Share News

Telangana Cabinet Approves New DISCOM: ప్రభుత్వ పథకాలకు ఓ డిస్కమ్‌!

ABN , Publish Date - Nov 26 , 2025 | 04:55 AM

రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్తు పంపిణీ సంస్థ డిస్కమ్‌ ఏర్పాటు కానుంది. ఉచిత కరెంటు అం దించే వ్యవసాయ కనెక్షన్లతోపాటు వివిధ ప్రభుత్వ పథకాలకు చెందిన కనెక్షన్లకు విద్యుత్తు సరఫరా బా ధ్యతను చూసేందుకుగాను ప్రత్యేకంగా డిస్కమ్‌ను ఏర్పాటు...

Telangana Cabinet Approves New DISCOM: ప్రభుత్వ పథకాలకు ఓ డిస్కమ్‌!

  • కొత్త డిస్కమ్‌ ఏర్పాటుకు మంత్రివర్గం నిర్ణయం

  • వ్యవసాయ పంపుసెట్లు, ఎత్తిపోతలపథకాలు, నీటిపారుదల ప్రాజెక్టుల కనెక్షన్లన్నీ దీని పరిధిలోకే

  • 10వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీలో పెట్టుబడులకు ఆహ్వానం

  • క్యాబినెట్‌ భేటీలో నిర్ణయాలు వెల్లడించిన మంత్రి శ్రీధర్‌బాబు

హైదరాబాద్‌, నవంబరు 25 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో కొత్తగా మరో విద్యుత్తు పంపిణీ సంస్థ (డిస్కమ్‌) ఏర్పాటు కానుంది. ఉచిత కరెంటు అం దించే వ్యవసాయ కనెక్షన్లతోపాటు వివిధ ప్రభుత్వ పథకాలకు చెందిన కనెక్షన్లకు విద్యుత్తు సరఫరా బా ధ్యతను చూసేందుకుగాను ప్రత్యేకంగా డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని సర్కారు నిర్ణయించింది. వ్యవసాయ పంపుసెట్లు, ఎత్తిపోతల పథకాలు, హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ సీవరేజీ బోర్డు, మిషన్‌ భగీరథ, గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ కనెక్షన్లను ఈ డిస్కమ్‌ పర్యవేక్షించనుంది. ప్రస్తుతం రాష్ట్రంలో ఉన్న టీజీఎస్పీడీసీఎల్‌ (దక్షిణ డిస్కమ్‌-హైదరాబాద్‌), టీజీఎన్పీడీసీఎల్‌(ఉత్తర డిస్కమ్‌-వరంగల్‌)కు అదనంగా మూడో డిస్కమ్‌ రానుంది. మంగళవారం సచివాలయంలో సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో మూడో డిస్కమ్‌పై చర్చించి నిర్ణయం తీసుకున్నారు. ఆ వివరాలను పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్‌బా బు.. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రు లు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌తో కలిసి వెల్లడించారు. 28,89,921 వ్యవసాయ పంపుసెట్లు, 429 దాకా ఉన్న ఎత్తిపోతల పథకాల కనెక్షన్లు, వాటర్‌ బోర్డుకు చెందిన 60 కనెక్షన్లు, మిషన్‌ భగీరథ/గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థకు చెందిన 276 కనెక్షన్లు కలుపుకొని 28,90,686 కనెక్షన్లతో ఈ డిస్కమ్‌ ఏర్పాటు కానుందన్నారు. రానున్న పదేళ్లలో విద్యుత్‌ డిమాండ్‌, ఉత్పత్తిపై ఇంధన శాఖ అధికారులు ఇచ్చి న పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ను మంత్రివర్గం పరిశీలించిందని శ్రీధర్‌బాబు చెప్పారు. ఆపై.. వచ్చే ఐదేళ్ల కోసం 3వేల మెగావాట్ల సౌరవిద్యుత్‌, 2వేల మెగావాట్ల పంప్డ్‌ స్టోరేజీ జలవిద్యుత్‌ అందించే సంస్థల నుంచి విద్యుత్‌ సరఫరా కోసం టెండర్లు పి లవాలని నిర్ణయించినట్లు తెలిపారు. రాష్ట్రంలో మరో 10వేల మెగావాట్ల పంప్డ్‌స్టోరేజీ జలవిద్యుత్‌ కేంద్రం ఏర్పాటుకు అనుకూలత ఉండటంతో ఆ రంగంలో పెట్టుబడులను ఆహ్వానించాలని నిర్ణయం తీసుకున్న ట్లు పేర్కొన్నారు. ఇందుకు అవసరమైన భూమిని.. ఆ కేంద్రం నుంచి డిస్కమ్‌లకు కరెంట్‌ సరఫరా చేయాలనే షరతుతో ఇవ్వాలని నిర్ణయించామన్నారు.


పెట్టుబడులకు ఆహ్వానం..

రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు వీలుగా కొత్త పరిశ్రమలు పెట్టేవారికి సౌరవిద్యుత్‌లో క్యాప్టివ్‌ ప్లాంట్లు పెట్టుకోవడానికి అనుమతినివ్వాలని మంత్రివర్గం సమావేశం నిర్ణయించినట్లు శ్రీధర్‌బాబు తెలిపారు. పరిశ్రమలు తమ విద్యుత్‌ అవసరాలను క్యాప్టివ్‌ ప్లాంట్లతో తీర్చుకోవడానికి అవకాశం ఇస్తామన్నారు. ఈ ప్లాంట్లతో విద్యుత్‌ ఉత్పత్తిపై ఎలాంటి గరిష్ఠ పరిమితి ఉండదన్నారు. రామగుండంలోని జెన్‌కోకు చెందిన థర్మల్‌ ప్లాంట్‌ స్థలంలో కొత్తగా 800 మెగావాట్ల పవర్‌ ప్లాంట్‌ ఏర్పాటుకు అనుమతినివ్వాలని నిర్ణయించామన్నారు. ఎన్‌టీపీసీ, తెలంగాణ జెన్‌కోల్లో తక్కువ ధరకు కరెంట్‌ అందించే/తక్కువ వ్యయంతో నిర్మాణం చేసేవారికే ఈ ప్లాంట్‌ నిర్మించే అవకాశం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక భద్రాద్రి కొత్తగూడెంలోని పాల్వంచతోపాటు నారాయణపేట జిల్లాలోని మక్తల్‌లో ఎన్‌టీపీసీ ఆధ్వర్యంలో విద్యుత్‌ ప్లాంట్‌ నిర్మాణానికి అవకాశాలను పరిశీలించాలని ఇంధన శాఖను మంత్రివర్గం ఆదేశించిందన్నారు. రామగుండంలో ఎన్‌టీపీసీ నిర్మించదలిచిన 4వేల మెగావాట్లలో 2400 మెగావాట్ల కరెంట్‌ వద్దని తాము లేఖ రాయలేదని మంత్రి చెప్పారు. ఆ లేఖ రాసిన వారినే అడగాలని ఓ ప్రశ్నకు సమాధానంగా బదులిచ్చారు. రెప్పపాటు కూడా కరెంట్‌ పోకుండా అందించడానికే ఈ నిర్ణయాలు తీసుకున్నామన్నారు. మొత్తం విద్యుత్‌లో 40ు వాటా థర్మల్‌ ఉండేలా చూస్తున్నామన్నారు. దీనికోసం సంప్రదాయేతర ఇంధన వనరులకు ప్రాధాన్యం ఇస్తున్నామని, పవన, జలవిద్యుత్‌ కేంద్రాలు పెడతామని అన్నారు. రామగుండంలో ప్రస్తుతం సబ్‌ క్రిటికల్‌ ప్లాంట్‌ ఉండగా.. దాని స్థానంలో సూపర్‌ క్రిటికల్‌ ప్లాంట్లు పెట్టాలనే నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. ఇక ఇప్పటిదాకా కరెంట్‌ చార్జీలు పెంచలేదని, అలాంటి చర్చ ఏదీ క్యాబినెట్‌లో రాలేదని ఆయన తెలిపారు.

బెంగళూరు తరహాలో భూగర్భ కేబుల్‌ వ్యవస్థ..

బెంగళూరు తరహాలో హైదరాబాద్‌లోనూ భూగర్భ కేబుల్‌ వ్యవస్థ నిర్మాణానికి క్యాబినెట్‌ ఆమోదం తెలిపిందని మంత్రి శ్రీధర్‌బాబు వెల్లడించారు. నగరంలోని విద్యుత్‌ సరఫరా వ్యవస్థకు చెందిన సర్కిళ్లను మూడు భాగాలుగా విభజించి.. విద్యుత్‌ కేబుళ్లతోపాటు ఇంటర్నెట్‌ కేబుళ్లను కలిపి వ్యవస్థ ఉండేలా వర్కింగ్‌ ప్లాన్‌ను సిద్ధం చేయాలని అధికారులను మంత్రివర్గం ఆదేశించిందన్నారు. దీనికి రూ.14,725 కోట్లు అవుతాయని లెక్కగట్టినట్లు తెలిపారు. ఇక భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో దుమ్ముగూడెం మండలంలోని పెద్ద నల్లబెల్లి గ్రామంలో ఎస్సీ, ఎస్టీ, బీసీ యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ స్కూల్‌కు 20.28 ఎకరాల భూమిని కేటాయించేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపిందని ప్రకటించారు. ములుగు జిల్లా ములుగు మండలంలోని జగ్గన్నపేట గ్రామంలో 40 ఎకరాల విస్తీర్ణంలో స్పోర్ట్స్‌ స్కూల్‌ ఏర్పాటుకూ ప్రభుత్వ భూమిని కేటాయించాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో 65 ఐటీఐలను అడ్వాన్స్‌డ్‌ టెక్నాలజీ సెంటర్లు(ఏటీసీ)లుగా మార్చాలని నిర్ణయించామన్నారు. మరిన్ని ఏటీసీలను మంజూరు చేస్తామని, కొత్తగా జూబ్లీహిల్స్‌లో ఏటీసీని ఏర్పాటు చేస్తామని ఆయన ప్రకటించారు.

Updated Date - Nov 26 , 2025 | 04:55 AM