Share News

Telangana Cabinet Approves Panchayat Polls: ఎన్నికలు.. తొలుత పంచాయతీలకు

ABN , Publish Date - Nov 18 , 2025 | 05:50 AM

సుదీర్ఘకాలంగా సందిగ్ధంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం పూర్తి స్పష్టతనిచ్చింది. ఈ ఎన్నికల ప్రక్రియను త్వరగా చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది....

Telangana Cabinet Approves Panchayat Polls: ఎన్నికలు.. తొలుత పంచాయతీలకు

  • బీసీలకు పార్టీ పరంగా 42 శాతం సీట్లు

  • డిసెంబరులోనే ఎన్నికలు పూర్తి చేసే యోచన

  • సుప్రీం సూచనలు, హైకోర్టు తీర్పు, 3 వేల కోట్లు మురిగిపోయే ప్రమాదం.. వీటి వల్లే నిర్ణయం

  • కోర్టుల నుంచి స్పష్టత వచ్చాకే ప్రాదేశిక ఎన్నికలు

  • పాఠ్యపుస్తకాల్లో ‘జయజయహే తెలంగాణ’

  • అందెశ్రీ కుమారుడికి అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ పోస్టు

  • గిగ్‌ వర్కర్ల సంక్షేమం, భద్రత బిల్లుకు ఆమోదం

  • 8, 9న ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌’

  • ఎస్సారెస్పీ ఫేజ్‌-2 కెనాల్‌కు దామోదర్‌రెడ్డి పేరు

  • క్యాబినెట్‌ భేటీలో నిర్ణయాలు.. సుదీర్ఘంగా భేటీ

  • ఇద్దరి కన్నా ఎక్కువ సంతానం ఉన్నా పోటీకి అర్హులే.. గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల

హైదరాబాద్‌, నవంబరు 17 (ఆంధ్రజ్యోతి): సుదీర్ఘకాలంగా సందిగ్ధంగా మారిన స్థానిక సంస్థల ఎన్నికలపై ప్రభుత్వం పూర్తి స్పష్టతనిచ్చింది. ఈ ఎన్నికల ప్రక్రియను త్వరగా చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయించింది. అయితే గతంలో నిర్ణయించినట్లు ముందుగా ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలు కాకుండా.. గ్రామ పంచాయతీ ఎన్నికలను తొలుత నిర్వహించాలని తీర్మానించింది. రాష్ట్రంలోని స్థానిక సంస్థలకు రూ.3 వేల కోట్ల వరకు 15వ ఆర్థిక సంఘం నిధులు రావాల్సి ఉంది. వచ్చే ఏడాది మార్చిలోపు ఈ నిధులు మురిగిపోయే పరిస్థితి నెలకొంది. అందుకే అప్పటిలోగానే పంచాయతీలకు ఎన్నికలు నిర్వహించి, పాలక వర్గాలను ఏర్పాటు చేయడం ద్వారా ఆ నిధులను రాబట్టాలని నిర్ణయించింది. ఈ దృష్ట్యా పంచాయతీ ఎన్నికలను డిసెంబరు లోపే నిర్వహించాలన్న నిర్ణయానికి వచ్చింది. సోమవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన సచివాలయంలో జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమైన సమావేశం 5 గంటలకు పైగా సుదీర్ఘంగా కొనసాగింది. ఈ సందర్భంగా పలు కీలక అంశాలకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి, ప్రభుత్వ సలహాదారు షబ్బీర్‌ అలీ, అంతకుముందు మంత్రి వివేక్‌ వెంకటస్వామి మీడియాకు వెల్లడించారు. రాష్ట్రంలో అన్ని వర్గాల రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు ఆదేశాలు, రిజర్వేషన్లపై హైకోర్టు నుంచి వచ్చిన ప్రభుత్వ వ్యతిరేక తీర్పు నేపథ్యంలో బీసీలకు పార్టీ పరంగా 42 శాతం సీట్లు కేటాయించాలని మంత్రివర్గం నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. గ్రామాల్లో పాలన వ్యవస్థ పూర్తిగా నిర్వీర్యమవుతున్న నేపథ్యంలో వీలైనంత తొందరగా పంచాయతీ ఎన్నికలకు వెళ్లాలని నిర్ణయం తీసుకుందన్నారు.


15వ ఆర్థిక సంఘం కాలపరిమితి 2026 మార్చి 31తో ముగియనుందని, ఆలోగా పంచాయతీ ఎన్నికలు పూర్తి చేయకపోతే గ్రామాలకు రావాల్సిన నిధులు దాదాపు రూ.3 వేల కోట్లు రాకుండా పోతాయని అన్నారు. అందుకే ఈ డిసెంబరులోనే ఎన్నికలు పూర్తి చేసేందుకు ఏర్పాట్లు చేయాలని మంత్రివర్గం అధికారులను ఆదేశించిందన్నారు. ఇప్పటికే హైకోర్టు ఇచ్చిన తీర్పు, అన్ని వర్గాల రిజర్వేషన్లు 50 శాతానికి మించకూడదన్న సుప్రీంకోర్టు సూచనల మేరకు ఎన్నికలకు వెళ్లాల్సి ఉందన్నారు. ప్రభుత్వం నియమించిన డెడికేటెడ్‌ కమిషన్‌ బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించవచ్చంటూ సిఫారసు చేసిందని, దాని ఆధారంగానే ఎన్నికల ప్రక్రియ కూడా మొదలైందని తెలిపారు. అయితే కోర్టు కేసులతో ఈ ప్రక్రియ అర్ధాంతరంగా నిలిచిపోయిందన్నారు. ఇప్పుడు ఎన్నికలకు వెళ్లాలంటే 50 శాతం మించకుండా రిజర్వేషన్లను అమలు చేయాల్సి ఉంటుందని, అందుకే మరోసారి డెడికేటెడ్‌ కమిషన్‌ నుంచి వివరాలు తెప్పించుకోవాల్సి ఉంటుందని చెప్పారు. గ్రామ పంచాయతీ సర్పంచి, వార్డు సభ్యుల రిజర్వేషన్ల సంఖ్యపై డెడికేటెడ్‌ కమిషన్‌ నుంచి నివేదిక కోరాలని క్యాబినెట్‌ తీర్మానం చేసిందన్నారు. వారం రోజుల్లో ఈ ప్రక్రియను పూర్తి చేసి, క్యాబినెట్‌ ఆమోదం పొందాలని సూచించిందని తెలిపారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై కోర్టు తీర్పులు కొలిక్కి వచ్చాకే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలపై తదుపరి నిర్ణయం తీసుకోవాలని క్యాబినెట్‌ నిర్ణయించిందన్నారు.

గిగ్‌ వర్కర్ల బిల్లుకు ఆమోదం..

రాష్ట్రంలోని గిగ్‌, ప్లాట్‌ఫామ్‌ కార్మికుల సంక్షేమం, భద్రత కోసం తెలంగాణ ప్లాట్‌ఫామ్‌ బేస్డ్‌ గిగ్‌ వర్కర్స్‌ (రిజిస్ట్రేషన్‌, సోషల్‌ సెక్యూరిటీ అండ్‌ వెల్ఫేర్‌) యాక్ట్‌-2025 బిల్లును మంత్రివర్గం ఆమోదించింది. రాష్ట్రంలో దాదాపు 4 లక్షల మంది గిగ్‌ వర్కర్లు, ప్లాట్‌ఫామ్‌ బేస్డ్‌ వర్కర్లు ఉన్నారు. మొబిలిటీ, ఫుడ్‌ డెలివరీ బాయ్స్‌, ఈ-కామర్స్‌, లాజిస్టిక్స్‌ తదితర రంగాల్లో గిగ్‌ వర్కర్లు, ఇళ్లలో పనివాళ్లు కలిపి తెలంగాణలో సుమారు 4 లక్షల మంది పని చేస్తున్నారు. వీరికి ఎలాంటి సెలవులు లేకపోగా రోజుకు 10 నుంచి 12 గంటలు పని చేయాల్సి వస్తోంది. ఈ గిగ్‌ వర్కర్లకు ఉద్యోగ భద్రత, బీమా సౌకర్యం, వేతనాల చెల్లింపుల విషయంలో స్పష్టమైన విధానాలు లేవు. గిగ్‌ వర్కర్ల సంక్షేమం, భద్రతకు ప్రత్యేక చట్టం తీసుకువస్తామని ఎన్నికల మేనిఫెస్టోలోనే కాంగ్రెస్‌ పార్టీ ప్రకటించింది. వారితో పలుమార్లు సంప్రదింపులు జరిపి గిగ్‌ వర్కర్ల సంక్షేమానికి ఈ బిల్లును తీసుకొచ్చింది. త్వరలోనే బిల్లును అసెంబ్లీలో ప్రవేశపెట్టి, చట్టం రూపంలో తెస్తామని కార్మిక, ఉపాధి కల్పన శాఖ మంత్రి జి.వివేక్‌ వెంకటస్వామి తెలిపారు. కొత్త చట్టం ద్వారా గిగ్‌ వర్కర్లకు చట్టబద్ధమైన గుర్తింపు, సామాజిక భద్రత లభిస్తాయి. వీరందరి సంక్షేమానికి ప్రత్యేకంగా బోర్డును ఏర్పాటు చేసి హక్కులకు రక్షణ కల్పిస్తుంది. గిగ్‌ వర్కర్లు రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. వారికి చట్టబద్ధంగా లభించాల్సిన అన్ని అంశాలకు ప్రభుత్వం బాధ్యత వహిస్తుంది.


క్యాబినెట్‌ భేటీ ఇతర నిర్ణయాలుఎస్సారెస్పీ ఫేజ్‌-2 మెయిన్‌ కెనాల్‌కు మాజీ మంత్రి దివంగత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి పేరు పెట్టేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఔటర్‌ రింగ్‌ రోడ్‌ (ఓఆర్‌ఆర్‌) లోపల ఉన్న ఇండస్ర్టియల్‌ ల్యాండ్‌ను మల్టీ యూజ్‌ జోన్స్‌గా మార్చేందుకు రూపొందించిన ‘హైదరాబాద్‌ ఇండస్ర్టియల్‌ ల్యాండ్స్‌ ట్రాన్స్ఫర్మేషన్‌ పాలసీ(హెచ్‌ఐఎల్‌టీపీ)’ని క్యాబినెట్‌ ఆమోదించింది. ప్రజా ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న సందర్భంగా డిసెంబరు 8, 9 తేదీల్లో ఫ్యూచర్‌ సిటీలో ‘తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌-2025’ను నిర్వహించేందుకు క్యాబినెట్‌ ఆమోదం తెలిపింది. రెండేళ్లలో ప్రజా ప్రభుత్వం అందించిన సంక్షేమ పథకాలు, సాధించిన విజయాలను గ్లోబల్‌ సమ్మిట్‌ వేదికగా 8న ప్రజలకు వివరించే కార్యక్రమాలు ఉంటాయి. 9న ‘తెలంగాణ రైజింగ్‌-2047’ విజన్‌ డాక్యుమెంట్‌ను ఆవిష్కరించాలని క్యాబినెట్‌ నిర్ణయించింది.

ప్రతి పాఠ్యపుస్తకంలో ‘జయజయహే తెలంగాణ’ గీతం

అందెశ్రీ రచించిన రాష్ట్ర గీతం ‘జయ జయహే తెలంగాణ’ను ప్రతి పాఠ్యపుస్తకంలో మొదటి పేజీలో ప్రచురించాలని క్యాబినెట్‌ నిర్ణయించిందని మంత్రి పొంగులేటి తెలిపారు. అందెశ్రీ ఇటీవలే కానరాని లోకాలకు వెళ్లారని, ఆ కుటుంబానికి ఈ రాష్ట్రం, ప్రభుత్వం, ప్రజలు రుణపడి ఉన్నారని చెప్పారు. అందుకే అందెశ్రీ కుమారుడు దత్తసాయికి డిగ్రీ కాలేజీ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించామన్నారు. అంతేకాకుండా.. తెలంగాణ ఉద్యమంలో అందెశ్రీ పాత్రను భావి తరాలకు తెలియజేసేలా రాష్ట్రంలో అందెశ్రీ స్మృతివనం ఏర్పాటుకు క్యాబినెట్‌ నిర్ణయం తీసుకుందన్నారు.


ఇద్దరి కన్నా ఎక్కువ సంతానం ఉన్నా.. పోటీ చేయొచ్చు

స్థానిక సంస్థల ఎన్నికల్లో ఇకపై ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన వారు కూడా పోటీ చేయవచ్చు. ఇందుకు అనుమతిస్తూ రాష్ట్రప్రభుత్వం సోమవారం గెజిట్‌ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. కుటుంబ నియంత్రణ చర్యల్లో భాగంగా ఇద్దరి కంటే ఎక్కువ సంతానం కలిగిన వ్యక్తులు పంచాయతీరాజ్‌ సంస్థలు, పురపాలక సంఘాల ఎన్నికల్లో పోటీకి అనర్హులుగా పేర్కొంటూ ఉమ్మడి రాష్ట్రంలో చేసిన చట్టం 1995 మే 31 నుంచి అమల్లో ఉంది. అయితే ఈ నిబంధనను ఎత్తేయాలని అక్టోబరులో జరిగిన మంత్రివర్గ సమావేశంలో తీర్మానించారు. రాష్ట్ర ప్రభుత్వం పంచాయతీరాజ్‌ చట్టం-2018, పురపాలక చట్టం-2019లను సవరిస్తూ ఆర్డినెన్స్‌ ద్వారా గవర్నర్‌ ఆమోదం పొందాలని ఇందులో నిర్ణయించారు. ఈ మేరకు గ్రామపంచాయతీ, ఎంపీటీసీ, జడ్పీటీసీ, నగరపాలక, పురపాలక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనుమతిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌కు గవర్నర్‌ జిష్ణుదేవ్‌ వర్మ ఇటీవలే ఆమోదం తెలిపారు. దీని ఆధారంగా ప్రభుత్వం తాజాగా గెజిట్‌ విడుదల చేసింది.

Updated Date - Nov 18 , 2025 | 05:50 AM