Share News

DISCOM: స్మార్ట్‌గా మూడో డిస్కమ్‌

ABN , Publish Date - Dec 18 , 2025 | 02:42 AM

రాష్ట్రంలో మూడో డిస్కమ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 29,05,779 వ్యవసాయ పంపుసెట్లు, 489 ఎత్తిపోతల పథకాల కనెక్షన్లు, 99 వాటర్‌బోర్డులు, 1132 మిషన్‌ భగీరథలను కొత్త డిస్కమ్‌ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది...

DISCOM: స్మార్ట్‌గా మూడో డిస్కమ్‌

  • బదలాయించే డీటీఆర్‌లన్నింటికీ స్మార్ట్‌మీటర్లు

  • 1,306 కోట్లతో ఏర్పాటు.. ఒక్కో మీటర్‌కు 25 వేలు

  • 29 లక్షల సాగు కనెక్షన్లు, ప్రభుత్వ కనెక్షన్ల బదిలీ

  • కొత్త డిస్కమ్‌కు రూ.4,929 కోట్ల ఆస్తులు

  • సర్కారు నుంచి రావాల్సినవి రూ.35 వేల కోట్లు

  • రూ.9,032 కోట్ల రుణాలు కూడా బదలాయింపు

  • రెండు వేల మంది సిబ్బంది కేటాయింపు

  • కొత్త డిస్కమ్‌ ఏర్పాటుకు ఆమోదం, మార్గదర్శకాలు

హైదరాబాద్‌, డిసెంబరు 17 (ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో మూడో డిస్కమ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. 29,05,779 వ్యవసాయ పంపుసెట్లు, 489 ఎత్తిపోతల పథకాల కనెక్షన్లు, 99 వాటర్‌బోర్డులు, 1132 మిషన్‌ భగీరథలను కొత్త డిస్కమ్‌ పరిధిలోకి తేవాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు ఇంధన శాఖ ముఖ్యకార్యదర్శి నవీన్‌ మిట్టల్‌ బుధవారం జీవో, మార్గదర్శకాలు జారీచేశారు. ఆదాయానికి, అవసరాలకు మధ్య అంతరంతో దక్షిణ డిస్కమ్‌ (టీజీఎస్పీడీసీఎల్‌-హైదరాబాద్‌), ఉత్తర డిస్కమ్‌ (టీజీఎన్పీడీసీఎల్‌-వరంగల్‌) చితికిపోతున్నాయని, వాటి పరపతి పెంచడానికి వీలుగా కొత్త డిస్కమ్‌ను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆయన ప్రకటించారు. పాత డిస్కమ్‌ల నెట్‌వర్క్‌తోనే కొత్త డిస్కమ్‌ ఏర్పాటు కానుంది. ఎలక్ట్రిసిటీ చట్టం-2003లోని సెక్షన్‌-14 ప్రకారం రెండు లేదా అంతకన్నా ఎక్కువ డిస్కమ్‌లు నెట్‌ వర్క్‌తో ఏర్పాటు చేయడానికి వె సులుబాటు కల్పించడంతో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. గత ఐదేళ్లలో ఆయా కనెక్షన్ల వినియోగం ఆధారంగా కొత్త డిస్కమ్‌కు విద్యుత్తు కొనుగోలు ఒప్పందాలు (పీపీఏ) బదలాయించనున్నారు. ఈ డిస్కమ్‌లకు పంపిణీ ట్రాన్స్‌ఫార్మర్లు (డీటీఆర్‌)లతో పాటు లోటెన్షన్‌ లైన్లను బదలాయించనున్నారు.


రూ.4929 కోట్ల డీటీఆర్‌లు, లైన్లు బదిలీ

రెండు డిస్కమ్‌ల పరిధిలో 5,22,479 వ్యవసాయ డీటీఆర్‌లు ఉండగా, 2,61,240 కి.మీ మేర వ్యవసాయ ఎల్‌టీ(లోటెన్షన్‌) లైన్లు ఉన్నాయి. డీటీఆర్‌ల ఖరీదు రూ.2,792 కోట్లు కాగా, ఎల్‌టీ లైన్ల విలువ రూ.2,137 కోట్లుగా ఉంటుందని లెక్కవేశారు. దాంతో రూ4,929 కోట్ల ఆస్తులు కొత్త డిస్కమ్‌కు బదిలీ కానున్నాయి. కొత్త డిస్కమ్‌ పరిధిలోని ప్రతి డీటీఆర్‌కు స్మార్ట్‌మీటర్‌ బిగించనున్నారు. ఒక్కో మీటర్‌కు రూ.25 వేలు అవుతాయని అంచనా వేసి, మొత్తంగా 5,22,479 వ్యవసాయ డీటీఆర్‌లకు రూ.1,306 కోట్లు అవుతాయని లెక్కతీశారు. దాంతో ఎత్తిపోతల పథకాలు, వాటర్‌బోర్డు, మిషన్‌ భగీరథ కనెక్షన్లకు మీటర్లు ఉండటంతో ఈ కనెక్షన్ల వినియోగం ఇప్పటికే కచ్చితంగా లెక్కిస్తున్నారు. అయితే 29 లక్షలుగా ఉన్న వ్యవసాయ పంపుసెట్లు ఏ మేరకు కరెంట్‌ వినియోగిస్తున్నాయో వాటికి కరెంట్‌ను సరఫరా చేసే డీటీఆర్‌లోని స్మార్ట్‌మీటర్లు కచ్చితంగా లెక్కించనున్నాయి. దాంతో మీటర్‌ రీడింగ్‌ కోసం నేరుగా డీటీఆర్‌ వద్దకు వెళ్లకుండానే స్మార్ట్‌ఫోన్లలో సమాచారం రికార్డు కానుంది. కాగా వార్షిక ఆదాయ అవసరాలు(ఏఆర్‌ఆర్‌), టారిఫ్‌ ప్రతిపాదనలను కొత్తగా ఏర్పడే డిస్కమ్‌లు తెలంగాణ విద్యుత్తు నియత్రణ మండలి(టీజీఈఆర్‌సీ) వేయాల్సి ఉంటుంది.

ఐదేళ్ల వాడకం ఆధారంగా పీపీఏల బదిలీ

ఐదేళ్ల కాలానికి గాను వ్యవసాయ పంపుసెట్లు, ఎత్తిపోతల పథకాలు, వాటర్‌బోర్డు, గ్రామీణ తాగునీటి సరఫరా వ్యవస్థ/మిషన్‌ భగీరథ కనెక్షన్లు ఏ మేరకు విద్యుత్తును వినియోగించాయో ఆ నిష్పత్తి ఆధారంగా కొత్త డిస్కమ్‌కు పీపీఏలను బదలాయించనున్నారు. ఐదేళ్లలో ఆయా కనెక్షన్ల వినియోగం 1,56,775 మిలియన్‌ యూనిట్లుగా రికార్డయింది. మొత్తం విద్యుత్తువినియోగంలో 42 శాతం వాటాను కొత్త డిస్కమ్‌ కలిగి ఉంది. కొత్తగా ఏర్పాటు చేయదలిచిన డిస్కమ్‌కు పాలకమండలితో పాటు సీఎండీని, ఇద్దరు చీఫ్‌ ఇంజనీర్లు (సీఈ), ప్రతి పాత జిల్లాకు ఒక ఎస్‌ఈ చొప్పున 10 మందిని, 38 సర్కిళ్లకు ఒక్కో డీఈని, 90 మంది ఏడీఈలను, 520 మంది సబ్‌ ఇంజనీర్లు, ఆపరేషన్‌ అండ్‌ మెయింటెనెన్స్‌ (ఓఅండ్‌ఎం) ఉద్యోగులతో పాటు ఆర్టిజన్లు కలిపి 1000 మంది, పాలన సిబ్బంది 340 మంది కలుపుకొని 2 వేల మందితో కొత్త డిస్కమ్‌ కొలువు దీరనుంది. వీరిని పాత డిస్కమ్‌ల నుంచే కొత్త డిస్కమ్‌కు సర్దుబాటు చేయనున్నారు.


3 కనెక్షన్ల బకాయిలు బదిలీ..

ఎత్తిపోతల పథకాలకు సంబంధించి రూ.22,926 కోట్లు, వాటర్‌బోర్డు(హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ వర్క్స్‌ సీవరేజీ బోర్డు)కు చెందిన రూ.7084 కోట్లు, మిషన్‌ భగీరథకు సంబంధించి రూ.5972 కోట్లు కలిపి రూ.35,982 కోట్లు ప్రభుత్వం నుంచి డిస్కమ్‌లకు రావాల్సి ఉంది. ఈ బకాయిలన్నీ కొత్త డిస్కమ్‌కు బదిలీ కానున్నాయి. ఇక కేంద్ర విద్యుత్తు సంస్థలకు తెలంగాణ డిస్కమ్‌లు రూ.2466 కోట్లు, రాష్ట్ర జెన్‌కోకు రూ.26,950 కోట్లు, ఐపీపీ/ఇతరులకు రూ.2281 కోట్లు కరెంట్‌ బిల్లుల రూపంలో కట్టాల్సి ఉంది. ఇందులో తెలంగాణ జెన్‌కోకు డిస్కమ్‌లు చెల్లించాల్సి ఉన్న రూ.26,950 కోట్లు కొత్త డిస్కమ్‌కు బదిలీ కానున్నాయి. ఇక 2025 జూలై 31 నాటికీ వర్కింగ్‌ క్యాపిటల్‌ రుణరూపంలో తెలంగాణ డిస్కమ్‌లు రూ.55,979 కోట్ల తీసుకోగా.. అందులో రూ.9032 కోట్లను కొత్త డిస్కమ్‌కు బదలాయించనున్నారు. దాంతో అదృష్టం కలిసొచ్చి.. ప్రభుత్వం నుంచి రూ.35,982 కోట్ల బకాయిలు కొత్త డిస్కమ్‌ రాబట్టుకుంటే.. అందులో నుంచి రూ.26950 కోట్లు జెన్‌కోకు చెల్లించి.. మిగిలిన రూ.9032 కోట్లు రుణరూపంలో కడితే బకాయిలు, రుణాలు తీరనున్నాయి. ప్రస్తుతం రెండు డిస్కమ్‌ల కింద ఉన్న వ్యవసాయ పుంపుసెట్లు, ఎత్తిపోతల పథకాలు, మిషన్‌ భగీరథ, వాటర్‌బోర్డు కనెక్షన్లన్నీ కొత్త డిస్కమ్‌ బదిలీ కానున్నాయి.

త్వరలోనే లైసెన్స్‌ కోసం దరఖాస్తు

కొత్త డిస్కమ్‌ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలుపడంతో లైసెన్స్‌ కోసం తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలి(టీజీఈఆర్‌సీ)లో దరఖాస్తు చేయనున్నారు. కొత్త డిస్కమ్‌కు ‘తెలంగాణ కిసాన్‌ డిస్కమ్‌’గా నామకరణం చేసే అవకాశాలున్నాయని సమాచారం. దాంతో డిస్కమ్‌ ఏర్పాటుకు సమ్మతి తెలుపుతూ ఈఆర్‌సీ అనుమతినివ్వగానే కనెక్షన్లు, పీపీఏలు, బకాయిలు, ఉద్యోగులు ఆ డిస్కమ్‌కు బదిలీ కానున్నారు. అంతేకాకుండా కొత్తగా సీఎండీతో పాటు డైరెక్టర్ల నియామకం కూడా ప్రభుత్వం చేపట్టనుంది.

Updated Date - Dec 18 , 2025 | 02:42 AM