Share News

Panchayat Elections: నేటి నుంచి ఓటర్ల జాబితాసవరణ

ABN , Publish Date - Nov 20 , 2025 | 06:00 AM

పంచాయతీ ఎన్నికల సమరానికి ఈ నెలలోనే షెడ్యూల్‌ జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 26న షెడ్యూలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం నోటిఫికేషన్‌ విడుదల, నామినేషన్ల ప్రక్రియ పూర్తయి డిసెంబరు రెండో వారంలో పోలింగ్‌ జరుగుతుందని అంచనా....

Panchayat Elections: నేటి నుంచి ఓటర్ల జాబితాసవరణ

  • 23న తుది జాబితా ప్రకటన

  • షెడ్యూల్‌ జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల కమిషన్‌

  • 26న పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ విడుదల?

  • వచ్చేనెల రెండో వారంలో పోలింగ్‌!

  • రెండు దశల్లోనే ఎన్నికలు ఉండే అవకాశం

  • ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎ్‌సల నియామకం

  • నేడు జిల్లా కలెక్టర్లు, పోలీసు అధికారులతో.. రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ వీడియో కాన్ఫరెన్స్‌

  • మొదటి వారంలో జిల్లాల పర్యటనకు సీఎం!

హైదరాబాద్‌, నవంబరు 19, (ఆంధ్రజ్యోతి): పంచాయతీ ఎన్నికల సమరానికి ఈ నెలలోనే షెడ్యూల్‌ జారీ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈ నెల 26న షెడ్యూలు విడుదల కానున్నట్లు తెలుస్తోంది. అనంతరం నోటిఫికేషన్‌ విడుదల, నామినేషన్ల ప్రక్రియ పూర్తయి డిసెంబరు రెండో వారంలో పోలింగ్‌ జరుగుతుందని అంచనా. దీనికి అనుగుణంగానే రాష్ట్ర ఎన్నికల సంఘం (ఎస్‌ఈసీ) కసరత్తు ప్రారంభించింది. పంచాయతీలు, వార్డుల వారీగా ఓటరు జాబితాను మరోసారి సవరించేందుకు ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. ఇందుకుగాను గురువారం (ఈ నెల 20) నుంచి 23 వరకు గ్రామాల్లో ఓటరు జాబితాల సవరణ కోసం బుధవారం షెడ్యూల్‌ను ప్రకటించింది. ఈ మేరకు జిల్లా పంచాయతీ అధికారులకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని ఆదేశాలు జారీ చేశారు. ఈ ఆదేశాల ప్రకారం.. గతంలో వెల్లడించిన జాబితాలో నమోదు కాకుండా ఇటీవల కొత్తగా వచ్చిన దరఖాస్తుల పరిశీలన, ఇదివరకు ఉన్నవాటిలో తప్పుల సవరణ, అభ్యంతరాల స్వీకరణనను గురువారం చేపట్టనున్నారు. 21న ఓటరు దరఖాస్తులు, అభ్యంతరాల పరిష్కారం చేపట్టి.. 23న పంచాయతీ, వార్డుల వారీగా తుది ఓటరు జాబితా, పోలింగ్‌ కేంద్రాల ప్రచురణ చేపట్టనున్నట్లు ఎస్‌ఈసీ ఉత్తర్వుల్లో పేర్కొంది. మరోవైపు రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లు, పోలీసు కమిషనర్లు, జిల్లా ఎస్పీలతో రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రాణి కుముదిని గురువారం వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించనున్నారు. ఎన్నికల నేపథ్యంలో స్థానిక పరిస్థితులు, ఎన్నికల సంసిద్ధత, నిర్వహణ కోసం ఏర్పాట్లు వంటి అంశాలపై వారితో చర్చించనున్నారు. దీంతోపాటు తుది ఓటరు జాబితా తయారీ షెడ్యూల్‌, పోలింగ్‌ సిబ్బంది, పోలింగ్‌ కేంద్రాలు, సామగ్రి, జోనల్‌ అధికారులు, పరిశీలకులు, శాంతిభద్రతలు, సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు, మోడల్‌ కోడ్‌ కమిటీ, ఎన్నికల నిర్వహణకు మార్గదర్శకాల రూపకల్పన వంటి అంశాలపైనా చర్చించి నిర్ణయం తీసుకుంటారు. వీడియో కాన్ఫరెన్స్‌లో డీజీపీ శివధర్‌రెడ్డి, పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ శ్రీధర్‌, రాష్ట్రస్థాయి ఉన్నతాధికారులు కూడా పాల్గొనున్నారు.


ఎన్నికల పరిశీలకులుగా ఐఏఎ్‌సలు..

గ్రామ పంచాయతీల ఎన్నికలకు ఎస్‌ఈసీ పరిశీలకులను నియమించింది. అన్ని జిల్లాలకు సాధారణ ఎన్నికల పరిశీలకులు, వ్యయ పరిశీలకులను నియమిస్తూ ఎస్‌ఈసీ కార్యదర్శి మంద మకరంద్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. 31 జిల్లాలకు సాధారణ పరిశీలకులుగా (జనరల్‌ అబ్జర్వర్‌) ఐఏఎస్‌ అధికారులను నియమించారు. జిల్లాల వారీగా బి.బాల మాయాదేవి (వరంగల్‌), భారతి లక్పతి నాయక్‌ (మెదక్‌), ప్రశాంత్‌ జీవన్‌ పాటిల్‌ (రంగారెడ్డి), కొర్ర లక్ష్మి (నల్లగొండ), వాసం వెంకటేశ్వర్‌రెడ్డి (ఖమ్మం), కె.హరిత (సిద్దిపేట), గౌతం పొట్రు (హన్మకొండ), జి.రవి (సూర్యాపేట), కె.నిఖిల (జనగాం), ఆయేషా మసరత్‌ ఖానం (నిర్మల్‌), ఎస్‌కె.యాస్మిన్‌ బాషా (వికారాబాద్‌), హనుమంత్‌ కొండిబా (కామారెడ్డి), పి.ఉదయ్‌కుమార్‌ (సంగారెడ్డి), కోట శ్రీవాత్స (నాగర్‌ కర్నూల్‌), కాత్యాయనీదేవి (మహబూబ్‌నగర్‌), కె.సీతాలక్ష్మి (నారాయణపేట్‌), జి.ఫణీంద్రరెడ్డి (భూపాలపల్లి), చంద్రశేఖర్‌ రెడ్డి (కరీంనగర్‌), పి.గౌతమి (భువనగిరి), ఆర్‌.ఉపేందర్‌ రెడ్డి (ఆదిలాబాద్‌), అనుగు నరసింహారెడ్డి (పెద్దపల్లి), జి.లక్ష్మీబాయి (సిరిసిల్ల), లక్ష్మణుడు (ఆసిఫాబాద్‌), ప్రశాంత్‌ కుమార్‌ (ములుగు), మధుకర్‌ బాబు (మహబూబాబాద్‌), సర్వేశ్వర్‌ రెడ్డి (కొత్తగూడెం), శ్యాంప్రసాద్‌ లాల్‌ (నిజామాబాద్‌), వెంకటేశ్వర్‌ రెడ్డి (జగిత్యాల), మల్లయ్యభట్టు (వనపర్తి), గంగాధర్‌ (మంచిర్యాల), జితేందర్‌ రెడ్డి (గద్వాల) నియమితులయ్యారు.

రెండు దశల్లోనే ఎన్నికలు! (బాక్స్‌)

పంచాయతీ ఎన్నికలను రెండు దశల్లో పూర్తిచేసే అవకాశాలున్నాయి. గతంలో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లతో పంచాయతీ ఎన్నికలకు షెడ్యూల్‌ ఇచ్చినప్పుడు.. మూడు దశల్లో పోలింగ్‌ నిర్వహిస్తామని ఎస్‌ఈసీ పేర్కొంది. అయితే ఈసారి మాత్రం రెండు దశల్లోనే ఎన్నికలు నిర్వహించేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇదిలా ఉండగా.. డిసెంబరు మొదటి వారంలో సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనలకు వెళ్లే అవకాశాలున్నాయి. మహబూబ్‌నగర్‌ జిల్లాతో ప్రారంభించి సిద్దిపేట, భద్రాద్రి కొత్తగూడెం తదితర జిల్లాల్లో సీఎం పర్యటించనున్నారు. అయితే తుది పర్యటన వివరాలు ఇంకా ఖరారు కాలేదు. అదే సమయంలో ప్రభుత్వంలో మరో చర్చ కూడా జరుగుతోంది. ఈ నెలలోనే షెడ్యూలు ప్రకటిస్తే ఆ వెంటనే ఎన్నికల కోడ్‌ అమల్లోకి వచ్చేస్తుంది. దీంతో సీఎం రేవంత్‌రెడ్డి జిల్లాల పర్యటనలు, ఆయా జిల్లాల్లో చేయాలనుకుంటున్న శంకుస్థాపనలకు ఏమైనా ఇబ్బంది అవుతుందా?, అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్బంగా నిర్వహించనున్న కార్యక్రమాలు, ప్రతిష్ఠాత్మక తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు కోడ్‌ అడ్డంకి ఉంటుందా? అన్న కోణంలోనూ ప్రభుత్వంలో చర్చ జరిగింది. అయితే పట్టణ ప్రాంతాల్లో పర్యటనలు పెట్టుకోవచ్చని, తెలంగాణ రైజింగ్‌ గ్లోబల్‌ సమ్మిట్‌కు గ్రామ పంచాయతీల ఎన్నికల కోడ్‌తో ఎలాంటి ఇబ్బంది ఉండదనే అభిప్రాయంతో ఉన్నట్లు తెలిసింది.

Updated Date - Nov 20 , 2025 | 06:00 AM