Telangana Government: మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణే
ABN , Publish Date - Nov 01 , 2025 | 05:30 AM
రాష్ట్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన జరగనుందా!? పనితీరు బాగా లేని కొంతమంది మంత్రులను తప్పించి.. అదే వర్గానికి చెందిన మరికొందరికి అవకాశం కల్పించనున్నారా...
డిసెంబరు లేదా జనవరిలో ముహూర్తం
పలువురి శాఖల్లోనూ భారీ మార్పులు
కొత్త మంత్రులకు మాత్రం మినహాయింపు
ఐదుగురి తీరుపై అధిష్ఠానం పెదవి విరుపు
హైదరాబాద్, అక్టోబరు 31 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన జరగనుందా!? పనితీరు బాగా లేని కొంతమంది మంత్రులను తప్పించి.. అదే వర్గానికి చెందిన మరికొందరికి అవకాశం కల్పించనున్నారా!? కొంతమంది మంత్రుల శాఖలనూ మార్చనున్నారా!? ఇందుకు ‘ఔను’ అనే అంటున్నాయి అత్యంత విశ్వసనీయ వర్గాలు. తెలంగాణ ప్రభుత్వ పాలననే నమూనాగా చూపి వచ్చే లోక్‌సభ ఎన్నికలకు వెళ్లాలని చూస్తున్న కాంగ్రెస్ అధిష్ఠానం.. స్థానిక ఎన్నికల తర్వాత డిసెంబరులో లేదా వచ్చే ఏడాది జనవరిలో భారీ ప్రక్షాళన చేపట్టనుంది. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి డిసెంబరుకు రెండేళ్లు పూర్తి కానున్న నేపథ్యంలో మంత్రివర్గాన్ని పునర్వ్యవస్థీకరించనున్నట్లు తెలుస్తోంది. దీనితోపాటు మంత్రుల శాఖల్లోనూ భారీగా మార్పులు తీసుకు రానున్నట్లు తెలుస్తోంది. అయితే, ఈ కసరత్తులో కొత్తగా నియమితులైన నలుగురు మంత్రులకు మినహాయింపు ఉంటుందని పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రివర్గంలో మరో ఇద్దరికి అవకాశం ఉంది. పునర్ వ్యవస్థీకరణతో మరి కొందరికి అవకాశం దక్కనుందని చెబుతున్నారు. వాస్తవానికి, క్యాబినెట్‌లో ముఖ్యమంత్రి సహా 18 మందికి అవకాశం ఉంటుంది. కొత్తగా ప్రభుత్వం ఏర్పడినప్పుడు సీఎం రేవంత్ రెడ్డి, మరో 11 మంది మంత్రులు మాత్రమే ప్రమాణ స్వీకారం చేశారు. సుదీర్ఘ చర్చల తర్వాత జూన్‌లో వాకిటి శ్రీహరి (బీసీ ముదిరాజ్), గడ్డం వివేక్ (ఎస్సీ మాల), అడ్లూరి లక్ష్మణ్ (ఎస్సీ మాదిగ)లను మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తాజాగా అజరుద్దీన్ క్యాబినెట్‌లోకి చేరారు. దీంతో, సీఎంతో కలిపి మంత్రుల సంఖ్య 16కు చేరుకుంది. వాస్తవానికి, సీఎంతోపాటు తొలుత ప్రమాణ స్వీకారం చేసిన 11 మంది మంత్రుల పనితీరుపై అధిష్ఠానం ఇప్పటికే సమీక్ష చేసింది. ఆయా శాఖలు, జిల్లా ఇన్‌చార్జి మంత్రులుగా, రాజకీయ నాయకులుగా వ్యవహరించిన తీరును పరిగణనలోకి తీసుకున్న అధిష్ఠానం.. ఒక్కో మంత్రికి సంబంధించి సమగ్ర నివేదికను రూపొందించింది. వారి ప్రోగ్రెస్ రిపోర్టును పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మీనాక్షి నటరాజన్ అందజేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా ఐదుగురు మంత్రుల పనితీరుపై పెదవి విరిచిన అధిష్ఠానం.. మళ్లీ సమీక్ష నాటికి మెరుగుపరుచుకోవాలని సూచించినట్లు సమాచారం. త్వరలో మరోమారు సమీక్ష జరిపి మంత్రివర్గంలో భారీ ప్రక్షాళన తీసుకురానున్నట్లు తెలుస్తోంది. పనితీరు మెరుగు పరుచుకోని మంత్రుల స్థానంలో అదే వర్గాలకు చెందిన వేరొకరిని తీసుకోనున్నట్లు చెబుతున్నారు. అలాగే కీలకమైన శాఖలు నిర్వహిస్తున్న కొందరు మంత్రుల నుంచి వాటిని తప్పించి వేరే శాఖలు కేటాయించే అవకాశం ఉందంటున్నారు. పునర్వ్యవస్థీకరణ తర్వాత.. ఇప్పటికే ఖాళీగా ఉన్న రెండు సీట్లు సహా నలుగురైదుగురికి కొత్తగా అవకాశం దొరకనుందని చెబుతున్నారు. అలాగే ప్రభుత్వ చీఫ్ విప్, ఇతర పదవులనూ భర్తీ చేయనున్నారు.
ఒత్తిడిలకు తలొగ్గేదే లే..!
మంత్రి పదవుల కోసం ఇటు సీఎం రేవంత్ రెడ్డి, అటు అధిష్ఠానంపై పార్టీ ఎమ్మెల్యేలు తీవ్రంగా ఒత్తిడి తీసుకు వస్తుండడంతో ఎటూ తేల్చుకోలేని పరిస్థితుల్లోనే విస్తరణ ఆలస్యమవుతూ వస్తోంది. ముఖ్యంగా, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు, సుదర్శన్ రెడ్డి, మల్‌రెడ్డి రంగారెడ్డి, రామ్మోహన్ రెడ్డి తదితరులు తీవ్రంగా ఒత్తిడి తీసుకొస్తున్నారు. రాజగోపాల్‌రెడ్డి సోదరుడు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఇప్పటికే మంత్రివర్గంలో ఉండటంతో ఇద్దరిలో ఒక్కరికే అవకాశం కల్పించేందుకు అధిష్ఠానం సుముఖత వ్యక్తం చేసింది. సుదర్శన్ రెడ్డి కోసం సీఎం రేవంత్ రెడ్డి, ప్రేమ్‌సాగర్‌రావు కోసం డిప్యూటీ సీఎం భట్టివిక్రమార్క ప్రయత్నాలు చేశారు. వారి విషయంలోనూ అధిష్ఠానం సుముఖత చూపలేదు. ప్రేమ్‌సాగర్‌రావును పౌరసరఫరాల సంస్థ చైర్మన్‌గా, సుదర్శన్ రెడ్డిని ప్రభుత్వ సలహాదారుగా నియమించడంతో వారిద్దరూ రేసు నుంచి తప్పుకొన్నట్లు స్పష్టమైంది. సీఎం, డిప్యూటీ సీఎంలు స్వయంగా సిఫార్సు చేసిన వారికే మంత్రి పదవులు నిరాకరించడం ద్వారా మిగిలిన వారికీ అధిష్ఠానం స్పష్టమైన సంకేతం ఇచ్చిందని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.