Telangana armed struggle: భూమి కోసం పోరాడేవారు సాయుధ పోరాట వారసులే
ABN , Publish Date - Sep 18 , 2025 | 05:01 AM
భూమి కోసం పోరాడే వారందరూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులేనని సీపీఎం కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు...
బీవీ రాఘవులు
పోరాటచరిత్రను వక్రీకరించడం గర్హనీయం : కూనంనేని
మహత్తర పోరాటానికి మతం రంగు పూయొద్దు: హరగోపాల్
హైదరాబాద్/ హైదరాబాద్ సిటీ/ అబ్దుల్లాపూర్‌మెట్, సెప్టెంబరు 17 (ఆంధ్రజ్యోతి): భూమి కోసం పోరాడే వారందరూ తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారసులేనని సీపీఎం కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యులు బీవీ రాఘవులు అన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట వారోత్సవాల్లో భాగంగా రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ మండలం అనాజ్‌పూర్ గ్రామంలో సీపీఎం ఆధ్వర్యంలో సభ నిర్వహించారు. కార్యక్రమంలో బీవీ రాఘవులు పాల్గొని మాట్లాడుతూ.. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో వందలాది మంది కమ్యూనిస్టులు ప్రాణాలర్పించారని పేర్కొన్నారు. సాయుధ పోరాటం గురించి చెప్పుకొనే హక్కు ఇతర పార్టీలకు లేదన్నారు. అనాజ్‌పూర్ సీలింగ్ పట్టా రైతులకు సీపీఎం అండగా నిలబడుతుందన్నారు. కాగా తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట యోధుల త్యాగాలను, తెలంగాణ ప్రజల పోరాట స్ఫూర్తిని, సమరంలో అసువులు బాసిన అమర వీరుల చరిత్రను బీజేపీ వక్రీకరించడం గర్హనీయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు విమర్శించారు. హైదరాబాద్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో నిర్వహించిన తెలంగాణ విలీన దినోత్సవ వేడుకల సందర్భంగా ఆయన మాట్లాడారు. భూస్వామ్యానికి వ్యతిరేకంగా జరిగిన మహోన్నత పోరాటాన్ని మత ఘర్షణగా బీజేపీ దుష్ప్రచారం చేస్తోందని ప్రముఖ సామాజికవేత్త ఆచార్య హరగోపాల్ విమర్శించారు. సీపీఐ రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం 77 వసంతాల వారోత్సవాల ముగింపు సభ జూబ్లీహిల్స్‌లోని రావి నారాయణ రెడ్డి ఆడిటోరియంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య వక్తగా హాజరైన హరగోపాల్ మాట్లాడుతూ.. రైతాంగ సాయుధ పోరాటంతో సంబంధం లేని బీజేపీ వేడుకలు చేయడం, అందులో రక్షణ శాఖ మంత్రి పాల్గొనడం ఎంతవరకు సమర్థనీయమని ప్రశ్నించారు. ఎమ్మెల్యే కూనంనేని అధ్యక్షతన జరిగిన సభలో ఏపీ ఉమ్మడి హైకోర్టు విశ్రాంత జస్టిస్ చంద్రకుమార్, స్వాతంత్య్ర సమరయోధుడు కందిమళ్ల ప్రతాపరెడ్డి, మీడియా అకాడమీ అధ్యక్షుడు కె. శ్రీనివాసరెడ్డి, ప్రజా గాయని విమలక్క, సీపీఐ జాతీయ కార్యదర్శి సయ్యద్ అజీజ్ పాషా, ఇతర నేతలు చాడ వెంకటరెడ్డి తదితరులు పాల్గొన్నారు.