Uppal Stadium: మైదానంలోనే మంత్రివర్గం!
ABN , Publish Date - Dec 14 , 2025 | 07:17 AM
రాష్ట్ర మంత్రివర్గమంతా మైదానం దారిపట్టింది. నిత్యం బిజీగా ఉండే క్యాబినెట్ సభ్యులు.. రెండో శనివారం సెలవు దినం కావడంతో అధికారిక కార్యక్రమాలకు కాసింత విరామం ఇచ్చారు!
మెస్సీ, రాహుల్ గాంధీ చుట్టే క్యాబినెట్ సహచరులు
హైదరాబాద్, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): రాష్ట్ర మంత్రివర్గమంతా మైదానం దారిపట్టింది. నిత్యం బిజీగా ఉండే క్యాబినెట్ సభ్యులు.. రెండో శనివారం సెలవు దినం కావడంతో అధికారిక కార్యక్రమాలకు కాసింత విరామం ఇచ్చారు! హైదరాబాద్ పర్యటనకు అర్జెంటీనా ఫుట్‌బాల్ దిగ్గజం లియోనెల్ మెస్సీతోపాటు కాంగ్రెస్ లోక్‌సభ పక్షనేత రాహుల్‌గాంధీ కూడా రావడంతో అంతా ఉప్పల్ స్టేడియంకు చేరుకున్నారు. తొలుత.. శంషాబాద్ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న రాహుల్‌కు సీఎం రేవంత్ రెడ్డితోపాటు టీపీసీసీ అధ్యక్షుడు, మంత్రులు స్వాగతం పలికారు. శంషాబాద్ విమానాశ్రయం నుంచి ఫలక్‌నుమా ప్యాలెస్ దాకా రాహుల్‌గాంధీ, సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ కలిసే ఒకే కారులో ప్రయాణం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో.. తాజాగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ మద్దతుదారులు సాధించిన విజయాన్ని రాహుల్‌కు సీఎం, పీసీసీ అధ్యక్షుడు వివరించారు. తెలంగాణ రైజింగ్-గ్లోబల్ సమ్మిట్‌లో భారీగా పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. రాష్ట్రంలో ప్రభుత్వ, పార్టీ పనితీరుపై రాహుల్ గాంధీ సంతృప్తి వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇక, ఫలక్‌నుమా ప్యాలె్‌సకు చేరుకున్న రాహుల్.. అక్కడే ఉన్న మెస్సీని మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. అలాగే, రాహుల్‌ను మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, శ్రీధర్‌బాబు, పొంగులేటి, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి తదితరులు కలుసుకున్నారు. ఇక ఢిల్లీ పర్యటనలో ఉన్న మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి శనివారం ఉదయమే హైదరాబాద్‌కు చేరుకున్నారు. ఆ తర్వాత ఫలక్‌నుమా నుంచి ఉప్పల్ స్టేడియంకు మెస్సీ, రాహుల్‌గాంధీ రాగా.. మంత్రులతోపాటు ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు వారి చుట్టే ఉన్నారు. ఇక కోల్‌కతాలో అభిమానుల అత్యుత్సాహంతో మెస్సీ పర్యటన అర్ధంతరంగా రద్దు కావడంతో హైదరాబాద్‌లో ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావు లేకుండా పోలీసు యంత్రాంగం భారీగా బందోబస్తు నిర్వహించింది. ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసింది. రెండు రోజులుగా హైదరాబాద్‌లో రాజకీయ, క్రీడా సందడి నెలకొంది. రెండు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం యూపీ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ రాగా.. శనివారం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీ రావడంతో హైదరాబాద్‌లో సందడి నెలకొంది. అర్జెంటీనా ఫుట్ బాలర్ లియోనెల్ మెస్సీ వెంట మరో స్టార్ ఆటగాడు రోడ్రిగో జేవియర్ డీ పాల్ కూడా రావడంతో ఫుట్‌బాల్ అభిమానుల్లో సంతోషం పరవళ్లు తొక్కింది.
రాహుల్‌తోపాటే ఢిల్లీకి రేవంత్
ఫ్రెండ్లీ మ్యాచ్ అనంతరం రాహుల్ గాంధీతోపాటు సీఎం రేవంత్ రెడ్డి కూడా శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకొని.. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఢిల్లీ వెళ్లారు. ‘ఓట్ చోర్.. గద్దీ చోడ్’ నినాదంతో ఆదివారం ఢిల్లీలో జరిగే మహా ర్యాలీలో రేవంత్‌తోపాటు మంత్రులు పాల్గొనున్నారు.
అందుకే మెస్సీ.. నో జెర్సీ!
హైదరాబాద్ సిటీ బ్యూరో ప్రతినిధి, డిసెంబరు 13 (ఆంధ్రజ్యోతి): సీఎం రేవంత్ రెడ్డి, సాకర్ దిగ్గజం మెస్సీ మధ్య జరిగిన ఫ్రెండ్లీ మ్యాచ్ అదరిపోయింది. సగటు క్రీడాభిమానులంతా ఖుషీ అయిపోయారు. అంతా బాగుంది కానీ.. ‘‘ మెస్సీ జెర్సీ ఎందుకు వేసుకోలేదు?’’.. ఈ మ్యాచ్‌ను చూసిన అభిమానులందరి మదిలోనూ ఇదే ప్రశ్న. సీఎం రేవంత్ జెర్సీ ధరించి ఓ క్రీడాకారుడిలా వ్యవహరించగా.. అందుకు భిన్నంగా మెస్సీ బ్లాక్ ట్రాక్ సూట్‌తో మైదానంలోకి అడుగుపెట్టారు. జెర్సీ సంగతిపై క్రీడారంగ విశ్లేషకులతో ‘ఆంధ్రజ్యోతి’ సంభాషించగా పలు ఆసక్తికర అంశాల్ని వెల్లడించారు. హైదరాబాద్‌లో జరిగింది పూర్తిస్థాయి ప్లేయింగ్ ఎగ్జిబిషన్ మ్యాచ్ కాదు. ఇదో ’ఫేస్ ఆఫ్ ద ఈవెంట్‘ కావటంతోనే మెస్సీ జెర్సీ ధరించలేదన్నారు. ‘మెస్సీ లాంటి దిగ్గజ ఆటగాడు ఎక్కడ.. ఎలాంటి మ్యాచ్‌లో.. ఏ జెర్సీతో ఆడాలన్న దానికి సంబంధించి స్పష్టమైన పరిమితులు ఉంటాయి. ఆయన ప్రాతినిధ్యం వహించే క్లబ్‌తో చేసుకునే ఒప్పందం ఆధారంగా ఈ వ్యవహారాలన్నీ ముడిపడి ఉంటాయి. క్లబ్ అనుమతి లేకుండా జెర్సీ వేసుకోవటం.. ఫీల్డ్‌లో అడుగుపెట్టటం కూడా కాంట్రాక్టు ఉల్లంఘన అవుతుంది. ఈ కారణంతోనే చాలా ఎగ్జిబిషన్ టూర్స్‌లో మెస్సీ ట్రాక్ సూట్ లోనే కనిపిస్తాడు’ అని క్రీడా విశ్లేషకులు చెబుతున్నారు. హైదరాబాద్‌లోనే కాదు ఆసియా, మిడిల్ ఈస్ట్, లాటిన్ అమెరికా ప్రాంతాల్లో జరిగిన ఇతర ఫ్రెండ్లీ మ్యాచ్‌లు, విజట్స్, ఈవెంట్‌ల్లో కూడా మెస్సీ జెర్సీ ధరించకుండా ఇదే తీరు ప్రదర్శించడం మామూలేనని క్రీడా వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.
