Telangana Builds Home Away from Home: ఈశాన్య రాష్ట్రాలకు తెలంగాణ మరో ఇల్లు
ABN , Publish Date - Nov 21 , 2025 | 04:54 AM
ఈశాన్య రాష్ట్రాలకు, తెలంగాణ మరో ఇల్లులాంటిద ని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారని..
అక్కడి ప్రజలు హైదరాబాద్‌లో పెద్ద సంఖ్యలో ఉన్నారు
ఫ్యూచర్ సిటీలో ‘నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రానికి’ భూ కేటాయింపు
తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్ టెక్నో-కల్చరల్ ఫెస్టివల్‌లో సీఎం రేవంత్
హైదరాబాద్, నవంబరు 20(ఆంధ్రజ్యోతి): ఈశాన్య రాష్ట్రాలకు, తెలంగాణ మరో ఇల్లులాంటిద ని సీఎం రేవంత్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చిన వారు పెద్ద సంఖ్యలో ఉన్నారని.. ఔషధ, ఆరోగ్య, పర్యాటక, సాఫ్ట్‌వేర్ క్రీడలు తదితర రంగాల్లో వారు సక్సెస్ సాధించారని చెప్పారు. తెలంగాణ సమాజంతో కలిసిపోయి, ఇక్కడ అభివృద్థికి తోడ్పడుతున్నారంటూ ఈశాన్య రాష్ట్రాలకు చెందిన ప్రజలకు సీఎం ధన్యవాదాలు తెలిపారు 1970, 1980ల్లో ఉత్తరాది వారు మన దక్షిణాది వాళ్లందరినీ ‘మదరాసీలు’ అని పిలిచేవారని, తెలుగువారికంటూ ఒక ప్రత్యేక గుర్తింపు ఉండేది కాదని.. అలాగే ఈశాన్య రాష్ట్రాల పౌరులకూ ప్రాంతీయ గుర్తింపు లేదని, వారి బాధను తెలుగు ప్రజలు అర్థం చేసుకోగలరని పేర్కొన్నారు. గురువారం హైదరాబాద్‌లోని హైటెక్స్‌లో జరిగిన తెలంగాణ-నార్త్ ఈస్ట్ కనెక్ట్’’ టెక్నో-కల్చరల్ ఫెస్టివల్‌లో రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగించారు. ఈ ఉత్సవం తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య గల ఐక్యతా స్ఫూర్తిని చాటుతోందని పేర్కొన్నారు. మనదేశంలో ఈశాన్య ప్రాంతం ఎంతో అందమైనదని, విభిన్నమైనదని, పర్యావరణ సంపదతో పాటు సాంస్కృతిక చైతన్యం కలిగిన ప్రాంతమని కొనియాడారు. ఇప్పటికీ ఈశాన్య రాష్ట్రాల్లో వెలుగులోకి రాని అంశాలు చాలా ఉన్నాయన్నారు. ఈశాన్య రాష్ట్రాల ప్రజలను, వారి సంస్కృతిని దక్షిణాదివారిగా మనం మరింత బాగా అర్థం చేసుకోవాలని, వారితో కనెక్టివిటీ పెంచుకోవాలని అభిప్రాయపడ్డారు. తమ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో, భారతదేశపు మొట్టమొదటి ‘నార్త్ ఈస్ట్ అనుబంధ కేంద్రాన్ని’ నిర్మించడానికి భూమి కేటాయిస్తామని సీఎం ప్రకటించారు. ఈ అనుబంధ కేంద్రంలో ప్రతి ఈశాన్య రాష్ట్రం వారి సొంత భవనాలను నిర్మించుకోవడానికి వెసులుబాటు కల్పిస్తామన్నారు.
అసోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్, మేఘాలయ, మిజోరం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర రాష్ట్రాలకు వారి వారి ప్రత్యేక భవనంతో పాటు హాస్టల్ సౌకర్యం, ఆహారం, చేతివృత్తులు, సంస్కృతులు, కళల ప్రదర్శనకు వేదికలు ఉంటాయన్నారు. ‘‘తెలంగాణ సోదరుడు త్రిపుర గవర్నర్‌గా పనిచేస్తుంటే.. త్రిపుర సోదరుడు తెలంగాణ గవర్నర్‌గా పనిచేస్తున్నారని.. త్రిపుర, తెలంగాణ మధ్య ఈ అనుబంధం ఇలాగే కొనసాగాలి’’ అని ఆకాంక్షించారు. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ మాట్లాడుతూ.. ఈ ఉత్సవాన్ని జ్ఞానం, విజ్ఞానంతో ముందుకెళ్లాలనే తలంపుతో ప్రారంభించినట్లు చెప్పారు. ఉత్సవ లోగోలో కూడా పుష్పం చుట్టూ ఉండే 9 రేకులలో 8 ఈశాన్య రాష్ట్రాలను సూచిస్తే.. 9వది తెలంగాణను సూచిస్తోందని పేర్కొన్నారు. త్రిపుర గవర్నర్ నల్లు ఇంద్రసేనారెడ్డి మాట్లాడుతూ.. గతంలో ఈశాన్య రాష్ట్రాల్లో ఉండే ప్రాంతాలను వెనకబడిన ప్రాంతాలుగా చెప్పేవారని.. ఆ ప్రాంతాల్లో ఉండేవారు తామంతా వేరే దేశస్తులమని భావించేవారని, ఇప్పుడు పరిస్థితి మారిందని.. భారత భూభాగమంతా తమదేశం, తమ ప్రాంతంగా అక్కడి ప్రజలు భావిస్తున్నారని వివరించారు. రానున్న రోజులలో త్రిపుర ఈశాన్య ప్రాంతాలకే కాకుండా.. ఈశాన్య ఆసియా దేశాలకు కూడా గేట్‌వేగా మారనుందన్నారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి, పొంగులేటి, పొన్నం, సీతక్క, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావుు. డీజీపీ శివధర్‌రెడ్డి, ఈశాన్య ప్రాంతాల ప్రముఖులు పాల్గొన్నారు.