BC JAC Threatens Nationwide Agitation: బీసీ రిజర్వేషన్ల కోసం దేశాన్ని ఏకం చేస్తాం
ABN , Publish Date - Dec 17 , 2025 | 05:19 AM
బీసీ రిజర్వేషన్లపై కేంద్రప్రభుత్వం సానూకూలంగా స్పందించకపోతే రైతు ఉద్యమాల తరహాలో దేశాన్ని ఒక్కటి చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ బీసీ జేఏసీ హెచ్చరించింది....
మార్చిలో హైదరాబాద్‌లో బీసీ సింహగర్జన సభ
జాతీయ ఓబీసీ సెమినార్‌లో బీసీ జేఏసీ నేతల వెల్లడి
న్యూఢిల్లీ, డిసెంబరు 16(ఆంధ్రజ్యోతి): బీసీ రిజర్వేషన్లపై కేంద్రప్రభుత్వం సానూకూలంగా స్పందించకపోతే రైతు ఉద్యమాల తరహాలో దేశాన్ని ఒక్కటి చేసి ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలంగాణ బీసీ జేఏసీ హెచ్చరించింది. బీసీ రిజర్వేషన్ల కోసం పోరాటం చేస్తున్న అన్ని రాష్ట్రాలను కలుపుకొని దేశవ్యాప్తంగా పోరాటం చేస్తామని తెలిపింది. వచ్చే జనవరిలో దేశవ్యాప్తంగా పర్యటించి బీసీ బిల్లుకు మద్దతు కూడగడతామని, వచ్చే ఫిబ్రవరిలో తెలంగాణలో రాష్ట్రవ్యాప్తంగా బీసీ యాత్ర చేపట్టి, మార్చిలో లక్షలాది మందితో హైదరాబాద్‌లో సింహగర్జన సభను నిర్వహించి బీసీల తడాఖాను ఢిల్లీ పెద్దలకు చూపిస్తామని హెచ్చరించింది. ఢిల్లీలోని తెలంగాణభవన్‌లో తెలంగాణ బీసీ జేఏసీ చైర్మన్ జాజుల శ్రీనివా్‌సగౌడ్ అధ్యక్షతన జాతీయ ఓబీసీ సెమినార్‌ను నిర్వహించారు. సీపీఐ నేత నారాయణ, మాజీ మంత్రి వి.శ్రీనివా్‌సగౌడ్, మాజీ ఎంపీ వి.హనుమంతరావు, బీసీ జేఏసీ సంఘాల నేతలు దీనికి హాజరయ్యారు. జాజుల మాట్లాడుతూ బీసీ రిజర్వేషన్ల పెంపుపై కాంగ్రెస్ పార్లమెంటులో ప్రైవేటు బిల్లును ప్రవేశపెట్టాలని, ఈ బిల్లుకు బీజేపీ మద్దతివ్వాలని డిమాండ్ చేశారు. లేదంటే ఇప్పటికే బీఆర్‌ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర పార్లమెంటులో ప్రవేశపెట్టిన ప్రైవేటు బిల్లుకు కాంగ్రెస్, బీజేపీలు మద్దతు పలకాలన్నారు.