Srisailam elevated corridor: శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్..వ్యయంలో 50శాతం రాష్ట్రవాటా
ABN , Publish Date - Oct 17 , 2025 | 02:48 AM
తెలంగాణ నుంచి శ్రీశైలం మార్గంలోని అభయారణ్యంలో తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ వ్యయంలో సగం ఖర్చును భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది...
ఆమోదం తెలిపిన రాష్ట్ర మంత్రివర్గం
నిధుల రూపంలో 33 శాతం, నిర్మాణ సామగ్రి పన్నుల రద్దు రూపంలో 17ు వ్యయం
మిగతా వ్యయం భరించనున్న కేంద్రం
త్వరలోనే అనుమతులు వచ్చే చాన్స్
‘ఎలివేటెడ్ కారిడార్’పై ముందే చెప్పిన ‘ఆంధ్రజ్యోతి’
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ నుంచి శ్రీశైలం మార్గంలోని అభయారణ్యంలో తలపెట్టిన ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణ వ్యయంలో సగం ఖర్చును భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. గురువారం జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో దీనికి ఆమోదం లభించింది. తెలంగాణ నుంచి శ్రీశైలంతోపాటు ఏపీలోని పలుప్రాంతాలు వెళ్లేందుకు ప్రస్తుతమున్న ఇబ్బందులను తొలగించేలా రూ.7,700 కోట్లతో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. నాగర్‌కర్నూల్ జిల్లాలోని మన్ననూర్ చెక్‌పోస్టుకు కొంచెం ముందు బ్రాహ్మణపల్లి వద్ద ప్రారంభమై ఈగలపెంట తరువాత ఈ కారిడార్ ముగుస్తుంది. మొత్తం మార్గం 54 కిలోమీటర్లుకాగా, అందులో ఎలివేటెడ్ విభాగం 45.42 కిలోమీటర్లు ఉంటుంది. జాతీయ రహదారి కింద దీని నిర్మాణం చేపట్టాలని కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదించగా.. అది అంత లాభదాయకం కాకపోవచ్చని కేంద్రం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఈ క్రమంలో సగం నిధులు భరించేందుకు రాష్ట్రం సిద్ధమైంది. ఈ 50శాతంలో 33శాతం మేర అంటే సుమారు రూ.2,541కోట్లను నేరుగా, మరో 17శాతం వాటాను ప్రాజెక్టు నిర్మాణ సామాగ్రి, ఇతర అంశాల్లో పన్ను మినహాయింపు కింద భరించనుంది. సగం వాటా రాష్ట్రం భరిస్తుండటంతో ఎలివేటెడ్ కారిడార్‌కు త్వరలోనే కేంద్ర అనుమతి వచ్చే అవకాశం ఉందని అధికార వర్గాలు చెబుతున్నాయి. శ్రీశైలం మార్గంలో ఎలివేటెడ్ కారిడార్ నిర్మించనున్నారని, సగం ఖర్చు భరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమవుతోందని ఆంధ్రజ్యోతి సెప్టెంబరు 25వ తేదీనే కథనం ప్రచురించింది.
కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు స్థలాలు ఇవ్వాలి!
రాష్ట్రంలో జిల్లాల వారీగా కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలకు కొత్త భవనాల నిర్మాణం కోసం స్థలాలు కేటాయించాలని కేబినెట్‌భేటీలో పలువురు మంత్రు లు కోరినట్టు తెలిసింది. ముఖ్యంగా కొత్త జిల్లాల్లో పార్టీ కార్యాలయాలు సరిగా లేవని, దీనిపై నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేసినట్టు సమాచారం. దీనితో ప్రభుత్వ నిబంధనలకు లోబడి స్థలాల కేటాయింపునకు ఉన్న అవకాశాలను పరిశీలించాలని రెవెన్యూ మంత్రికి సీఎం సూచించినట్టు తెలిసింది.