రజా ప్రభుత్వ రెండో వార్షికోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తెలంగాణ భవిష్యత్తుకు ఒక రోడ్ మ్యాప్‌ను ఆవిష్కరించనున్నారు. రెండు రోజుల సదస్సులో తెలంగాణ రైజింగ్-2027 డాక్యుమెంట్ గురించి ప్రతినిధులకు వివరించనున్నారు. ఈ సందర్భంగా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చే సంస్థలతో ఎంవోయూలు కుదుర్చుకునే అవకాశముంది. ఈ ప్రజా పాలన వియోజత్సవాల ప్రణాళిక ఖరారు, సదస్సు నిర్వహణ, విదేశీ ప్రతినిధులకు సౌకర్యాలు, భద్రత, ఏర్పాట్లపై క్యాబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ఇక జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక పూర్తికావడంతో ఈ నెల 14తో ఎన్నికల కోడ్ ముగిసింది. దీంతో ఇన్ని రోజులపాటు పెండింగ్‌లో ఉన్న సంక్షేమ, అభివృద్ధి పథకాలపై నిర్ణయాలు తీసుకునే అవకాశాలున్నాయి. గిగ్ వర్కర్ల ముసాయిదాపైనా క్యాబినెట్ చర్చిస్తుందని సమాచారం.