Share News

Heavy Rainfall: నేటి నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు

ABN , Publish Date - Sep 14 , 2025 | 05:15 AM

రాష్ట్రంలో ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది....

Heavy Rainfall: నేటి నుంచి 4 రోజుల పాటు భారీ వర్షాలు

  • నేడు పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌

  • ములుగు జిల్లా వెంకటాపురంలో 10.6 సెంటీమీటర్ల వాన

(ఆంధ్రజ్యోతి న్యూస్‌నెట్‌వర్క్‌): రాష్ట్రంలో ఆదివారం నుంచి నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆదివారం సిరిసిల్ల, కరీంనగర్‌, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, కామారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. ఈ జిల్లాలకు ఆరెంజ్‌ అలెర్ట్‌ జారీ చేసింది. మిగిలిన అన్ని జిల్లాల్లోనూ ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురుస్తాయని పేర్కొంది. శనివారం రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌తో పాటు పలు జిల్లాల్లో వానలు కురిశాయి. కొన్ని చోట్ల భారీ వర్షాలు పడగా.. పలుచోట్ల ముసురు పడింది. అత్యధికంగా ములుగు జిల్లా వెంకటాపురంలో 10.6 సెంటీమీటర్ల వర్షం కురిసింది. ఉమ్మడి ఖమ్మం, ములుగు జిల్లాల్లో వర్ష ప్రభావం ఎక్కువగా ఉంది. దీంతో అక్కడక్కడ లోతట్టు ప్రాంతాలు జలమయమవ్వగా.. చెరువులు, వాగులు పొంగి పొర్లాయి. కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేట మండలంలోని కావడిగుండ్ల-గోపన్నగూడెం మధ్యన వాగులో ఏపీకి చెందిన ఇద్దరు మహిళా కూలీలు కొట్టుకుపోయి మృతి చెందారు. కావడిగుండ్లకు కూలీ పనుల నిమిత్తం వచ్చిన ఏలూరు జిల్లా పూచికపాడుకు చెందిన పచ్చిశాల వరలక్ష్మి (52), పాలడుగుల చెన్నమ్మ (50) వాగు దాటుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయి ప్రాణాలు కోల్పోయారు.

సాగర్‌ 26 గేట్ల నుంచి నీటి విడుదల..

నాగార్జునసాగర్‌ ప్రాజెక్టుకు ఎగువ నుంచి వరద పెరగటంతో 26 గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌కు ఎగువ నుంచి 2.74 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. అంతే మొత్తంలో గేట్లు, విద్యుదుత్పత్తి, కాలువల ద్వారా విడుదల చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టుకు 2.76 లక్షల క్యూసెక్కులు వస్తుండగా.. గేట్లు, విద్యుదుత్పత్తి, కాలువల ద్వారా 2.82 లక్షల క్యూసెక్కులను వదులుతున్నారు. ఎగువన ఉన్న జూరాల ప్రాజెక్టుకు 1.57 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండగా.. 1.63 లక్షల క్యూసెక్కులను కిందకు విడుస్తున్నారు.

Updated Date - Sep 14 , 2025 | 06:51 AM