Telangana Cabinet: మరోమారు కేంద్రంపై ఒత్తిడి తెద్దామా
ABN , Publish Date - Nov 17 , 2025 | 05:55 AM
పంచాయతీల పాలక మండళ్ల గడువు ముగిసి చాలా కాలమైనా.. ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి నెలకొని ఉంది.
కోర్టు సూచన మేరకు ఎన్నికలకు వెళదామా?
సర్పంచ్ ఎన్నికలు నిర్వహించి బీసీలకు 42ుకోసం పోరాడదామా?
నేడు క్యాబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలపై చర్చ
హైదరాబాద్, నవంబరు 16 (ఆంధ్రజ్యోతి): పంచాయతీల పాలక మండళ్ల గడువు ముగిసి చాలా కాలమైనా.. ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రభుత్వంపై ఒత్తిడి నెలకొని ఉంది. మరోవైపు ఈ కారణంతో కేంద్రం నుంచి రావాల్సిన సుమారు రూ.3 వేల కోట్ల నిధులు పెండింగ్‌లో ఉండిపోయాయని పంచాయతీరాజ్ శాఖ ప్రభుత్వానికి చెబుతూ వస్తోంది. అయితే స్థానిక ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కల్పించాలన్న ఉద్దేశంతోనే ప్రభుత్వం ఎన్నికలను వాయిదా వేస్తూ వస్తోంది. 42 శాతం రిజర్వేషన్ కోసం ప్రభుత్వం జారీ చేసిన జీవో 9ను నిలిపివేస్తూ హైకోర్టు ఇటీవల మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. ఈ నేపథ్యంలో స్థానిక ఎన్నికలు ఎలా నిర్వహించాలన్న దానిపై సోమవారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం నిర్ణయం తీసుకోనుంది. దీంతోపాటు వివిధ అంశాలు, కార్యక్రమాలకు సంబంధించి పాలన, విధానపరమైన నిర్ణయాలు తీసుకునేందుకు సచివాలయంలో మధ్యాహ్నం 3 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం కానుంది. ప్రధానంగా స్థానిక సంస్థలకు ఎన్నికల నిర్వహణపైనే ఈ సమావేశంలో సమీక్షించనున్నారు. కాగా, క్యాబినెట్ భేటీ కోసం స్థానిక ఎన్నికల పరిస్థితిపై పంచాయతీరాజ్ శాఖ సవివరమైన నోట్‌ను సిద్ధం చేసి ఉంచింది. సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పులు, కేంద్ర నిధులు పెండింగ్‌లో ఉండడం, డిసెంబరు 1 నుంచి పార్లమెంటు సమావేశాలు జరగనున్న నేపథ్యంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ కోసం తుది ప్రయత్నాలు చేపట్టే అవకాశం వంటి అంశాలన్నింటినీ పరిగణనలోకి తీసుకుని మంత్రివర్గం సమీక్షించనుంది.
అఖిలపక్ష పార్టీలతో ఢిల్లీకి
బీసీల రిజర్వేషన్ కోసం పార్లమెంటు సమావేశాల సందర్భంగా అఖిలపక్ష పార్టీలు, సంఘాలను ఢిల్లీకి తీసుకువెళ్లి ప్రధానిని కలవడం, పార్లమెంటు వేదికగా ఒత్తిడి తేవడం వంటి అంశాలు ప్రభుత్వ పరిశీలనలో ఉన్నాయి. దీంతోపాటు హైకోర్టు సూచన మేరకు పాత రిజర్వేషన్ ప్రకారమే ఎన్నికలకు వెళ్లి.. పార్టీ పరంగా బీసీలకు 42 శాతం సీట్లు ఇచ్చే అంశాన్నీ పరిశీలిస్తున్నారు. పంచాయతీలకు కేంద్రం నుంచి వచ్చే నిధులు పెండింగ్‌లో ఉన్న నేపథ్యంలో తొలుత గ్రామపంచాయతీల వరకు ఎన్నికలు నిర్వహించాలన్న ప్రతిపాదననూ పరిశీలిస్తున్నారు. ఈ ప్రతిపాదనలన్నింటినీ సమీక్షించి.. స్థానిక ఎన్నికలపై క్యాబినెట్ ఓ నిర్ణయానికి రానుంది. కాగా.. డిసెంబర్ 8, 9 తేదీల్లో నిర్వహించనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ - 2025, ప్రజా ప్రభుత్వ విజయోత్సవాలకు సంబంధించిన ఏర్పాట్లపైనా సమీక్షించనున్నారు. వందేళ్ల ప్రగతికి రోడ్ మ్యాప్ కోసం రూపొందించనున్న తెలంగాణ రైజింగ్ - 2047 డాక్యుమెంట్ రూపకల్పనపైనా చర్చించనున్నారు.