Telangana Cabinet: శాఖలపై కసరత్తు
ABN , Publish Date - Jun 10 , 2025 | 06:32 AM
తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపుపై హస్తినలో కసరత్తు మొదలైంది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయి దాదాపు గంటసేపు చర్చించారు.
కేసీ వేణుగోపాల్‌తో సీఎం రేవంత్‌రెడ్డి భేటీ
కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుపై చర్చ
న్యూఢిల్లీ, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కొత్తగా ప్రమాణ స్వీకారం చేసిన మంత్రులకు శాఖల కేటాయింపుపై హస్తినలో కసరత్తు మొదలైంది. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం ఢిల్లీలోని ఇందిరా భవన్‌లో ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (సంస్థాగత) కేసీ వేణుగోపాల్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భేటీ అయి దాదాపు గంటసేపు చర్చించారు. మంత్రులకు శాఖల కేటాయింపుపైనే ప్రధానంగా వీరి చర్చ సాగినట్టు తెలిసింది. ప్రస్తుతం మంత్రివర్గంలో ఎవరెవరి దగ్గర ఏయే శాఖలున్నాయి? రెండు, మూడు మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న వారెవరు? కొత్తగా మంత్రివర్గంలో చేరిన వాకిటి శ్రీహరి, గడ్డం వివేక్, అడ్లూరి లక్ష్మణ్‌కు ఏ శాఖలు కేటాయించాలి? అనే అంశాలపై సుధీర్ఘంగా చర్చించినట్టు సమాచారం. దీనికి సంబంధించిన జాబితాను కేసీ వేణుగోపాల్‌కు సీఎం రేవంత్ అందించినట్టు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. ప్రస్తుతం ఎవరికీ కేటాయించని శాఖలను కొత్తవారికి కేటాయించే అంశంపై సమాలోచన జరిగినట్టు తెలుస్తోంది. అయితే, ప్రస్తుతం ఎవరికీ కేటాయించని శాఖలన్నీ ముఖ్యమంత్రి వద్దే ఉన్నాయి.
అందులో ప్రధానమైనవి.. విద్య, పురపాలకం, హోం, గనులు, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ సంక్షేమం, వాణిజ్య పన్నులు, పశుసంవర్ధక శాఖ, న్యాయ, కార్మిక, క్రీడలు యువజన శాఖ. వీటిలో విద్యా శాఖను తనకు కేటాయించాలని గడ్డం వివేక్ కోరుతున్నట్టు తెలిసింది. ఇదే విషయాన్ని మల్లికార్జున ఖర్గేకు సైతం తెలియజేసినట్టు సమాచారం. అయితే, వివేక్‌కు కార్మిక, మైనింగ్, క్రీడల శాఖ.. అడ్లూరి లక్ష్మణ్‌కు ఎస్సీ, ఎస్టీ సంక్షేమం, వాకిటి శ్రీహరికి పశుసంవర్ధక, యువజన, న్యాయ లేదా మత్స్య శాఖ కేటాయించే అవకాశం ఉన్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. దీంతోపాటు.. మంత్రి వర్గంలో స్థానం దక్కుతుందని ఆశించి నిరాశ చెందిన వారి ప్రభావమెంత? వారిని శాంతింపజేయడం ఎలా? అనే అంశాలపై కూడా కేసీ, రేవంత్ మధ్య చర్చ జరిగినట్టు సమాచారం. మంత్రివర్గంలో మరో ముగ్గురికి అవకాశం ఉన్న నేపథ్యంలో మిగిలిన వారికి ఈసారి చోటు కల్పిస్తామనే నమ్మకం కలిగించాలని రేవంత్ రెడ్డికి కేసీ సూచించినట్టు తెలిసింది. అలాగే.. ప్రస్తుతం కీలక మంత్రిత్వ శాఖలు నిర్వహిస్తున్న వారి వ్యవహారశైలి, పని తీరు తదితర అంశాలను ఆయన అడిగి తెలుసుకున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఒకరిద్దరి మంత్రుల శాఖల్లో మార్పులు చేసే అవకాశం ఉన్నట్టు కాంగ్రెస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.
సీఎంను కలిసిన అడ్లూరి, రాంచందర్‌నాయక్
హైదరాబాద్, జూన్ 9 (ఆంధ్రజ్యోతి): ఇటీవల మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో పాటు డిప్యూటీ స్పీకర్‌గా ఎంపికైన రాంచందర్‌నాయక్ సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం జూబ్లీహిల్స్‌లోని నివాసంలో సీఎంను వారు కుటుంబసమేతంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
ఈ వారంలోనే కొలిక్కి?
ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో సీఎం రేవంత్ రెడ్డి మంగళవారం సమావేశం కానున్నారు. ఖర్గేతో జరిగే సమావేశంతో.. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపు అంశం ఒక కొలిక్కి వచ్చే అవకాశముందని.. ఈ వారంలోనే కొత్తమంత్రులకు శాఖల కేటాయింపు ప్రక్రియ పూర్తవుతుందని తెలిసింది. ఇక.. ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్‌కు మంత్రివర్గంలో, మరో విప్ రామచంద్ర నాయక్‌కు డిప్యూటీ స్పీకర్‌గా అవకాశం కల్పించిన నేపథ్యంలో వారి స్థానంలో మరో ఇద్దరికి అవకాశం కల్పించడంపైనా చర్చించినట్టు తెలిసింది. మంత్రి పదవులు ఆశించి నిరాశ చెందిన వారిలో ఇద్దరికి విప్‌లుగా అవకాశం కల్చించనున్నట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. ఇదిలా ఉండగా.. సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కార్యాలయం లోపలికి వెళ్లిన కొద్దిసేపటికే రాజకీయ వ్యూహకర్త సునీల్ కనుగోలు సైతం లోపలికి వెళ్లారు. రేవంత్ బయటికి వచ్చిన కొద్దిసేపటకే ఆయనా బయటికి వెళ్లిపోయారు. అయితే, ఆయన కేసీ వేణుగోపాల్, రేవంత్ సమావేశంలో పాల్గొన్నారా? లేదా? అనే దానిపై మాత్రం స్పష్టత లేదు.