Share News

CM Revanth Reddy: చైనా ప్లస్‌ 1 వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ఎంపిక

ABN , Publish Date - Oct 10 , 2025 | 04:42 AM

పాలకులు మారినప్పుడల్లా ప్రభుత్వ విధానాలు కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఉత్తమమైన...

CM Revanth Reddy: చైనా ప్లస్‌ 1 వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ఎంపిక

  • న్యూయార్క్‌, టోక్యో, సియోల్‌తో రాజధాని నగరం హైదరాబాద్‌ పోటీ

  • ఫార్చ్యూన్‌ 500 కంపెనీలన్నీ హైదరాబాద్‌లో పెట్టుబడులు పెట్టాలి

  • పాలకులు మారితే విధానాలు మార్చుకోవాల్సిన అవసరం లేదు: సీఎం

  • హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ప్రతినిధులతో భేటీ

హైదరాబాద్‌, అక్టోబరు 9 (ఆంధ్రజ్యోతి): పాలకులు మారినప్పుడల్లా ప్రభుత్వ విధానాలు కూడా మార్చుకోవాల్సిన అవసరం లేదని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. రాష్ట్ర అభివృద్ధి విషయంలో ఉత్తమమైన విధానాలను తమ ప్రభుత్వం ఇప్పటికీ కొనసాగిస్తోందని ఆయన స్పష్టం చేశారు. అమెరికాలోని హడ్సన్‌ ఇన్‌స్టిట్యూట్‌కు చెందిన 16 మంది ప్రతినిధులతో గురువారం ఆయన సచివాలయంలో సమావేశమయ్యారు. వివిధ రంగాలకు చెందిన మేధావులు, బిజినెస్‌ లీడర్లు ఈ బృందంలో ఉన్నారు. ఇండియా ఫౌండేషన్‌ సారథ్యంలో, భారత్‌ అమెరికా మధ్య ద్వైపాక్షిక సంబంధాలు, వ్యాపార వాణిజ్య వ్యవహారాలు, విధానాలపై ఈ బృందం దేశంలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి అభిప్రాయాలను స్వీకరిస్తోంది. ఈ సందర్భంగా సీఎం రేవంత్‌ రెడ్డి మాట్లాడుతూ.. అమెరికా తీసుకునే నిర్ణయాలు, అనుసరించే విధానాలన్నీ సానుకూల దృక్పథంతో, ఇండో-యూఎస్‌ సంబంధాలను మరింత పెంపొందించేలా ఉండాలని ఆకాంక్షించారు. హెచ్‌1-బీ వీసాలపై అమెరికా విధించిన కఠిన నిబంధనలపైన, సుంకాల పెంపుపైన సీఎం ఆందోళన వ్యక్తంచేశారు. ఇలాంటి నిర్ణయాలు ఆర్థిక వ్యవస్థను ప్రభావం చే యడంతో పాటు అస్థిరతకు, అపార్థానికి దారి తీస్తాయన్నారు. ఇరు దేశాల మధ్య ఆర్థిక వృద్ధికి దోహదపడే విధానాలు అనుసరిస్తే ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉంటుందన్నారు. అలాగే.. చైనా+1 (చైనాతోపాటు మరో దేశంలో ఉత్పత్తి కేంద్రాన్ని ప్రారంభించే) వ్యూహానికి తెలంగాణ అత్యుత్తమ ఎంపికగా నిలుస్తుందని రేవంత్‌ పేర్కొన్నారు. దానికోసం భవిష్యత్తు ప్రణాళికలను తమ ప్రభుత్వం రూపొందిస్తోందన్న ఆయన.. ఐటీ, ఫార్మా రంగాల పెట్టుబడులకు గమ్యస్థానంగా, ప్రపంచ నగరంగా ఇప్పటికే హైదరాబాద్‌ అందరినీ ఆకర్షిస్తోందన్నారు. అందుకే దేశ, విదేశాల నుంచి పెట్టుబడులు పెట్టేందుకు ప్రపంచ దిగ్గజ కంపెనీలు ఇక్కడికి వస్తున్నాయని చెప్పారు. హైదరాబాద్‌ ఇప్పుడు న్యూయార్క్‌, టోక్యో, సియోల్‌తో పోటీ పడుతోందన్నారు. 2034 నాటికి ఒక ట్రిలియన్‌ డాలర్లు, 2047 నాటికి 3 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అవతరించాలని తమ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుందని.. అందులో భాగంగానే హైదరాబాద్‌లో గేమ్‌-చేంజర్‌గా నిలిచే ప్రాజెక్టులను చేపడుతున్నామని వెల్లడించారు. భారత్‌ ఫ్యూచర్‌ సిటీతో పాటు రీజినల్‌ రింగ్‌రోడ్‌, రీజినల్‌ రింగ్‌ రైల్‌, డ్రై పోర్ట్‌, మాన్యుఫాక్చర్‌ జోన్లను అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. 30 వేల ఎకరాల్లో నిర్మిస్తున్న భారత్‌ ఫ్యూచర్‌సిటీలో అమెరికా పరిశ్రమల భాగస్వామ్యాన్ని, మద్దతును ఆహ్వానిస్తున్నామన్నారు. ఇప్పటికే ఫార్చ్యూన్‌ 500 కంపెనీల్లో 50 కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయని.. మొత్తం 500 కంపెనీలు ఫ్యూచర్‌సిటీలో పెట్టుబడులు పెట్టేందుకు రావాలని ఆకాంక్షించారు. ఇక.. హైదరాబాద్‌లో ఏఐ సిటీతో పాటు, ఏఐ వర్సిటీని ఏర్పాటు చేసే ఆలోచన ఉందని మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. ఏఐ రంగంలో రాష్ట్రాన్ని దేశానికే రాజధానిగా తీర్చిదిద్దేలా చర్యలు చేపడుతున్నామన్నారు.

Updated Date - Oct 10 , 2025 | 04:42 AM